You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వామి అగ్నివేశ్ మృతి.. ఆస్పత్రిలో కన్నుమూసిన ఆర్యసమాజ్ నేత
ఆర్యసమాజ్ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, మానవవాది స్వామి అగ్నివేశ్ శుక్రవారం కన్నుమూశారు.
ఆయన వయసు 80 సంవత్సరాలు. కొంత కాలంగా లివర్ సిర్సోసిస్ వ్యాధితో బాధపడుతున్న అగ్నివేశ్‌ను మంగళవారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచీ ఆయన వెంటిలేటర్ మీదే ఉన్నారు.
గురువారం నాడు ఆయన శరీరంలో పలు అవయవాలు విఫలమవటంతో పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వెల్లడించింది. శుక్రవారం ఆయన చనిపపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యామ్‌రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. న్యాయశాస్త్రం, వాణిజ్యశాస్త్రాల్లో డిగ్రీ చేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సవ్యసాచి ముఖర్జీ న్యాయవాదిగా ఉన్నపుడు ఆయన దగ్గర జూనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.
ఆర్యసమాజ్ సిద్ధాంతాలు ప్రాతిపదికగా 'ఆర్య సభ' అనే పేరుతో 1970లో రాజకీయ పార్టీ స్థాపించారు. 1977లో హరియాణా శాసనసభకు ఎన్నికయ్యారు. విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
1981లో వెట్టిచాకిరి విముక్తి వేదికను స్థాపించి.. వెట్టిచాకిరి నిర్మూలన కోసం కృషిచేశారు. యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్ కాంటెంపరరీ ఫార్మ్స్ ఆఫ్ స్లేవరీ విభాగానికి 1994 నుంచి 2004 వరకూ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
1875లో దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి అగ్నివేశ్ 2004 నుంచి 2014 వరకూ అధ్యక్షుడిగా ఉన్నారు.
2011లో మావోయిస్టు పార్టీ ఐదుగురు పోలీసులను అపహరించినపుడు వారి విడుదల కోసం చర్చలు జరిపిన బృందంలో స్వామి అగ్నివేశ్ కూడా ఉన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలోనూ అగ్నివేష్ క్రియాశీలంగా పాల్గొన్నారు.
2018లో స్వామి అగ్నివేశ్‌పై ఝార్ఖండ్‌లోని పాకుర్ ప్రాంతంలో నడిరోడ్డుపైన కొందరు దాడి చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కింద పడేసి తీవ్రంగా కొట్టారు.
అగ్నివేశ్ దుస్తుల్ని చింపేసి, అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దాడిలో ఆయనకు అంతర్గతంగా గాయాలయ్యాయి.
అగ్నివేశ్ మృతి పట్ల ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రచయిత్రి తీస్తా సెతల్వాద్ తదితరులు సంతాపం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- కంగనా రనౌత్ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఉద్ధవ్ పై యుద్ధం చేస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి పంచాలంటే ‘8000 జంబో జెట్లు సరిపోతాయా ?
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఇంట్లో తాగలేక, బయటకు వెళ్లలేక...మద్యం మానేస్తారా ?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?
- రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కృష్ణ బిలం: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్‌వాష్ మంచిదా.. శానిటైజర్ మంచిదా?
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)