ఏసీబీ: అవినీతి అధికారిణి దేవికారాణి వద్ద మరో 4.47 కోట్ల రూపాయలు - ప్రెస్‌రివ్యూ

ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు

ఫొటో సోర్స్, ACB

ఫొటో క్యాప్షన్, ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు
ప్రచురణ

ఐఎంఎస్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ దేవికారాణికి సంబంధించి మరో రూ.4.47 కోట్ల రూపాయల మొత్తాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సాక్షి పత్రిక రాసింది.

వైద్య బీమా సంస్థలో అవినీతికి పాల్పడటం ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఆమె రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నించారని, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి ఆరు ఫ్లాట్లను కొనేందుకు ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు సొమ్మును ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.

రూ.4.47 కోట్ల రూపాయలలో దేవికారాణి సొమ్ము రూ.3.75 కోట్లుకాగా, నాగలక్ష్మి రూ.72లక్షలు పెట్టుబడిగా పెట్టారని సాక్షి పత్రిక కథనం పేర్కొంది.

ఈ వ్యవహారం తెలియడంతో సదరు రియల్‌ ఎస్టేట్ డెవలపర్‌కు ఏసీబీ నోటీసులు పంపగా, ఆ సంస్థ ఈ పెట్టుబడి మొత్తాన్ని ఏసీబీకి నోట్లకట్టల రూపంలో అప్పగించింది.

దేవికారాణి వద్ద తాజాగా లెక్కకు అందని రూ.4 కోట్లకు పైగా సొమ్ము దొరకడంతో కీసర తహసిల్దారు దగ్గర దొరికిన అవినీతి సొమ్ము రూ.కోటి పది లక్షల రికార్డును దేవికారాణి అధిగమించినట్లయిందని సాక్షి పత్రిక రాసింది.

విద్యుత్ మోటార్

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యుత్‌కు త్వరలోనే నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు ఈనాడు పత్రిక రాసింది. ఇందుకోసం రైతులకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటిలో విద్యుత్‌ బిల్లుల సొమ్మును జమ చేస్తారు.

ఈ మేరకు మార్గదర్శకాలను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్‌ రంగ సంస్కరణల్లో భాగంగా విద్యుత్‌ కోసం రైతులకు నగదు బదిలీకి ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కనీసం ఒక జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి, 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

నగదు బదిలీ కోసం రైతు పేరిట ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ తెరుస్తారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బు నేరుగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అందుతుంది. ప్రతినెలా వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా వచ్చిన బిల్లు సొమ్మును ప్రభుత్వం రైతు బ్యాంకు ఖాతాలో వేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉచిత విద్యుత్‌ పొందుతున్న 18లక్షలమంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని ఈనాడు పేర్కొంది.

మల్లోజులు

ఫొటో సోర్స్, Andhrajyothy.com

గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్‌

ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టు నాయకుడు గణపతి బాటలో మరో సీనియర్ దళపతి మల్లోజులు వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి కూడా లొంగుబాటుకు సిద్దంగా ఉన్నారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

మల్లోజులు లొంగుబాటు ప్రయత్నాలకు కూడా ఆరోగ్య పరిస్థితులే కారణమని పేర్కొంది. 35 సంవత్సరాలపాటు మావోయిస్టు ఉద్యమంలో పని చేసిన మల్లోజుల, ప్రస్తుతం కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు.

2010లో దంతెవాడలో 70మంది జవాన్ల హత్య ఘటనకు ఆయనే పథక రచన చేశారు. మరో సీనియర్‌ మావోయిస్టు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీకి వేణుగోపాల్ స్వయంగా తమ్ముడు.

వేణుగోపాల్‌ లొంగుబాటుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, మావోయిస్టుల లొంగుబాట్లను తెలంగాణ పోలీసులు స్వాగతిస్తున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

అక్రమ, అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ

తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.

ఈ నెల 4 నుంచి అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టు 26లోపు జరిగిన సేల్‌ డీడ్‌లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.

కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలతోపాటు తొలిసారిగా గ్రామాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

100 గజాలలోపు ఫ్లాట్‌కు చదరపు గజానికి రూ.200తో మొదలై, 501 గజాల నుంచి ఆపై విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు చ.గజానికి రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.

స్లమ్‌ ఏరియాలో క్రమబద్ధీకరణకు విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా గజానికి 5రూపాయలే వసూలు చేస్తారని, అయితే చెరువులు, నాలాల్లో వేసిన అక్రమ లేఅవుట్లకు క్రమబద్ధీకరణ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)