నీహారిక పెళ్లి ఉదయపూర్‌లో.. 3 విమానాలు... 120 మంది ఆహ్వానితులు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

నాగబాబు కుమార్తె నీహారిక వివాహానికి పెళ్లివారు మూడు విమానాల్లో ఉదయపూర్ వెళ్లారని ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కథనం ప్రచురించింది.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌ విలాస్‌ ప్యాలె్‌సలో బుధవారం రాత్రి చైతన్య, నిహారిక వివాహం జరుగుతుంది.

వధూవరులు, వాళ్ల కుటుంబాలతో పాటు ఆహ్వానితులు అందరూ సోమవారమే ఉదయ్‌ విలాస్‌ చేరుకున్నారు.

తొలుత కాబోయే వియ్యంకులు నాగబాబు, రిటైర్డ్‌ ఐజీ ప్రభాకరరావు కుటుంబాలు ఓ ప్రైవేట్‌ జెట్‌లో ఉదయ్‌పూర్‌ వెళ్లారు.

విమానంలో కుటుంబ సభ్యులందరూ దిగిన సెల్ఫీని వరుణ్‌తేజ్‌ సహా చైతన్య, నిహారిక సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

‘‘నిశ్చయ్‌ (నిహారిక ప్లస్‌ చైతన్య) బిగిన్స్‌’’ అని పేర్కొన్నారు. ఉదయ్‌ విలాస్‌ చేరుకున్న తర్వాత వధూవరులు చేసిన నృత్యం నెటిజన్లను ఆకర్షించింది.

మెగాస్టార్‌ కుటుంబం... చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన మరో విమానంలో వెళ్లారు. తండ్రి చిరంజీవి స్కెచ్‌ ఫొటో మాస్క్‌ను ధరించిన రామ్‌చరణ్‌ ‘‘బాస్‌ మాస్క్‌’’ అని పేర్కొన్నారు.

అల్లు అరవింద్‌ దంపతులు, పిల్లలతో పాటు అల్లు అర్జున్‌-స్నేహారెడ్డి దంపతులు ఇంకో విమానంలో ఉదయ్‌పూర్‌ వెళ్లారు. ‘‘చాలా సంవత్సరాల తర్వాత కుటుంబమంతా కలిసి విమాన ప్రయాణం చేస్తున్నాం. నిహారిక, చైతన్య పెళ్లి సంబరాలు మొదలయ్యాయి’’ అని అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు.

పిల్లలతో సహా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత-విష్ణుప్రసాద్‌ దంపతులు, చిన్న కుమార్తె శ్రీజ- కల్యాణ్‌దేవ్‌ దంపతులు, చిరంజీవి మేనల్లుళ్లు సాయితేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ సహా వాళ్ల తల్లిదండ్రులు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారని ఆంధ్రజ్యోతి రాసింది.

తెలంగాణలో వరికి బదులు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్రాహం

తెలంగాణలో వరిసాగుకు బదులు ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించాలని సీఎం నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

వరిసాగుతో అంతంత మాత్రంగానే లాభాలు ఆర్జిస్తున్న రైతుకు అధిక లాభాలు అందించేందుకుగాను రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

ఇందులో భాగంగా రాబోయే నాలుగేండ్లలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుచేయాలని నిశ్చయించారు.

ఇందుకు సంబంధించి రూ.4,800 కోట్ల వ్యయంతో ఆయిల్‌పామ్‌ పంట విస్తరణ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ సోమవారం ఆమోదం తెలిపారు.

ప్రగతిభవన్‌లో ఈ మేరకు జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించడానికి రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఆయిల్‌పామ్‌ సాగును నాలుగేండ్లలో ఏకంగా 8 లక్షల ఎకరాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి వసతి అధికంగా గల జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుచేయాలని నిర్ణయించింది.

ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో వరి ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారని నమస్తే తెలంగాణ రాసింది.

రాష్ట్రంలోని మెజార్టీ రైతులు ఎక్కువగా వరిసాగుకు అలవాటుపడ్డారు. దిగుబడి తక్కువగా వచ్చినా.. ఎక్కువొచ్చినా.. నష్టమొచ్చినా.. లాభం వచ్చినా వరిని సాగుచేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలు లేకపోవడంతో రైతులు అనివార్యంగా వరివైపు మొగ్గు చూపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వరిపంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నది.

వరితో పోల్చితే నీళ్లు ఎక్కువగా అవసరం ఉండవు. ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీళ్లతో నాలుగెకరాల ఆయిల్‌ పామ్‌ తోటను సాగుచెయ్యొచ్చని పత్రిక తన కథనంలో వివరించింది.

కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్

కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ అనుమతి కోరిందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

కొవిడ్‌-19 నివారణకు తాము అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలని ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కోరింది.

ఈ మేరకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసిందని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి.

కొవాగ్జిన్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో దేశీయంగా భారత్‌ బయోటెక్‌ రూపొందించింది.

ఇప్పటికే ఫైజర్, సీరం సంస్థలు కూడా తమ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ మూడు కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుందని ఈనాడు తెలిపింది.

దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌-19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ ధరలు

ఉత్పత్తి వ్యయం పెరగడంతో టీవీ, ఫ్రిజ్‌ ధరలు పెరగనున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

టీవీ, వాషింగ్‌ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్‌ ఓవెన్‌ తదితర వైట్‌ గూడ్స్‌ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు.

ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి.

వైట్‌ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్‌ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి.

రాగి, జంక్, అల్యూమినియమ్‌ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్‌ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్‌ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్‌ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్‌ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది.

వైట్‌ గూడ్స్‌ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు.

మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్‌ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది.

ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం అని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)