కేసీఆర్: ‘కొత్త విద్యుత్ చట్టం అత్యంత ప్రమాదకరం.. ఉపసంహరించుకోమని మోదీని చేతులు జోడించి వేడుకుంటున్నా’ - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

కేంద్రం విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ట్రాలకు ఉన్న అధికారం పోతుందని, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారని పత్రిక రాసింది.

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

కేంద్ర చట్టం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. కేంద్రం తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని విమర్శించారని కథనంలో చెప్పారు.

దేశంలో మిగులు విద్యుత్‌ ఉన్నా అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ బిల్లుతో రైతులు, పేదలు, విద్యుత్‌ ఉద్యోగులు.. ఇలా అన్నివర్గాల వారు నష్టపోతారని వివరించారు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతాంగంపై ఇది పిడుగులాంటిదేనని సీఎం ఆవేదన చెందారు.

కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు దేశంలో వృథా అవుతున్న నీటిని వినియోగించే ప్రణాళికలు రూపొందించలేదని, కానీ రాష్ట్రాల అధికారాలను హరించేందుకు ప్రయత్నించాయని విమర్శించారు.

నిండు సభ నుంచి ప్రధాన మోదీని రెండు చేతులు జోడించి.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వేడుకుంటున్నా.. అని ముఖ్యమంత్రి అన్నారని నమస్తే తెలంగాణ రాసింది.

కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింద’’ని పత్రిక వివరించింది.

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ చర్చలు విఫలం

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు మరోసారి విఫలం అయ్యాయని ఆంధ్రజ్యోతి సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో తిరిగే పరిస్థితి కనిపించడంలేదని రాసింది.

లాక్‌డౌన్‌తో మార్చి చివరి వారం నుంచి ఆగిన బస్సులు.. కొన్ని రోజులుగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిసాకు వెళుతున్నాయి. కానీ తెలంగాణకు మాత్రం నడవడంలేదు.

తమ రాష్ట్రంలో లక్ష కిలోమీటర్లు ఎక్కువగా తిప్పుతున్న సర్వీసులను రద్దు చేయాలని.. అప్పుడే అంతర్రాష్ట్ర ఒప్పందానికి ముందుకొస్తామని తెలంగాణ పట్టుబడుతోందే తప్ప.. ‘మేం 50వేలు తగ్గించుకుంటాం.. మీరు 50వేలు పెంచుకోండి’ అని ఏపీ చేస్తున్న ప్రతిపాదనకు ఒప్పుకోవడంలేదని కథనంలో చెప్పారు.

దీంతో ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల స్థాయి చర్చలు కొలిక్కి రాలేదు. తాజాగా మంగళవారం ఇరు రాష్ట్రాల రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు ఎం. టి. కృష్ణబాబు(ఏపీ), సునీల్‌ శర్మ(తెలంగాణ) మధ్య హైదరాబాద్‌లో చర్చ లు జరిగాయి.

ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ పాతపాటే పాడటంతో మరోసారి చర్చలు అర్ధంతరంగా ముగిశాయని పత్రిక చెప్పింది.

ఈ సమస్యకు త్వరలో పరిష్కా రం లభిస్తుందని, త్వరలో మరో ప్రతిపాదనతో చర్చలు జరుగుతాయని ఏపీఎ్‌సఆర్టీసీ ఆపరేషన్స్‌ఈడీ బ్రహ్మానంద రెడ్డి అన్నారని తెలిపింది.

ఆర్టీసీ ఎండీల వాదన

రూట్ల ప్రాతిపదికన బస్సులను నడుపుకొందామని ఏపీకి ప్రతిపాదించాం. నిజానికి రూట్‌ల వారీగా నడిపితేనే రెండు ఆర్టీసీలకు లాభాలుంటాయి. ఆలోచించి నిర్ణయం చెబుతామన్నారు-సునీల్‌శర్మ, టీఎస్‌ ఆర్టీసీ ఎండీ

రూట్ల ప్రాతిపదికన బస్సులను నడపాలన్న ప్రతిపాదన దేశంలో ఎక్క డా లేదు. కిలోమీటర్ల ప్రాతిపదికనే బస్సులను నడుపుకుందామని ప్రతిపాదించాం. కానీ ఒప్పుకోడం లేదు-ఎంటీ కృష్ణబాబు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ

ఏపీలో నూతన విద్యా విదానానికి సీఎం పచ్చజెండా

2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానం అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని సాక్షి కథనం ప్రచురించింది.

ఒకటవ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్‌ క్లాస్‌ (సంసిద్ధతా తరగతులు) ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చే సరికే 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు, నిపుణులు చెబుతున్న దృష్ట్యా మొదటి తరగతికి ముందే సంసిద్ధతా తరగతులను అభ్యసిస్తే వారి పునాది ధృడంగా ఉంటుందన్నారు.

దీనిని అనుసరిస్తూ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2021–22 నుంచి జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయాలన్నారని సాక్షి రాసింది.

ఇందులో భాగంగా 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. జాతీయ నూతన విద్యా విధానంపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సాక్షి తన కథనంలో ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలను వివరించింది.

నేటితో అరకోటికి చేరనున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నేటితో 50 లక్షలకు చేరుకోనున్నాయని ఈనాడు కథనం చెప్పింది.

దేశంలో కరోనా కేసులు అర కోటికి చేరువవుతున్నాయి. మంగళవారం ఉదయానికే మొత్తం కేసుల సంఖ్య 49.30 లక్షలు కాగా బుధవారం ఉదయం గణాంకాలు వెల్లడయ్యేసరికి అది 50 లక్షలు దాటిపోనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 24 గంటల్లో మరో 1,054 మంది కన్నుమూయడంతో మొత్తం మరణాల సంఖ్య 80,776కి చేరింది. గత నెల రోజుల్లోనే 32,736 మంది కన్నుమూశారు.

మొత్తం మరణాల్లో 40 శాతానికి పైగా కేవలం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్యలో సంభవించినవే. అయినప్పటికీ భారత్‌లోనే మరణాల రేటు అతి తక్కువగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పునరుద్ఘాటించిందని పత్రిక రాసింది.

ప్రపంచ సగటు మరణాల రేటు 3.20% ఉండగా భారత్‌లో ఇది 1.64%కి పరిమితమైనట్లు పేర్కొంది. అమెరికాలో ఇది 3%, బ్రెజిల్‌లో 3.05%గా ఉన్నట్లు తెలిపింది.

సగటు మరణాల రేటును 1% లోపునకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, చాలా రాష్ట్రాల్లో మరణాల రేటు ఆ స్థాయిలోనే ఉన్నట్లు పేర్కొందని కథనంలో చెప్పారు.

మరోవైపు రోజువారీ కేసులు 83,809కి తగ్గాయి. ఈనెల 8వ తేదీ తర్వాత నమోదైన కనిష్ఠ సంఖ్య ఇదే. క్రితం రోజుతో పోలిస్తే పరీక్షలు 8.69%, కేసులు 8.97% మేర తగ్గాయి.

వరుసగా అయిదురోజుల పాటు 90 వేలకు పైగా నమోదైన కేసులు ఇప్పుడు 83 వేలకు తగ్గడానికి కారణం ఇదే. రోజూ 22వేలకుపైగా కేసులు నమోదయ్యే మహారాష్ట్రలో 17వేల కేసులు వచ్చాయి.

అలాగే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేసులు తగ్గాయి. వరుసగా 5 రోజులపాటు నిత్యం 4వేలకుపైగా కేసులు నమోదైన దిల్లీలో తాజా కేసులు 3వేలకు వచ్చాయని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)