కేసీఆర్: ‘తెలంగాణలో మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయి’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త రాసింది.

అరాచకశక్తుల కుట్రలపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని, అలాంటి వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించానని కేసీఆర్ అన్నారు.

‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు చాలా కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృతచేష్ట చేసి, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు’’ అని చెప్పారు.

‘‘శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానం. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకొనే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలి’’ అని వ్యాఖ్యానించారు.

‘దిశ యాప్‌కు 11 లక్షల డౌన్‌లోడ్లు’

మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తీసుకువచ్చిన దిశ మొబైల్ యాప్‌‌కు ఇప్పటివరకూ 11 లక్షల డౌన్‌లోడ్లు వచ్చాయంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం రాసింది.

ఆపదలో ఉన్న మహిళలకు తక్షణం పోలీసుల సాయం అందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఈ యాప్‌ను తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు.

ఇప్పటివరకూ ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను 79,648 మంది ఉపయోగించుకున్నారు. తాము ప్రమాదంలో ఉన్నట్టు పోలీసులకు తక్షణ సంకేతాలిచ్చేలా ఈ బటన్‌ ఉపయోగపడుతోంది. వీరిలో బటన్ ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ప్రయత్నించిన వాళ్లు, అనుకోకుండా బటన్‌ ప్రెస్‌ చేసినవాళ్లు చాలా మంది ఉన్నారు.

దిశ యాప్‌ ద్వారా సహాయం కోరిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో 604 మంది మహిళలకు సేవలు అందించారు.

దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేసిన పోలీసులు 122 కేసులు నమోదు చేశారు. బాధిత మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చుననే వెసులుబాటుతో పోలీసులు 341 జీరో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘ధరణి సమాచారం హ్యాక్‌ కాదని భరోసా ఏమిటి?’

తెలంగాణలో ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్న సమాచారం హ్యాకింగ్‌కు గురికాదని భరోసా ఏమిటని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయడం మంచి పద్ధతేనని, అందరూ సంతోషిస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కానీ, ధరణిలో నమోదు చేసుకోకపోతే ఆస్తి బదలాయింపు జరగదనడం ఆర్టికల్‌ 300ఏ కింద రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును ఉల్లంఘించడం కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.

ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదు కోసం ఆధార్‌ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది కాశీభట్ల సాకేత్‌, గోపాల్‌ శర్మలు వేర్వురుగా ప్రజాహిత వాజ్యాలు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి కె.ఆనంద్‌కుమార్‌ మరికొందరు దాఖలు చేసిన బ్యాచ్‌ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.

‘‘వైట్‌హౌస్‌, బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ల డేటానే హ్యాక్‌ అయ్యింది. డేటా దుర్వినియోగం అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ధరణి వెబ్‌ పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేసుకోకపోతే.. ఇకపై క్రయ, విక్రయాలకు అవకాశం ఉండదని పత్రికా ముఖంగా ప్రకటనలు చేశారు. దీనిపై ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమే’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

‘జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థుల్లో నేరచరితులు 49 మంది’

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారు 49 మంది ఉన్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

మొత్తం 150 వార్డుల నుంచి 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం మొత్తం 41 డివిజన్లలో నేరచరితులున్నట్లు స్పష్టమవుతోంది.

కిందటిసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరితులు బరిలో నిలవగా.. ఈసారి ఆ సంఖ్య 49కి తగ్గింది. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.

మల్కాజిగిరి (140వ వార్డు)లో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నేరచరిత్ర కలిగిన వారే కావడం గమనార్హం.

సంఖ్యాపరంగా బీజేపీలో (17 మంది) , శాతం పరంగా ఎంఐఎంలో (14 శాతం) నేరచరితులు అత్యధికంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)