You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: టిక్‌టాక్‌లో పరిచయం.. పెళ్లి, ఆపై ఆత్మహత్య - ప్రెస్‌రివ్యూ
టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ యువతి, యువకుడు ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారని.. అంతలోనే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలేనికి చెందిన ప్రేమ జంట ఇటీవలే తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పెద్దలు తమ పెళ్లిని అంగీకరించలేదని మనస్తాపంతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వీరి మరణ వార్త రెండు కుటుంబాలలోనూ తీవ్ర ఆవేదన నింపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
కాళేశ్వరంపై కేంద్రం ప్రశ్నల వర్షం
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం చేపడుతున్న పనులపై కేంద్రం ప్రశ్నల వర్షం కురిపించిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''అదనపు టీఎంసీ పనులకు సంబంధించి ఒక్కో అంశాన్ని కేంద్రం ఆరా తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, పర్యావరణ అనుమతులు, వ్యయా లపై వరుసగా లేఖలు సంధిస్తున్న కేంద్రం, రెండ్రోజుల కిందట ఆయకట్టు వివరాలు కోరగా, తాజాగా గురువారం అదనపు టీఎంసీ పనులను గత పనులకు భిన్నంగా చేపట్టడంపై వివరణ కోరుతూ లేఖ రాసింది.
కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్, గంధమల్ల, బస్వాపూర్, వాటి కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు టీఎంసీల తరలింపు పనులకు కేంద్రం రూ.80,190 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ పనులు కొనసాగుతుండగానే, కృష్ణా బేసిన్‌లో నీరందని ప్రాంతాలకు సైతం కాళేశ్వరం ద్వారానే గోదావరి జలాలు అందించేలా అదనపు టీఎంసీ పనులు చేపడుతోంది. ఈ పనులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు సైతం దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. డీపీఆర్‌లపై బోర్డు, కేంద్రం రాసినా స్పందన లేకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా లేఖలు రాశారు. ఇందులో రెండు టీఎంసీల నీటిని తరలింపునకే కేంద్రం అనుమతి ఇచ్చిందని, అదనపు టీఎంసీ పనులకు అనుమతి లేదన్న అంశాన్ని లేవనెత్తారు. దీనికి కొత్తగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాయగా, అనంతరం ప్రాజెక్టుకు తొలుత నిర్ధారించిన అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని కోరింది. ఈ లేఖ రాసిన వారం రోజుల వ్యవధిలో మూడు రోజుల కిందటే తాము 98 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 195 టీఎంసీల ఎత్తిపోతలకు అనుమతిచ్చామని, దీనికి అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన చేశారో, లేదో తెలపాలని కోరుతూ లేఖ రాసింది. అదనపు టీఎంసీతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు లేక స్థిరీకరణ ఆయకట్టు, జిల్లాల వారీగా ఆ ఆయకట్టు వివరాలు చెప్పాలని ఆదేశించింది.
దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. ఇది రాసిన రెండ్రోజులకే గురువారం మరో లేఖ రాసింది. ఇప్పటికే చేపట్టిన రెండు టీఎంసీల నీటి తరలింపునకు గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల వ్యవస్థల ద్వారా నీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం అదనంగా టీఎంసీ నీటిని తీసుకునేందుకు చేపట్టిన పనులను మాత్రం పాత విధానంలో కాదని, పైప్‌లైన్ ద్వారా ప్రెషర్‌మెయిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి తరలించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. ప్రెషర్ మెయిన్ వ్యవస్థను ఎంచుకునేందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింద''ని ఆ కథనంలో వివరించారు.
అమ్మభాషలోనే చెప్పాలి
తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి... 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదువు చెప్పాలన్న ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు మళ్లీ బ్రేకులు పడ్డాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''ఇంగ్లీషు మీడియంపై జారీ చేసిన జీవోలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వాటిని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తులు జస్టి్‌సడీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ కేఎం జోసె్‌ఫతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు ప్రారంభిస్తూ... హైకోర్టు పరిశీలనలు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. మాధ్యమాన్ని ఎంచుకునే హక్కు తల్లిదండ్రులు, వారి పిల్లలకు ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య బోధించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రగతిశీల చర్యగా ఆయన అభివర్ణించారు.
