You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్ట్రేలియా: షార్క్ దాడిలో వ్యక్తి మృతి - Newsreel
పశ్చిమ ఆస్ట్రేలియాలోని కేబుల్ బీచ్‌లో షార్క్ దాడి చేయడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
షార్క్ దాడిలో గాయపడిన ఆయన్ను వెంటనే సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే అతడు చనిపోయారు. కేబుల్ బీచ్‌లో జరిగిన షార్క్ దాడిలో ఒక వ్యక్తి చనిపోయినట్లు పశ్చిమ ఆస్ట్రేలియా పోలీసులు ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.దాడి జరిగిన బీచ్‌ను మూసివేసిన అధికారులు, అక్కడ సముద్రంలోకి వెళ్లవద్దని స్థానికులను కోరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా జలాల్లో షార్కులు దాడి చేయడం ఇది ఎనిమిదోసారి. వ్యక్తిపై దాడి చేసిన షార్క్ కోసం గాలిస్తున్నారు.
2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 షార్క్ దాడులు జరిగాయని ఆస్ట్రేలియా ప్రభుత్వ సంస్థ టరోంగా కన్జర్వేషన్ సొసైటీ ఆస్ట్రేలియా చెప్పింది. అయితే, బ్రూమె పట్టణానికి సమీపంలో ఉండే కేబుల్ బీచ్‌లో షార్కులు దాడి చేయడం చాలా అరుదు.'ఈ తీరంలో ఎక్కువగా రీఫ్ షార్కులు, షవెల్ ముక్కు రేలు, హ్యామర్ హెడ్‌లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి దాడులు జరగవు, ఈ దాడి జరగడం విషాదకరం" అని బీచ్‌లో వ్యాపారం చేసుకునే డెరిల్ రాబర్సన్ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఏబీసీతో అన్నారు.
గ్వాటెమల పార్లమెంటు భవనానికి నిప్పంటించిన నిరసనకారులు
గ్వాటెమలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వందలాది మంది నిరసనకారులు కాంగ్రెస్ (పార్లమెంటు) భవనానికి పలుచోట్ల నిప్పటించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఆ సమయంలో కాంగ్రెస్ భవనం ఖాళీగానే ఉంది. వెంటనే అగ్నిమాపక దళం రంగంలోకి దిగి మంటలు ఆర్పివేసారు. అయితే, ఎంతవరకూ నష్టం చేకూరిందో ఇంకా తెలియలేదు.
బుధవారం నాడు ఆ దేశ ప్రభుత్వం ఆమోదించిన బడ్జెట్‌ను నిరసిస్తూ పలువురు నిరసనలు చేపట్టారు. దేశాధ్యక్షుడు అలెహాంద్రో జియామత్తై రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వంతో కనెక్షన్లు ఉన్న కంపెనీలు నిర్వహించే పెద్ద పెద్ద మౌలిక సదుపాయాల ప్రోజెక్టులకే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, కోవిడ్ 19 వలన ఏర్పడిన సామాజిక, ఆర్థిక విపత్కర పరిస్థితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
శుక్రవారం నాడు దేశ ఉపాధ్యక్షుడు గిల్లేర్మో కాస్టిల్లో కూడా బడ్జెట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. దేశాధ్యక్షుడు జియామత్తై, తాను కూడా గద్దెనుంచీ దిగిపోవడమే దేశానికి మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ: మరణిస్తూ 8 మందికి 'మరో జన్మ' ఇచ్చిన హైదరాబాద్ కానిస్టేబుల్
కోనేరు ఆంజనేయులుది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్ గ్రామం.
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో స్పెషల్ పార్టీలో ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ పని చేస్తున్నారు. 2018 బ్యాచ్ ఆయనది.
ఈ నెల 18వ తేదీన విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సోమన్ గుర్తి గేటు వద్ద మన్నెగూడెం వైపు వేగంగా వెళ్తున్న బోలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, శరీరానికి బలమైన గాయాలయ్యి అపస్మారక స్థితికి చెరుకున్నారు.
ఇది గమనించిన చుట్టుపక్కన వారు చికిత్స నిమిత్తం ఆంజనేయులును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కుటుంబ సభ్యులు ఆంజనేయులును మెరుగైన చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆయన బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు శనివారం (నవంబర్ 21) ఉదయం నిర్ధారించారు.
ఆంజనేయులు కుటుంబసభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పరామర్శించారు. ఆంజనేయులు శరీరంలోని అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడవల్సిందిగా వారిని సీపీ కోరారు. అందుకు వారు అంగీకరించారు.
కానిస్టేబుల్ కొనేరు ఆంజనేయులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, కళ్లు తదితర ఎనిమిది అవయవాలను ఇతరులకు ఉపయోగించేందుకు గాను సైబరాబాద్ పోలీసుల ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ 'మరో జన్మ' సహకారంతో ప్రభుత్వరంగ సంస్థ 'జీవన్ దాన్'కు అప్పగించారు.
తమ కుటుంబ సభ్యుడు ఇక లేరనే బాధలో ఉన్నప్పటికీ మరో ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను సీపీ అభినందించారు.
కానిస్టేబుల్ కొనేరు ఆంజనేయులు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్‌కు తరలించారు. బాబాపూర్‌లో ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాడె కూడా మోశారు. మృతుడి కుటుంబాన్ని పోలీస్ శాఖాపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సైబరాబాద్ పోలీసుల 'మరో జన్మ'
అవయవదానం మీద ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గాన్ డొనేషన్ శాతాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రెండేళ్ల కిందట సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 'మరో జన్మ' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం చేస్తే ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చిన వారవుతారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
బ్రెయిన్ డెడ్ సమయంలో అవయవ దానం కోసం సమాచారం ఇచ్చేందుకు ల్యాండ్ లైన్ నంబర్ 040 2348 9495, 9603944026, 88850 60093 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చు...
ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో వికలాంగులకు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి, కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కేటగిరీల్లోని వారు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ, నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి కానీ వినియోగించుకోవచ్చునని చెప్పింది.
పోలింగ్ కేంద్రంలో వికలాంగులు, వయస్సు పైబడిన వారి కోసం ర్యాంపులు ఏర్పాటు చేసి, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పింది.
వికలాంగులు, వయస్సు పైబడిన వారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్‌లలో నిలుచోవలసిన అవసరం లేదు. వారు నేరుగా వెళ్లి ఓటు వేయవచ్చు.
కోవిడ్ 19 పేషెంట్లు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- ‘గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)