తెలంగాణ: కశ్మీర్ ఎదురుకాల్పుల్లో చనిపోయిన తెలుగు జవాను ఇంట్లో విషాదం - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

శోకసంద్రంలో తెలుగు జవాన్ ర్యాడా మహేష్ భార్య

జమూకశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్ భార్య సుహాసిని శోక సంద్రంలో మునిగిపోయారని ఈనాడు ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

సుహాసిని జీవితంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె పుట్టగానే తల్లి చనిపోయారు. తండ్రి రెండో పెళ్లి చేసుకుని వెళిపోతే, అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగారు. నాలుగేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సరిహద్దు పోరులో ప్రాణాలు విడిచారు.

ఆర్మీ అధికారులు మహేష్ మరణవార్తను ఆయన తండ్రి గంగమల్లుకు ఫోన్ చేసి చెప్పారు. సుహాసినికి ఈ విషయం తెలియనివ్వకుండా, కాల్పుల్లో గాయపడ్డారని మాత్రమే చెప్పారు.

సోమవారం మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌నుంచీ కోమన్‌పల్లి చేరుకున్నారు. ఇంటిముందు అంతమంది గుమికూడి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి విషయం తెలియడంతో కుప్పకూలిపోయారని ఈ కథనంలో తెలిపారు.

'ఈ నెల 21న మహేష్ పుట్టినరోజు. ఆయన కోసం కానుకలు సిద్ధం చేసి ఉంచాను. ఇంతలోనే ఈ విషాదం జరిగింది. భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించారని గర్వంగా ఉన్నా తనను ఒంటరిని చేసి వెళిపోయారని సుహాసిని కన్నీరు మున్నీరుగా విలపించారంటూ' ఈ కథనంలో తెలిపారు.

బాధిత కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారని, ఈ సందర్భంగా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారని ఈ వార్తలో పేర్కొన్నారు.

మూడు రాజధానులతో పాటు మూడు ప్రాంతాల్లోనూ సాగునీటికి సమన్యాయం

మూడు రాజధానులతోపాటూ మూడు ప్రాంతాల్లోనూ సాగునీటికి సమన్యాయం కల్పించే దిశగా ప్రాజెక్టులు చేపడుతున్నామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపినట్లు ఈనాడు ఒక కథనంలో ప్రచురించింది.

రూ.40వేల కోట్లతో రాయలసీమ కరవు నివారణ పథకం, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం, ప్రకాశం బ్యారేజీకి ఎగువున, దిగువున మూడు బ్యారేజీలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు చేపడుతున్నామని సీఎం వెల్లడించినట్లు ఈ వార్తలో రాశారు.

పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 2020 ఖరీఫ్ నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు చేస్తున్నామని తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్ హైలిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కాలువ వల్ల దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాలకు నీరు అందనుంది.

ఈ ఏడాది వంశధార రెండో దశ, వంశధార, నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలిదశ, అవుకు టన్నెల్, సంగం, నెల్లూరు బ్యారేజీల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం జగన్ తెలిపారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ధరణి ఫోర్టల్‌తో ఆడ పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు

తల్లిదండ్రుల ఆస్తిలో ఆడబిడ్డల వాటాను ఇప్పటి నుంచి అన్నదమ్ములు కాజేయలేరు. వారి సమ్మతితో పంచుకోవచ్చు లేదా, వారికీ సమాన వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.

ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో వాటా ఉండేలా చట్టం తెచ్చినా పెద్దగా అమలుకు నోచుకోలేదన్నది వాస్తవం. ఇక నుంచి అలా జరుగదు.

ధరణి ఫోర్టల్‌తో ఆడబిడ్డలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కల్పించే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. ఆడబిడ్డకు తెలియకుండా తల్లిదండ్రుల ఆస్తిని అన్నదమ్ములు తమ పేరుతో చేయించుకోవడానికి ధరణి ఒప్పుకోదు. ఆస్తిలో తనకు వాటా వద్దని ఆడబిడ్డలు స్వయంగా బయోమెట్రిక్‌ ఇస్తే తప్ప, ఆమెకు కూడా ఆస్తిలో వాటా దక్కుతుంది. ఇది తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఇస్తున్న కానుక అని ఈ కథనంలో రాసారు.

ధరణి పోర్టల్‌ ద్వారా పౌతివిరాసత్‌ చేసేందుకు ఆరు అంచెలుంటాయి. పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యాక పౌతివిరాసత్‌ కాలంలో నమూనా ప్రకారం పట్టాదారుడి వారసులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి. కుటుంబ సభ్యులందరి జాయింట్‌ అగ్రిమెంట్‌ను, పట్టాదారుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. రుసుము చెల్లించి, మూడవ అంచెలో పౌతివిరాసత్‌ కోసం స్లాట్‌బుక్‌ చేసుకోవాలి. స్లాట్‌బుక్‌ చేసిన 7 రోజుల తర్వాత తాసిల్దార్‌ కార్యాలయానికి పట్టాదారు వారసులు, సాక్షుల వెళ్తే వారి బయోమెట్రిక్‌ను కార్యాలయ సిబ్బంది స్వీకరిస్తారు. ఇది నాలుగో అంచె. ఆ సమయంలో పట్టాదారుల వారసుల జాబితాలో ఆడబిడ్డలు ఉంటే వారి బయోమెట్రిక్‌ను కూడా నమోదు చేస్తారు. వారి బయోమెట్రిక్‌ ఉంటేనే తదుపరి ఐదవ అంచె, ఆరవ అంచెలోకి వెళ్లేందుకు వీలవుతుంది. వాళ్లు ఒప్పుకొని బయోమెట్రిక్‌ ఇస్తేనే అన్నదమ్ములకు పట్టా వస్తుంది. లేకపోతే ఆడబిడ్డలకు కూడా సమవాటా ఇవ్వాల్సిందే. లేదంటే ధరణి ఒప్పుకోదని ఈ కథనంలో వీవరించారు.

మహిళల టి20 క్రికెట్... కప్పు గెలిచిన ట్రయల్ బ్లేజర్స్‌

మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో కొత్త చాంపియన్‌ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ నోవాస్‌ను ఓడించి ట్రయల్‌ బ్లేజర్స్‌ విజేతగా నిలిచిందని సాక్షి ఒక కథనంలో ప్రచురించింది.

సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్‌ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలోని సూపర్‌ నోవాస్‌పై విజయం సాధించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది.

స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్‌ బౌలర్‌ రాధా యాదవ్‌ మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్‌ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్‌ హర్మ¯న్‌ప్రీత్‌ కౌర్‌ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్‌) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)