భారత్‌ బయోటెక్‌ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న వ్యక్తి మృతి - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కోవిడ్‌-19 టీకా కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 9 రోజుల తర్వాత మరణించారని ఈనాడు తెలిపింది. అయితే ఈ మరణానికి టీకాతో సంబంధం లేదని వ్యాక్సీన్‌ తయారీ సంస్థ 'భారత్‌ బయోటెక్‌' తెలిపింది.

క్లినికల్‌ ప్రయోగాల్లో భాగంగా భోపాల్‌లోని పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో సదరు వ్యక్తి (42) గత నెల 12న టీకా పొందాడు. అదే నెల 21న అతడు చనిపోయాడని ఆ విద్యా సంస్థ ఉపకులపతి రాజేశ్‌ కపూర్‌ చెప్పారు.

గుండె, ఊపిరి ఆగిపోవడం వల్ల అతడు మరణించి ఉంటాడని, దీనికి విష ప్రయోగం కారణమై ఉండొచ్చని శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు పేర్కొన్నట్లు మధ్యప్రదేశ్‌ మెడికో లీగల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అశోక్‌ శర్మ తెలిపారు.

''వ్యాక్సీన్‌ తీసుకున్న 9 రోజుల తర్వాత ఆ వాలంటీర్‌ చనిపోయాడు. టీకాతో దానికి సంబంధం లేదని ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. దీనికితోడు అతడికి వేసింది నిజమైన టీకానా లేక ఉత్తుత్తి ఔషధమా అన్నది కూడా తెలియదు. ఇది 'బ్లైండెడ్‌' తరహా క్లినికల్‌ ప్రయోగం'' అని భారత్‌ బయోటెక్‌ వివరించింది.

యూపీలో కూడా బర్డ్‌ ఫ్లూ కేసులు

బర్డ్‌ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ కూడా చేరిందని ఆంధ్రజ్యోతి తెలిపింది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రా లు బర్డ్‌ఫ్లూతో విలవిల్లాడుతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌ కాన్పూర్‌లో జంతుప్రదర్శన శాలలోని పక్షులకు వైరస్‌ సోకింది.

దక్షిణ దిల్లీలోని జసోలా ప్రాంతంలో శనివారంనాడు 24కాకులు.. సంజయ్‌ సరస్సు వద్ద మూడు రోజుల్లో 10 బాతులు మరణించాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటి వరకూ మరణించిన పక్షుల సంఖ్య 50కిపైగా ఉంది. దీంతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ మార్కెట్లలోకి బయటనుంచి లైవ్‌స్టాక్‌ సరఫరాను తక్షణమే నిషేధిస్తూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఘజిపూర్‌ మాంసాహార మార్కెట్‌ను 10రోజులపాటు మూసివేశారు.

బర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలోని పర్భని జిల్లా మురుంబా గ్రామంలో 8వేల కోళ్లున్న ఒక పౌలీ్ట్రఫాంలో రెండు రోజుల్లో 900 కోళ్లు మృత్యువాత పడ్డాయి. జనవరి 15 వరకూ లైవ్‌స్టాక్‌తోసహా అన్ని పౌలీ్ట్ర ఉత్పత్తులను పంజాబ్‌లోకి నిషేధించారు.

కేరళలోని రెండు ప్రభావిత ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు, బాతుల వధ పూర్తైంది. మిగతాచోట్ల కొనసాగుతోంది.

తెలంగాణలోని పలుచోట్ల కోళ్లు మృత్యువాత పడుతూనే ఉన్నా యి. వనపర్తి జిల్లా కొత్తకోటలో నాటుకోళ్లు చనిపోతున్నాయి. పశుసంవర్థక శాఖ అధికారులు మాత్రం ‘కొక్కెర వ్యాధి’ అని.. భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు.

దేవాలయాలపై దాడులు: ప్రాథమిక సమీక్ష చేపట్టిన సిట్

దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడే అసాంఘిక శక్తుల గుట్టు రట్టు చేసేందుకు, లోతైన విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విధులు మొదలుపెట్టిందని సాక్షి తెలిపింది.

శనివారం విజయవాడలో సిట్‌ చీఫ్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో తొలి భేటీ జరిగింది. అందుబాటులో ఉన్న సిట్‌ సభ్యులు ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకాగా, విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులతో జూమ్‌ ద్వారా అశోక్‌కుమార్‌ మాట్లాడారు.

రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్‌ నుంచి జరిగిన దేవాలయాల ఘటనలను ప్రాథమికంగా సమీక్షించారు.

రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి, వాటికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్టు అయ్యారు, తదితర అన్ని వివరాలను పోలీసుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

దేవాలయ ఘటనలకు సంబంధించిన కేసుల ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌), కేస్‌ డైరీ (సీడీ ఫైల్స్‌)లను తీసుకుని పరిశీలించనున్నారు. అన్ని కేసులను లోతుగా పరిశీలించి, వాటికి సంబంధించిన ఆధారాలు, వివరాలను సేకరించాలని సభ్యులకు అశోక్‌కుమార్‌ తెలిపారు.

సిట్‌ టీమ్‌ అంతా అంకితభావంతో పనిచేయాలని, ఆలయ ఘటనల్లో మూలాలను వెతికి పట్టుకుని అసలైన దోషులను శిక్షించేలా గట్టి ప్రయత్నాలు చేయాలని అశోక్‌కుమార్‌ సూచించారు. సోమ, మంగళవారాల్లో మరోసారి సమావేశమవ్వాలని సిట్‌ నిర్ణయం తీసుకుంది.

మద్యం మత్తులో కన్నతల్లిని పొడిచి చంపాడు

హైదరాబాద్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు కన్నతల్లినే పొడిచి చంపాడని వెలుగు దినపత్రిక తెలిపింది. ఈ దారుణ సంఘటన ఎస్ఆర్ నగర్ పరిధిలోని.. బల్కంపేటలో జరిగింది.

కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల సంగీత బల్కంపేటలో కొడుకు సంతోశ్(24)​తో కలిసి నివాసముంటోంది. సంగీతకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.

చిన్న కొడుకైన సంతోశ్​కు మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. చెడు అలవాట్లకు బానిసైన సంతోశ్​ను శనివారం తల్లి మందలించగా.. కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపేశాడని ఆరోపిస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు హత్య జరిగినట్టు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే సంఘటన స్థలానికి చేరేలోపే సంగీత మరణించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)