కాలేజీ విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులో కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని వెలుగు దినపత్రిక వెల్లడించింది.
‘‘ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న 9,69,047 లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారు.
ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందు వల్లే జనవరి నుంచి ఏప్రిల్ వరకు డేటా ఉచితంగా ఇస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు.
తమిళనాడులోని విద్యార్థులకు తమిళనాడు ఎలక్రానిక్స్ కార్పొరేషన్ ద్వారా డేటా కార్డులు పంపిణీ చేస్తామన్నారు.
ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఉచిత డేటాను ఉపయోగించాలని ఆయన విద్యార్థులను కోరారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తోంది’’ అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్: నేడు హైదరాబాద్‌కు రాబోతున్న 6.5 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సీన్ సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనుందని నమస్తే తెలంగాణ తెలిపింది.
‘‘పుణె నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వ్యాక్సీన్ చేరుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో 6.5 లక్షల డోసుల వ్యాక్సీన్ వస్తున్నట్టు చెప్పారు.
ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. తొలిరోజు మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న 99 ప్రభుత్వ, 40 ప్రైవేటు కేంద్రాల్లో టీకా వేయనున్నారు. మరోవైపు, ఇతర రాష్ర్టాలు కూడా వ్యాక్సినేషన్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
సోమవారం అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. టీకా పంపిణీకి దేశం సన్నద్ధమవుతున్న వేళ మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా రకానికి చెందిన కరోనా మ్యుటేషన్ వెలుగుచూడటం కలవరపెడుతున్నది. బ్రిటన్ రకం కంటే ఇది ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సీన్ రవాణా, భద్రపరచడంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గన్నవరంలోని రాష్ట్రస్థాయి వ్యాక్సీన్ స్టోరేజ్ పాయింట్‌లో 15 లక్షల డోసులు నిల్వచేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.
గన్నవరం కేంద్రం నుంచి నాలుగు రీజనల్ సెంటర్లు (కర్నూలు, కడప, గుంటూరు, విశాఖ), జిల్లాలకు వ్యాక్సీన్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. గన్నవరంలోని స్టోరేజ్ పాయింట్‌లో ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం పరిశీలించారు. వ్యాక్సీన్ రవాణాకు 19 ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేశారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సును ఛేజ్ చేసిన మంత్రి
కర్ణాటకలో విద్యా శాఖ మంత్రి తన కారుతో ఆర్‌టీసీ బస్సును వెంబడించిన ఘటన చోటుచేసుకుందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
‘‘ఆఫ్‌లైన్ క్లాసులు మొదలవడంతో కర్ణాటకలో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. అయితే.. కొన్ని రూట్లలో కేఎస్‌ఆర్టీసీ బస్సులు విద్యార్థులు వేచి చూస్తూ కనిపిస్తున్నప్పటికీ ఆగకుండా వెళ్లిపోతున్నాయి. దీంతో.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం సవాల్‌గా మారింది. అధికారులకు విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలోనే.. కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ శనివారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి తుమకూరు వెళుతున్నారు.
కారులో వెళుతుండగా కొరటగెరె దగ్గర కొందరు విద్యార్థులు బస్టాప్ దగ్గర నిల్చుని ఉండటాన్ని మంత్రి గమనించారు. అప్పుడే మంత్రి కారును దాటుకుంటూ ఓ ఆర్టీసీ బస్సు అటుగా వెళ్లింది. ఆ విద్యార్థులు బస్సును ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు.
ఈ ఘటనను కళ్లారా చూసిన మంత్రి సురేష్ ఆ బస్సును వెంబడించాలని కారు డ్రైవర్‌కు సూచించారు. కారుతో బస్సును ఛేజ్ చేసిన మంత్రి ఆ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై, కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్య ధోరణిపై ఇద్దరికీ క్లాస్ పీకారు. వివరణ అడగడం మాత్రమే కాదు.. స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం తప్పనిసరిగా బస్సును ఆపాలని ఆదేశించారు’’ అని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Facebook/Kutumbarao
సీనియర్ పాత్రికేయుడు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత
సీనియర్ పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(87) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారని ఈనాడు తెలిపింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందిస్తుండగా 12.30 గంటలకు గుండెపోటు రావడంతో తుర్లపాటి కన్నుమూశారు. కుటుంబరావు 1933 ఆగస్టు 10న విజయవాడలో సుందర రామానుజరావు, శేషమాంబ దంపతులకు జన్మించారు. తన 14వ ఏట 1946లో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు. ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగానూ పనిచేశారు.
తుర్లపాటి కుటుంబరావుకు పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు.
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది.
1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం చలసాని రామారాయ్ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు.
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























