పవన్ కల్యాణ్: హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు - Press Review

పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి భేటీ

ఫొటో సోర్స్, @JanaSenaParty

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు జనసేన మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ప్రకటించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్‌, తెలంగాణకు సంబంధించి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బల్దియా ఎన్నికల పోటీ నుంచి తమ అభ్యర్థులను ఉపసంహరించుకొంటున్నట్లు ఆయన తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన మద్దతు కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌.. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌కల్యాణ్‌ను కలిశారు. సుమారు రెండు గంటల పాటు వారు చర్చించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలనుకున్నప్పటికీ కరోనా, అనూహ్యంగా వచ్చిన ఎన్నికల నేపథ్యంలో సాధ్యపడలేదన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

జీహెచ్‌ఎంసీతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీకి ఉంటుందని పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

''ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. జనసేన కార్యకర్తలంతా భాజపా విజయం కోసం పనిచేయాలి. తెలంగాణలో జనసేన, బీజేపీ రోడ్‌మ్యాప్‌ను భవిష్యత్‌లో ప్రకటిస్తాం. ఇప్పటికే నామినేషన్‌ వేసిన జనసేన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలి'' అని పవన్‌కల్యాణ్‌ కోరారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం అయ్యామని, ఆయన సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ గెలుపు కోసం జనసేన కార్యకర్తల మద్దతు, ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ ప్రచారం అవసరమని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దిల్లీలో కాలుష్యం దెబ్బ.. గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న సోనియా

విశ్రాంతి నిమిత్తం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నాడు గోవా రాజధాని పణజి చేరుకున్నారని.. ఆమె వెంట కుమారుడు రాహుల్‌ గాంధీ కూడా ఉన్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉండడంతో సోనియాకు ఛాతీలో విపరీతమైన సమస్య ఏర్పడింది. ఉబ్బస వ్యాధి ఎక్కువై శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోంది. కొన్నాళ్లుగా ఆమె ఛాతీసమస్యలతో బాధపడుతున్నారు.

వాయుకాలుష్యం వల్ల ఆమె ఇబ్బంది మరింత ఎక్కువైనట్లు గ్రహించిన డాక్టర్లు వెంటనే దిల్లీని వీడి ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో కొన్నాళ్లు గడపాలని సూచించారు. దాంతో ఆమె హుటాహుటి పణచి చేరుకున్నారు.

దక్షిణ గోవాలోని ఓ రిసార్టులో ఆమె విశ్రాంతి తీసుకుంటారు. ఆరోగ్య సమస్యల వల్ల ఆమె కొన్నాళ్లుగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు.

కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

పని గంటలు 12కు పెంపు.. లేబర్‌ కోడ్‌ రూల్స్‌ సిద్ధం చేసిన మోదీ సర్కార్‌

ప్రపంచ కార్మికులు ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 'రోజుకు 8 గంటల పని' అనే హక్కును రద్దు చేయడానికి మోదీ సర్కార్‌ సిద్ధమైందని.. రోజుకు 12 గంటలు పని అమలుజేయాలని లేబర్‌ కోడ్‌ తీసుకురాబోతున్నదని 'నవ తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. పని గంటల్ని మారుస్తూ 'కోడ్‌ ఆన్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌' అనే లేబర్‌ కోడ్‌ను సిద్ధం చేసింది. ఇప్పటివరకూ ఉన్న 13 కార్మిక చట్టాల్ని మారుస్తూ, వాటి స్థానంలో ఈలేబర్‌ కోడ్‌ను తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర కార్మిక శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.

లేబర్‌ కోడ్‌లోని నిబంధనలపై వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, మార్పుల్ని కోరుతూ 45 రోజుల గడువు ప్రకటించింది. తాజా నోటిఫికేషన్‌లో పని గంటల పెంపు, 8 గంటల కంటే ఎక్కువ పనిచేసినా ఆ గంటలకు ఓవర్‌టైం వేతనం ఇవ్వాలి. ఈ లెక్కన డబుల్‌ వేతనం పొందేందుకు అర్హులవుతారని ప్రకటించింది.

అయితే మోదీ సర్కార్‌ తీసుకున్న కార్మిక వ్యతిరేక నిబంధనలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి నాలుగు లేబర్‌ కోడ్‌లపై పార్లమెంట్‌ ఆమోదం పొంది, వీలైనంత తొందరగా చట్టాల్ని అమల్లోకి తీసుకురావాలని మోదీ సర్కార్‌ భావిస్తోంది.

పని గంటల్ని పెంచుతూ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మరికొన్ని రాష్ట్రాలు కొద్ది నెలల క్రితం చట్టాలు చేయటంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

సీబీఐ.. బీజేపీ ప్రభుత్వంలో పాన్‌ షాప్‌

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పరిధిపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర మత్స్య, జౌళి శాఖ మంత్రి అస్లాం షేక్‌ శుక్రవారం స్వాగతించారని 'సాక్షి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. సీబీఐ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఒక పాన్‌ షాప్‌లా మారిందని ఆయన ఆరోపించారు. సీబీఐ ఎక్కడికైనా వెళ్తుందని, ఎవరిపై అయినా కేసు పెడుతుందని అన్నారు.

బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లోనే తన ప్రతాపం చూపిస్తుందని ఎద్దేవా చేశారు. ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.సీబీఐకి దాని పరిధి ఏమిటో గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అక్కడ దర్యాప్తు ప్రారంభించరాదని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. సీబీఐ పరిధిని నియంత్రిస్తున్న దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ను జస్టిస్‌ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్‌ బీఆర్‌ గవాయిల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది.

చట్ట ప్రకారం.. ఒక రాష్ట్రంలో ఏదైనా కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలంటే అక్కడి ప్రభుత్వ అనుమతి ముందుగా తీసుకోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)