You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ మద్యపానంలో దేశంలోనే టాప్ -ప్రెస్ రివ్యూ
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం తీసుకునే వారేనని, ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ నిర్వహించినసర్వేలో తేలిందని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది.
ఈ కథనం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 27,351 గృహాలలో 27,518 మంది మహిళలు, 3,863మంది పురుషులపై ఈ సర్వే నిర్వహించగా గ్రామీణ ప్రాంతాల్లో 49శాతంమంది పురుషులు మద్యం సేవిస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మద్యం తీసుకుంటున్నారని తేలింది.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నలుగురులో ఒకరు మద్యపానం చేస్తుండగా, గుజరాత్‌లో అత్యల్పంగా ప్రతి 16 మందిలో ఒకరు మాత్రమే ఆల్కాహాల్ సేవిస్తున్నారని బైటపడింది.
తెలంగాణలో మద్యం సేవించే మహిళల విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతంమంది, పట్టణ ప్రాంతాల్లో 2.6శాతంమంది మద్యం తాగే వారున్నారు.
గతంతో పోల్చితే తెలంగాణలో శిశుమరణాలు తగ్గాయని, సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు పెరగడంతోపాటు లింగ నిష్పత్తిలో కూడా మార్పు వచ్చిందని ఈ సర్వే వెల్లడించింది. గతంలో వెయ్యిమంది పురుషులకు 1007మంది మహిళలుండగా, ఇప్పుడా సంఖ్య 1049కు చేరుకున్నట్లు పేర్కొంది.
నెల్లూరులో ఏలూరు తరహా వ్యాధి లక్షణాలు
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి తరహాలో నెల్లూరులో కూడ కొందరిలో లక్షణాలు కనిపించాయని, ఒక వలస కూలీ మృతి చెందారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం వరినాట్ల కోసం పశ్చిమబెంగాల్ నుంచి వలస వచ్చిన 53మంది కూలీలలో ఒకరు అనుమానాస్పద వ్యాధితో మరణించారు. మొత్తం 10మంది అనారోగ్యం పాలయ్యారు. మొదట ముగ్గురు అస్వస్థతకు గురికాగా, తర్వాత ఏడుగురు ఇదే లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు.
వీరిలో ఒకరు మరణించగా ఇంకొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధిబారిన పడినవారిలో ఎక్కువమంది వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు.
విషయం తెలిసిన అధికారులు వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సమస్యకు కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులు తాగిన నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారని, మిగిలిన కూలీలలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి పరిశీలనలో ఉంచినట్లు అధికారులు చెప్పారని ఈనాడు కథనం పేర్కొంది.
సీబీఐలో ఆఫీసులో దొంగలు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలోనే దొంగలు పడ్డారని, ఓ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారంలో 103 కిలోల పసిడి మాయంపై మద్రాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఈ కేసుపై శుక్రవారంనాడు విచారణ చేపట్టిన కోర్టు సీబీఐ కస్టడీలోని బంగారం అదృశ్యం సంగతి తేల్చాలంటూ సీబీసీఐడీని ఆదేశించిందని, ఆరు నెలల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని సూచించినట్లు ఈ కథనం పేర్కంది. .
2012లో చెన్నైలోని సురాణా అనే కంపెనీపై నమోదైన ఓ అవినీతి కేసులో సీబీఐ ఆ కంపెనీ నుంచి 400.47 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని కంపెనీ వాలెట్‌లో పెట్టి సీల్ వేసింది. ఇదే సమయంలో సురాణా కంపెనీ రుణాల ఎగవేతపై పలు బ్యాంకులు కేసులు పెట్టాయి.
ఈ కేసుపై 2019 డిసెంబర్‌లో విచారణ జరిపిన ట్రైబ్యూనల్.. బంగారం మొత్తాన్ని బ్యాంకులకు అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో సీబీఐ వాలెట్‌ను తెరిచింది. అందులోని బంగారాన్నితూకం వేయగా 296.606 కిలోల బంగారమే ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 103 కిలోల బంగారం మాయమైంది. దీని విలువ సుమారు రూ. 45 కోట్ల వరకు ఉంటుంది.
బంగారం మిస్సింగ్ కేసు సీబీఐకి అగ్నిపరీక్ష వంటిదని ‘సీబీఐ సీతమ్మ అంత పవిత్రంగా ఉంటే, మీ చేతులకు ఎలాంటి అవినీతి మరకలు లేకపోతే.. అగ్నిలోంచి వచ్చిన సీతలా.. మీరు కూడా ఈ కేసు నుంచి బయటపడతారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని మద్రాస్ హైకోర్టు హెచ్చరించిందని నమస్తే తెలంగాణ కథనం వెల్లడించింది.
ఆ ముగ్గురిని కేంద్రానికి పంపండి... నడ్డాపై దాడి వ్యవహారంలో కేంద్రం సీరియస్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి వ్యవహారంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోందని సాక్షి పత్రిక రాసింది.
ఈ ఘటన సందర్భంగా విధుల నిర్వహణలో విఫలమయ్యారంటూ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం సమన్లు జారీ చేసినట్లు ఈ కథనం పేర్కొంది.
సాధారణంగా పోలీసు అధికారుల్ని కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌కి పిలిచే ముందు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, కానీ కేంద్రం ఏకపక్షంగా సమన్లు జారీ చేసిందని సాక్షి పేర్కొంది.
మరోవైపు నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించడానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను దిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంపై మమతా సర్కార్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేంద్రం అందులో తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి లేఖ కూడా రాశారని సాక్షి కథనం వెల్లడించింది.
అయితే నిబంధనల ప్రకారం అధికారులను డిప్యూటేషన్ మీద పంపాలని కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే రాష్ట్రం వాటిని పాటించక తప్పదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నట్లు కూడా ఈ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: బొల్లారం ఐడీఏలో భారీ పేలుళ్లు.. ఎనిమిది మందికి గాయాలు
- రష్యా ప్రజలు స్పుత్నిక్-వి టీకా వేయించుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
- కరోనావైరస్: ఫైజర్ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అమెరికా FDA ఆమోదం
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- అయిదు హత్యలు, ఆరుగురు నిర్దోషులు, చేయని తప్పుకు చేజారిన 16 ఏళ్ళ జీవితం
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)