కేసీఆర్: ఆలోచించి ఓటు వెయ్యండి.. ఆగం కాకండి- ప్రెస్ రివ్యూ

ప్రచురణ

విచ్చిన్నకర శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్నాయని, వాటి వలలో పడొద్దని, ఆగం కావొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హైదరాబాద్‌ ప్రజలను కోరారని సాక్షి కథనంలో తెలిపారు.

శనివారం జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగ వివరాలివి...

"విద్వేషపూరిత ప్రసంగాలతో ఆవేశానికి లోను కావొద్దని, విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. హైదరాబాద్‌ ప్రగతి కోసం ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ‘హైదరాబాద్‌ల ఇప్పుడు చానా తమాషా జరుగుతా ఉంది. వరద వచ్చింది ఆదుకోండి, పది రూపాయలు ఇవ్వండి అంటే ఇయ్యలె. కాని ఇప్పుడు వరదలా వస్తున్నరు హైదరాబాద్‌కు. ఇది మున్సిపల్‌ ఎలక్షనా? నేషనల్‌ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా?

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక... భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తరా? ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏం జరుగుతా ఉంది? ఏందీ కథ?’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విపక్షాలపై ధ్వజమెత్తారు. అన్నివర్గాలు కలిసి ఉండే పూలబొకేలాంటి హైదరాబాద్‌ కావాలి. ఇందులోకి ఉడుములు చొచ్చినట్టు చొచ్చి... పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు కొందరు. వారి పంథా మనకు మంచిది కాదు. వారి మాటలకు మోసపోవద్దు. హైదరాబాద్‌లో ఉండే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించాలి’అని కేసీఆర్‌ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ మీ బిడ్డ. తెలంగాణ గడ్డ బిడ్డ. రక్తం. ఈ దేశంలో జరుగుతున్న అనేక దుర్మార్గాలు జూసి తడి, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోర వాస్తవాలు నేను బయటపెట్టిన. ఈ రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) ఘోరంగా విఫలమైనాయి. అందుకే నేను ఓ నినాదం ఇచ్చాను. కానీ ఫ్రంట్‌ లేదు గింట్‌ లేదు అన్నరు. నేనన్ననా ఫ్రంట్‌ ఉంటదని? ఎందుకు ఢిల్లీలో గజగజ వణుకుతున్నరు. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు.. ఏ వీడొక్కడు ఏం చేస్తడు. బొండిగ పిసికితే అయిపోతది అన్నరు. ఎవరి బొండిగ పిసకాలో పిసికి బాజాప్తా తెలంగాణ తెచ్చిన. నేను ఢిల్లీకి బయలుదేరకుండా ఇక్కడే ఆపేయాలని వరదలాగా, బురదలాగా వస్తున్నరు.

రాష్ట్రం ఏర్పడ్డాక ఏడెనిమిది మాసాల్లో మొత్తం కరెంట్‌ బాధలు తీర్చినం. మిషన్‌ భగీరథను ఐదేళ్లలో చేసి ఇవ్వకపోతే ఓట్లు అడగం అని చెప్పిన మగతనం ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ. కరోనా రక్కసితో రాష్ట్రానికి రూ.52 వేల కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. ఏటా రూ.40 వేల కోట్లకు పైచిలుకు డబ్బుతో కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నం. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసినం. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలె. దీనికి సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ప్రతి బడ్జెట్‌లో కేటాయిస్తం. నాలాలన్నీ కబ్జా అయినయి. మురుగు కాల్వలన్నీ మూసుకుపోయాయి. వాటన్నింటిని తొలగించాలి. తాత్కాలిక, మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలె. జీహెచ్‌ఎంసీలో మీరు భారీగా గెలిపించండి. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అండగా ఉంటుంది. హైదరాబాద్‌లో కానీ, రాష్ట్రంలో కానీ కుల, మత జాతి, ప్రాంత వివక్ష చూపలేదు. గత ఆరేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఒక శ్రేష్టమైన, అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ తయారు కావాలి. కొందరి కోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేసే ఎజెండా మాది కాదు.

ఉజ్వలంగా ప్రగతిబాటలో ముందుకు పరుగుపెడుతున్న హైదరాబాద్‌ పురోగతిని అస్థిరపరిచే శక్తులు కుయుక్తులతో ముందుకొచ్చాయి. ప్రజల్లో చిచ్చుపెట్టి విడదీసే కుట్రలు చేస్తున్నాయి. వారి నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన తరుణమొచ్చింది. వెంటనే మేల్కొనండి, విజ్ఞతతో ఆలోచించండి" అని కేసీఆర్ అన్నారు.

నివర్ తుపానుబాధితులకు రూ.5లక్షల పరిహారం...జగన్

నివర్‌ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ, పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో ప్రచురించింది.