95శాతం మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంనే కోరుకుంటున్నారని చెప్పారు. అలాగని తెలుగు మాధ్యమాన్ని నిర్లక్ష్యం చేయడం లేదని, ఆ మీడియంలో బోధన కోసం పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, అవి ఉన్న చోటుకు విద్యార్థులు చేరుకొనేందుకుగాను ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలిపారు.ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనేది ముందుచూపుతో తీసుకొన్న నిర్ణయమని, జనరంజక కోణంలో చేసింది కాదన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొంది. ''విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం ఆచరణలో సాధ్యమైనంతవరకు మాతృభాషలోనే బోధన జరగాలి కదా? దీన్నే హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లుంది'' అని వ్యాఖ్యానించింది.
కేవియెట్ దాఖలు చేసిన ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ... విద్యార్థులు, తల్లిదండ్రులు ఏ మీడియంలో తమకు బోధన కావాలనేది ఎంచుకునే హక్కును ప్రభుత్వం కాలరాసిందని స్పష్టం చేశారు. ఏపీలో తెలుగు మీడియం పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియంగా మార్చారని తెలిపారు. ప్రభుత్వం మాతృభాషను ప్రోత్సహించాలన్నారు.
ఇరుపక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం.. ప్రస్తుతం స్టే ఇవ్వబోమని, తమ జవాబులను దాఖలు చేయడానికి ప్రతివాదులకు సమయం ఇస్తామని స్పష్టం చేసింది. సమాధానాలు ఇవ్వాలని ఇతర ప్రతివాదులుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింద''ని ఆ కథనంలో వెల్లడించారు.
మేడ్చల్ కలెక్టర్, ఆర్డీవో ఆదేశిస్తేనే వెళ్లా: ఏసీబీకి చిక్కిన కీసర తహసిల్దార్ నాగరాజు
కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్ కేసు కొత్త మలుపులు తిరుగుతోందని 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.
''ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్, అంజిరెడ్డి పేర్లు బయటకు రాగా.. తాజాగా మరికొందరు రెవెన్యూ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. కీసర నుంచి హన్మకొండకు లింకు కలుస్తున్నది. ఓ జిల్లా ఉన్నతస్థాయి అధికారి సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తాసిల్దార్ నాగరాజును, మరో కీలక నిందితుడు శ్రీనాథ్‌యాదవ్‌ను మూడు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించినప్పుడు కొత్త సంగతులు బయటపడినట్టు సమాచారం. మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతోపాటు కీసర ఆర్డీవో రవి, హన్మకొండ తాసిల్దార్ కిరణ్‌ప్రకాశ్ పేర్లు కొత్త తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురి పేర్లను నాగరాజు తన వాంగ్మూలంలో ప్రస్తావించినట్టు ఏసీబీ ఇంటరాగేషన్ రిపోర్టును బట్టి తెలుస్తున్నదని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేకించి కలెక్టర్, ఆర్డీవో చెప్తేనే తాను హైదరాబాద్ కాప్రాలోని అంజిరెడ్డి ఇంటికి వెళ్లానని నాగరాజు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ప్రస్తావించాడని తెలిసింది. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు చెప్పగా.. తనకేమీ తెలియదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆర్డీవో రవి చెప్తున్నార'ని ఆ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
- దేశంలో రోజూ ముప్పావు లక్ష కేసులు.. మరి లాక్డౌన్ సఫలమా? విఫలమా?
- ‘భారత్ తక్షణమే తప్పు దిద్దుకోవాలి’: చైనా యాప్‌ల నిషేధంపై చైనా అభ్యంతరం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: ‘భారత్ మూడు కరోనావైరస్ వ్యాక్సీన్లను తయారు చేస్తోంది’
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)