కరోనా వైరస్‌: ఒకే రోజు అత్యధిక కేసుల నమోదులో అమెరికాను దాటిన భారత్‌

ప్రచురణ

ఆగస్టు 30 ఆదివారం నాడు భారతదేశంలో 78,761 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా పేరిట జులై 17న నమోదైన ఒకే రోజు అత్యధిక కేసుల రికార్డును భారత్‌ దాటినట్లయింది.

అంతేకాదు భారత్‌లో ఆగస్టు 30నాటి కేసులు ప్రపంచంలో ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు కూడా.

ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి నుంచి మొదలైన లాక్‌డౌన్‌తో ఇప్పటికే లక్షల ఉద్యోగాలు పోయినట్లు అంచనా.

భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలలో కూడా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆదివారంనాటికి ప్రపంచవ్యాప్తంగా కేసులు 2.5కోట్లు దాటాయి. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 843,000 మంది మరణించారు. 60 లక్షల ఇన్‌ఫెక్షన్‌ కేసులతో అమెరికా ప్రపంచంలోనే నెంబర్‌ వన్ ‌స్థానంలో ఉన్నట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియాలో కేసులు పెరగడానికి కారణాలేంటి?

జులై 17న అమెరికాలో నమోదైన ఒక రోజులో అత్యధిక కేసుల రికార్డు 77,299ని ఆదివారంనాడు ఇండియా దాటేసింది. “గ్రామీణ ప్రాంతాలకు కూడా మహమ్మారి విస్తరించడమే దీనిక ప్రధాన కారణం’’ అని కార్డియాలజీ డాక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ రాయిటర్స్‌ వార్తా సంస్థతో అన్నారు.

ఆరంభంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో దేశంలో కోవిడ్‌ వైరస్‌ విస్తరణ మందకొడిగా సాగింది. అయితే మహా నగరాలైన ముంబయి, ఢిల్లీలో కేసులు మొదట్లో ఎక్కువగా కనిపించగా, అవి తర్వాత చిన్ననగరాలకు వ్యాపించడం ప్రారంభించాయి. అయితే ఒకపక్క వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నా ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా తొలగిస్తూ వస్తోంది.

సెప్టెంబర్ నుంచి ఒకేచోట 100మంది గుమిగూడే సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించనుంది. అయితే ఫేస్‌మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం మాత్రం తప్పని సరి.

ప్రధాన నగరాలలో అండర్‌ గ్రౌండ్ రైల్వే సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి.

“వైరస్‌ కాస్త తగ్గగానే ఇక అంతా పోయినట్లేనని, తాము కరోనాపై విజయం సాధించామని ప్రజలు భావిస్తునారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు’’ అని డాక్టర్‌ రాజీవ్‌ పరేఖ్‌ అన్నారు. ఆయన మేదాంత హాస్పిటల్‌లో పెరిఫెరల్‌ వాస్కులర్‌ అండ్‌ ఎండోవాస్కులర్‌ సైన్స్‌ విభాగానికి చైర్మన్‌గా పని చేస్తున్నారు.

“ఇలాంటివన్నీ జరక్కుండా మనం జాగ్రత్త పడాలి’’ అని పరేఖ్‌ అన్నారు.

చాలా కేసులు నమోదుకాకపోవడం, టెస్టింగ్‌కు సదుపాయాలు లేకపోవడం పెద్ద సమస్యని వైద్య నిపుణులు అంటున్నారు.

మరణాలలో భారత్‌, మెక్సికోలు దాదాపు సరిసమానంగా ఉండగా, కేసుల సంఖ్యలో మాత్రం మెక్సికో ముందుంది. 591,000 కేసులు మెక్సికోలో నమోదుకాగా, భారత్‌లో మాత్రం మూడున్నర లక్షలు పైగా నమోదయ్యాయి.

అయితే భారత ప్రభుత్వం చనిపోయినవారు, ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిని మాత్రమే గణాంకాలలో చూపుతోంది తప్ప అనుమానిత కేసులు రికార్డులలోకి ఎక్కించడం లేదు.

“ ఇండియాలో పది లక్షలమందిలో 30,000మందికి మాత్రమే టెస్టులు జరుగుతున్నాయి. కరోనా బాధిత దేశాలలో అతి తక్కువ టెస్టులు జరుపుతున్నవాటిలో భారత్‌ రెండోస్థానంలో ఉంది’’ అని వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఆగస్టు 30న నమోదైన గరిష్ట కేసుల సంఖ్యను ప్రస్తావించకుండానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారంవారం ఇచ్చే మన్‌కీబాత్‌ రేడియో ప్రసంగాన్ని కొనసాగించారు.

నిబంధనలను పాటిస్తూ దేశవాసులంతా కరోనావైరస్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. “ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. అందరం కలిసి కరోనాను ఓడిద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు.

“ సురక్షిత పద్దతులు పాటిస్తే కరోనా పోతుంది. ఇందుకోసం మనిషికి మనిషికి మధ్య రెండు మీటర్ల దూరాన్ని పాటించడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి’’ అని ప్రధాని సూచించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)