అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని... 63 మండలాలకూ బాలికలే తహసీల్దార్లు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో బాలికలకు ఉన్నత గౌరవం దక్కిందని.. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఒక్క రోజు ప్రభుత్వ అధికారులుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. ఇలా ఎంపికైన బాలికల్లో గార్లదిన్నె మండలం కస్తూర్బా పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని శ్రావణి ఒక్కరోజు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కలెక్టర్ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు విద్యార్థిని శ్రావణిని స్వయంగా ఆహ్వానించి, కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. దిశ చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు పరిహారం ఇచ్చే దస్త్రంపై ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేశారు.

ఒక్కరోజు జాయింట్‌ కలెక్టర్లు(జేసీ)గా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో తహసీల్దార్లుగా బాలికలు ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా కలెక్టర్ మొదలు, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్‌తో పాటు సమాచార పౌరసంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారుల బాధ్యతలను ఆదివారం నాడు బాలికలే చేపట్టారు. కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో బాలికా దినోత్సవాన్ని ఇలా వినూత్నంగా నిర్వహించారు.

అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని మరింత పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అక్కడ చదువుతున్న బాలికల పేర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి ఒక్కరోజు అధికార బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ బాధ్యత కలిగిన పదవుల్లో ఎక్కువగా మహిళలు ఉండటం వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కలెక్టర్ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం పట్ల మహిళా అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

అర్ధంతరంగా చదువు మానేస్తున్న బాలికల్లో పట్టుదల పెంచి, లక్ష్యాన్ని చేరుకునేలా ఈ తరహా కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

'దిశ.. ఎన్‌కౌంటర్‌' సినిమా ఆపండి: వర్మ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన దిశ తండ్రి

'దిశ..ఎన్‌కౌంటర్‌' సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారని.. ఆదివారం ఉదయం రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారని 'సాక్షి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి వెంట పలువురు మహిళలు, స్నేహితులు ఉన్నారు. వారంతా దిశ సినిమాను ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దిశ కుటుంబాన్ని వర్మ తన సినిమాతో మరింత ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎమోషన్లని డబ్బు చేసుకోవాలనుకుంటున్న ఆర్జీవీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ శ్రీధర్‌రెడ్డి ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని శ్రీధర్‌రెడ్డి తరఫు న్యాయవాది నివేదించారు.

అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి.. కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.

రుషికొండ బీచ్‌కు 'బ్లూఫ్లాగ్‌'!

విశాఖకు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని.. ఇక్కడ రుషికొండ బీచ్‌ బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌కు ఎంపికైందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో ప్రపంచ బ్యాంకు నిధులతో దేశంలోని కొన్ని బీచ్‌ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇందుకు దేశ వ్యాప్తంగా 13 బీచ్‌లను సిద్ధం చేయగా, వాటిని పరిశీలించిన కమిటీ ఎనిమిది బీచ్‌లను ఎంపిక చేసింది. ఆ ఎనిమిదింటిలో ఏపీ నుంచి రుషికొండ బీచ్‌ స్థానం సంపాదించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అక్టోబరులో జ్యూరీ కమిటీ ఆయా బీచ్‌లను పరిశీలించి చివరగా బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు అర్హతలను నిర్ధారించింది. డెన్మార్క్‌లోని కొపెన్‌హెగెన్‌లో ఉన్న ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్ఈఈ) అనే సంస్థ బ్లూఫాగ్‌ గుర్తింపు ఇచ్చింది.

బ్లూఫ్లాగ్‌ రావాలంటే 33 అంశాల్లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎఫ్‌ఈఈ సంస్థ నిపుణులు తనిఖీ చేసి అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ జారీ చేశారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీళ్ల నాణ్యత, బీచ్‌లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యలు వంటివి ప్రధానమైనవి. పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన నీరు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని పర్యాటకులకు కల్పించడం బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ ప్రధాన లక్ష్యం.

రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్‌ సర్టిఫికేషన్‌ రావడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌తో అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, దేశవిదేశాల నుంచి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు భాషా పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలుగు భాషపై నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు పరీక్షలు రాసి ప్రతిభను చాటుకోవాలనుకునే ఔత్సాహికులకు తెలంగాణ సారస్వత పరిషత్‌ అద్భుత అవకాశం కలిపిస్తోందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం హైదరాబాద్‌లో తిలక్‌ రోడ్డులోని తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రాథమిక, ప్రవేశ, విశారద పూర్వ, ఉత్తర భాగాలు అనే నాలుగు స్థాయిల్లో తెలుగు పాఠ్యాంశాలను చదువుకోవాలనుకునే ఉత్సాహవంతులకు పుస్తక రూపంలో అందిస్తోంది.

వీటిని ఇంటి వద్దే చదువుకొని పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, నారాయణఖేడ్‌, నిర్మల్‌లోని కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 40 మందికి పైగా అభ్యర్థులుంటే రాష్ట్రంలో ఎక్కడైనా పరీక్షా కేంద్రాలను పరిషత్‌ ఏర్పాటు చేస్తుంది.

వచ్చే సంవత్సరం జనవరిలో నిర్వహించే ఈ పరీక్షల కోసం అక్టోబర్‌ 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో గాని, 9603727234, 040-24753724 నెంబర్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)