ఆంధ్రప్రదేశ్: అనవసరంగా హారన్‌ కొడితే రూ. 2,000 ఫైన్, సవరించిన వాహన జరిమానాలు ఇవే... -ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

మోటార్‌ వాహనాల నిబంధనలను ఉల్లంఘించినవారికి విధించే జరిమానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ప్రచురించింది.

మోటార్‌ సైకిళ్లు, సెవెన్‌ సీటర్‌ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు సవరిస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది.

బండి వేగంగా నడిపితే రూ.1,000.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు.. రేసింగ్‌ మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు.. రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు.. పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు.. ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం.

వాహనం బరువు చెకింగ్‌ కోసం ఆపకపోయినా రూ.40 వేలు జరిమానా.. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.1,000, అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ.1,000, రెండోసారి రూ.2 వేలు జరిమానా.. వాహన తనిఖీ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750, సమాచారం ఇవ్వకపోతే రూ.750, అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేలు.

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5 వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు చొప్పున జరిమానాలు విధించింది.

మళ్లీ తీవ్ర అల్పపీడనం, తెలంగాణలో భారీ వర్ష సూచన

మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపిందని సాక్షి దినపత్రిక వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఒడిశా తీరానికి దగ్గరలో ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతెలంగాణపై కూడా ఉన్నట్లు వివరించింది.

దీని ప్రభావంతో రానున్న రెండ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రం గారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బుధవారం సగటున రాష్ట్రంలో 8.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌ నుంచి బుధవారం నాటికి నమోదైన వర్షపాతం గణాంకాల ను పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున కురవాల్సిన 80.2 సెం.మీ. సాధారణ వర్షపాతానికి గాను ఈ నెల 21 నాటికే 124.63 సెం.మీ. సగటు వర్షం కురిసింది.

తొలి మహిళా IAF ఆఫీసర్.. వింగ్ కమాండర్ విజయలక్ష్మి మృతి

దేశంలో తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్, డాక్టర్ విజయలక్ష్మి రమణన్ మరణించారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

96 ఏళ్ల వయసు ఉన్న ఆమె వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. 1924 ఫ్రిబ్రవరిలో పుట్టిన ఆమె వైద్య విద్య చదివారు. గైనకాలజిస్టుగా ప్రాక్టీస్ కూడా చేసిన ఆమె 1955లో తన భర్త ప్రోత్సాహంతో ఆర్మీలో చేరారు.

ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్‌లో రిక్రూట్ అయిన ఆమె తన సర్వీస్ ముగిశాక ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యారు. భారత వాయుసేన (IAF)లో తొలి మహిళా ఆఫీసర్‌గా రికార్డ్ సృష్టించారు. 24 ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్‌లో సర్వీస్ చేసిన విజయలక్ష్మి 1979లో వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యారు.

ఎయిర్ ఫోర్స్‌లో విజయలక్ష్మిని అంతా ఆఫీసర్ 4971 అని పిలిచేవారు. అంతా మగవాళ్లే ఉన్న వాయుసేనలో ఏకైక మహిళగా వారికి దీటుగా పని చేసేవారు.

ఎప్పుడైనా మగవాళ్లతో పని చేయడం పట్ల భయపడ్డారా అని గతంలో ఓ డాక్యుమెంటరీలో ప్రశ్నించగా.. ''అప్పటి వరకు ఎప్పుడూ నేను మగవాళ్లతో కలిసి పని చేయలేదు. దాంటో మొదట్లో కొంచెం భయపడిన మాట వాస్తవమే. అయితే జీవితంలో దేనినైనా ఎదుర్కొనే సత్తా నాకు ఉంది. ఆ ధైర్యంతో మగవాళ్లతో పోటీగా పనిచేసేదాన్ని' అని చెప్పారు.

తన భర్త కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ అని, ఆయన ప్రోత్సాహంతోనే తాను సైన్యంలో చేరానని అందులో తెలిపారు. తాను సర్వీస్‌లో ఉండగా ఆర్మీలో పది, 20 మంది వరకు ఆడవాళ్లు ఉండేవారని, ఎయిర్ ఫోర్స్‌లో మాత్రం తానే ఏకైక మహిళా ఆఫీసర్‌నని, అయినప్పటికీ ఎటువంటి వివక్ష తాను ఎదుర్కోలేదని చెప్పారు.

'ధరణి'లో ఆస్తుల నమోదుకు గడువేం లేదు

వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 'ధరణి' పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి నిర్దిష్ట గడువు ఏదీ లేదని తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు స్పష్టం చేసిందని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొంది.

పోర్టల్‌లో నమోదు చేసేవారి వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందని హామీ ఇచ్చింది. ఎలాంటి చట్ట పరిధి లేకుండా ప్రభుత్వం ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టిందని... ఇది సరికాదని పేర్కొంటూ న్యాయవాది ఐ.గోపాల్‌శర్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు.

''ధరణిలో ఆస్తుల నమోదుకు పత్రికల్లో ప్రకటన తప్ప ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నదీ ఎక్కడా లేదు. పైగా గడువు నిర్దేశించి ఆ సమయంలోగా ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం పేర్కొంటోంది. వ్యక్తిగత వివరాలను కూడా సేకరిస్తోంది. వెబ్‌సైట్‌లో ఉంచే ఈ సమాచారానికి ఎలాంటి భద్రతా లేదు. ఆధార్‌తోపాటు కులం వివరాలను కూడా సేకరించి ఎవరైనా తెలుసుకునేలా బహిరంగంగా ఉంచుతోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా మాత్రమే కులం వివరాలను సేకరించాలని సుప్రీంకోర్టు పుట్టుస్వామి కేసులో స్పష్టం చేసింది'' అని ప్రకాష్‌రెడ్డి వివరించారు.

పిటిషనర్‌ వాదనలను విన్న ధర్మాసనం... కులం వివరాలను సేకరిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. పాఠశాలలో చేరింది మొదలు కులం వివరాలు రికార్డులో నమోదవుతున్నాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. అంతేగాకుండా వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు అభ్యంతరాలేమిటని అడిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)