తెలంగాణలో ప్రైవేట్‌ ఆసుపత్రులే కరోనావైరస్ హాట్‌స్పాట్లు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులో హాట్‌స్పాట్‌లుగా మారుతున్నట్లు సాక్షి ఓ కథనం ప్రచురించింది.

వరంగల్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి కరోనా చికిత్స చేసేందుకు అనుమతి లేదు. అయినా అక్కడకు వచ్చే కరోనా అనుమానితులకు సీటీ స్కానింగ్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స కూడా అందిస్తున్నారు. కనీస ప్రొటోకాల్స్‌ కూడా పాటించడం లేదు.

కరోనా బాధితుడి గదిలోనే అతని కుటుంబ సభ్యులు రాత్రిళ్లు ఉండేలా అనుమతినిస్తున్నారు. సాధారణ విధులు నిర్వహించే వైద్య సిబ్బందికీ కరోనా డ్యూటీలు వేస్తున్నారు.

ఈ తరహా ఘటనలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు ప్రతిరోజూ వస్తున్నాయి. అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు, డాక్టర్లు కనీస ప్రొటోకాల్‌ పాటించడం లేదని బాధితులు సర్కారుకు విన్నవిస్తున్నారు.

జిల్లాల్లో సాధారణ ప్రైవేట్‌ ప్రాక్టీషనర్‌ మొదలు సీనియర్‌ వైద్యుల వరకు అనుమతి లేకున్నా, ప్రొటోకాల్‌ పాటించకుండా కరోనా వైద్యం చేస్తున్నారు. దీంతో అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి. అక్కడకు వెళ్లే సాధారణ రోగుల్లో కొందరు కరోనా బాధితులుగా మారుతున్నారు. దీంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది అని పేర్కొంది.

ఇంటి మిద్దెపై విమానం తయారీ

ఓ ఔత్సాహికుడు తన ఇంటి మిద్దెపై విమానాన్ని డిజైన్‌ చేశారని ఈనాడు ఓ కథనంలో తెలిపింది.

ఈ విమానం తొలిసారిగా ఆకాశంలోకి ఎగిరింది. దీనిలో ఆరుగురు కూర్చోవచ్చు.

మహారాష్ట్రకు చెందిన కెప్టెన్‌ అమోల్‌ యాదవ్‌ దీన్ని తయారుచేశారు. పూర్తిగా భారత్‌లోనే ఒక విమానాన్ని రూపొందించాలన్న ఉద్దేశంతో ఆయన రెండు దశాబ్దాలుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు దీన్ని సాకారం చేశారు.

ఓ టెక్నీషియన్‌ సాయంతో దీనిపై తొలిదశ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అవి అద్భుతంగా సాగాయన్నారు. రెండో దశ పరీక్షల్లో దీన్ని 2వేల అడుగుల ఎత్తులో గగనవిహారం చేయిస్తామన్నారు.

తొలి దశ పరీక్షల కోసం పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) గత ఏడాది అనుమతిచ్చింది. విమానంపై పరీక్షల నిర్వహణకు భారీగా బీమా చేయించాల్సి ఉంటుందని, కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుకున్నానని అమోల్‌ తెలిపారు.

ఎస్పీ బాలు భార్య సావిత్రికి కరోనా పాజిటివ్

గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

ఈ నెల 5న బాలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం అర్థరాత్రి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకు తరలించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నట్లు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీబీ ఆరోగ్యంపై అధికారిక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాయి.

ప్రస్తుతం బాలు భార్యను కూడా వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కరోనా యోధులకే తొలుత టీకా

శాస్త్రవేత్తలు కరోనా టీకా కోసం నిరంతరం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారని, వారి కృషి ఫలించి టీకా అందుబాటులోకి వస్తే కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికే తొలుత టీకా ఇస్తామని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే చెప్పినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

శనివారం ఎర్రకోట దగ్గర స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రధాని మోదీ ప్రకటించిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను చౌబే స్వాగతించారు. కాగా, రష్యా టీకా 'స్పుత్నిక్‌ వీ' సమర్థతను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పరిశీలిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ అన్నారు.

కరోనాపై పోరులో ప్రపచంచదేశాలతో పోల్చితే భారత్‌ మెరుగైన స్థానంలో ఉన్నదన్నారు. కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)