‘‘డిసెంబరు15లోగా తుపాను నష్టంపై నివేదిక ఇవ్వండి. అదే నెల 31వతేదీ లోగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం. తుపాను బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు చొప్పున పరిహారం అందించాలి. వర్షాలు, వరదలతో నిరాశ్రయులై, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి ఒక్కరికీ రూ.500చొప్పున తక్షణం అందజేయాలి’’ అని సీఎం నిర్దేశించారు. శనివారం నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో తుపాను నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివర్‌ తుపాను కలిగించిన నష్టాల అంచనాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారని ఈ వార్తలో రాసారు.

చిత్తూరులో ఆరుగురు, కడపలో ఇద్దరు వరదల్లో చిక్కుకుని చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం వెంటనే అందజేయాలని జిల్లాకలెక్టర్లను కోరారు.

‘‘పంట నష్టపోయిన రైతులకు తక్షణం 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలి. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరదలతో దెబ్బతిన్న కడపలోని ఫించా, అన్నమయ్య ప్రాజెక్ట్‌ పనులను వెంటనే పునరుద్ధరించాలి. అత్యధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పునరుద్ధరించాలి. కడప నగరంలో బుగ్గవంక ప్రాజెక్ట్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సంబంధిత పనులకు అనుమతులిస్తూ వెంటనే పనులు ప్రారంభించాలి’’ అని అధికారులను ఆదేశించారంటూ ఈ కథనంలో పేర్కొన్నారు.

నిజాం పాలన మళ్లీ రావాలా?...యోగీ ఆదిత్యానాథ్

"హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కలిపేందుకు నిజాం చేసిన కుట్రను సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాడు అడ్డుకున్నారు. ఇక్కడి ప్రజలంతా మద్దతు పలకడంతో నిజాంల పాలన అంతమైంది. ఇప్పుడు నిజాంకు ప్రతిరూపంగా మారిన మరో నయా నిజాం ఆలోచనలను సాగనివ్వకూడదు’’ అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారని ఈనాడు కథనంలో పేర్కొన్నారు.

ఎంఐఎంతో కలిసి తెరాస నగరవాసులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుటుంబం, మజ్లిస్‌ పార్టీపైనే ప్రేమ ఉంది తప్ప ప్రజలపై కాదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా కూకట్‌పల్లి నుంచి ఆల్విన్‌ కాలనీ ప్రధాన కూడలి వరకూ భాజపా నిర్వహించిన రోడ్‌షోలో, పాతబస్తీ లాల్‌దర్వాజ వద్ద నగర శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఎంఐఎం నాయకులు బెదిరింపులకు పాల్పడుతుండగా, వారితో తెరాస దోస్తీ చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో నగరం అభివృద్ధిని ఊహించగలమా? అని ప్రశ్నించారు.

‘‘400 ఏళ్ల నాటి సమస్యను సున్నితంగా పరిష్కరించుకుని అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకుంటున్నాం. అలాంటిది హైదరాబాద్‌ పేరును మార్చుకోలేమా. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చాం. ఫైజాబాద్‌ అయోధ్యగా మారింది. భాజపాను గెలిపిస్తే హైదరాబాద్‌ కూడా భాగ్యనగరంగా మారుతుంది. ఆ క్రతువును నెరవేర్చేందుకు మీ అందరితో కలిసి పనిచేయడానికే నగరానికి వచ్చా. అలా మార్చే శక్తి భాజపాకే ఉంది’’ అని స్పష్టంచేశారు. అవినీతి లేని హైదరాబాద్‌ కావాలన్నా, దిల్లీ నుంచి నేరుగా నిధులు తెచ్చుకోవాలనుకున్నా భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారని ఈ కథనంలో తెలిపారు.

శంషాబాద్‌లో పులి తిరగడం లేదు

శంషాబాద్‌ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతుదంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అటవీశాఖ స్పష్టం చేసిందంటూ వెలుగులో ప్రచురించారు.

శంషాబాద్‌ ఇందిరమ్మ కాలనీలో పులి కనిపించిందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో శనివారం అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది. అక్కడికి వెళ్లి పరిసరలాను పరిశీలించి, స్థానికులతో మాట్లాడిన తరువాత ఇదంతా తప్పుడు సమాచారమని అధికారులు తేల్చారని ఈ ప్రకటనలో వెల్లడించించారు. శంషాబాద్‌ పరిసర ప్రాంతాలకు పులి వచ్చే అవకాశమే లేదని, వన్యమృగాల సంచారంపై ఏదైనా సమాచారం ఉంటే ముందుగా అటవీశాఖ అధికారులతో ధృవీకరించుకోవాలని కోరిందంటూ ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)