You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బర్డ్ ఫ్లూ కలకలం.. నాలుగు రాష్ట్రాల్లో భారీగా చనిపోతున్న కోళ్లు, బాతులు- ప్రెస్ రివ్యూ
కరోనాతో ఇప్పటికే దేశం సతమతమవుతుంటే, తాజాగా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోందని ఈనాడు ఓ కథనంలో పేర్కొంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. తాజాగా కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య నాలుగుకు చేరింది.
కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల ఈ రెండు జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. వాటి నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపించారు. ఇందులో బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు.
ఆ ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న బాతులు, కోళ్లు వంటి 40 వేలకు పైగా పక్షులను చంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఈ వైరస్ సోకే ప్రమాదమున్న నేపథ్యంలో కొట్టాయం, అలప్పుజ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్ డ్యామ్ లేక్‌లో వలస పక్షులు(బాతులు) బర్డ్‌ఫ్లూ బారిన పడినట్లు అధికారులు పేర్కొన్నారు. సరస్సు అభయారణ్యంలో దాదాపు 1800 వలస పక్షులు ఈ వైరస్ కారణంగా చనిపోయినట్లు తెలిపారు.
పక్షుల నమూనాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.
మరోవైపు రాజస్థాన్‌లో సోమవారం 170 వరకు పక్షులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. ఇటీవల ఈ రాష్ట్రంలో 425 పక్షలు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని మృత్యువాత పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారని ఈనాడు రాసింది.
బీజేపీలో చేరిన జీవిత రాజశేఖర్
సినీ నటి జీవితారాజశేఖర్ వైసీపీని వీడి బీజేపీలో చేరారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
సోమవారం నాడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు.
గ్రేటర్‌కు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల కూడా ఆమెతోపాటు బీజేపీలో చేరారు.
నేతలందరికీ కండువాను సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ జీవితకు మాత్రం ఆయన కండువా కప్పలేదు. దీంతో జీవిత తన మెడలో తాను బీజేపీ కండువా వేసుకున్నారు.
రాజశేఖర్ ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆయన ఈ సందర్భంలో జీవిత పక్కన లేరని తెలిసింది. జీవితారాజశేఖర్ గతంలోనూ బీజేపీలో చేరి కొన్నాళ్లు ఆ పార్టీలో కూడా కొనసాగిన విషయం విదితమే.
అలెక్సా.. ఇక అచ్చతెలుగులో
ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ముచ్చటించిన అలెక్సా యాప్ ఇకపై అచ్చ తెలుగులోనూ మాట్లాడనుందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
తెలుగులో మాట్లాడే అలెక్సాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది.
ప్రాంతీయ భాషలకు ప్రాచుర్యం కల్పించేందుకు ‘బహు భాషక్' పేరిట ఐఐటీ హైదరాబాద్‌లో లాంగ్వేజ్ టెక్నాలజీ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఇందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పైలెట్ ప్రాజెక్ట్ కింద రూ.కోటి సైతం మంజూరుచేసింది.
ఈ వనరులను వినియోగించుకుని ఐఐటీ బృందం తెలుగు స్పీచ్‌డాటాసెట్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు దేశంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే డాటాసెట్లు లభిస్తున్నాయి. దీంతో వాటి తర్వాతి స్థానాన్ని.. ప్రాంతీయభాషల్లో మొదటి స్థానాన్ని తెలుగు సొంతం చేసుకున్నది. ప్రాంతీయ భాషల్లో డాటాసెట్లు తయారుచేయడంతో భాషాపరమైన సమస్యలను అధిగమించినట్లవుతుందని యూనివర్సిటీ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు గల ఈ డాటాసెట్‌లో ఎంత డాటా నిక్షిప్తం చేస్తే అంత సమర్థంగా పనిచేస్తుందని, తాము పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలుగులో 2వేల గంటలపాటు పనిచేసే డాటాసెట్‌ను తయారుచేశామని ప్రొఫెసర్ ప్రకాశ్ ఎల్లా తెలిపారు.
నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిందని వెలుగు దినపత్రిక తెలిపింది.
విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన ఉద్యోగులు అప్రమత్తతతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది తెలియడం లేదు. కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు.
గతేడాది శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కూడా ఇలాగే మంటలు చెలరేగడం తో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నాగార్జునసాగర్ లో అగ్నిప్రమాదం జరిగిందన్న సమాచారం కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)