కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌: చైనా కంపెనీల బెట్టింగ్ దందా.. నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఫొటోలో రంగులెలా ఉంటే బాగుంటాయి? తర్వాతి రంగు ఏది వస్తుందో చెప్పండి? రూ. లక్షలు గెలుచుకోండి.. అంటూ ఇంటర్నెట్‌లో పందేలు నిర్వహిస్తూ రూ. వందల కోట్లు లాగేస్తున్న చైనా కంపెనీల ప్రతినిధులను నలుగుర్ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారని 'ఈనాడు' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ఇద్దరు యువకుల ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేయగా ఈ బెట్టింగ్‌ రాకెట్‌ వెలుగు చూసిందని కమిషనర్ చెప్పారు. నిందితులపై చైనా నిషేధం, తెలంగాణ గేమింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. వీరి ఖాతాల్లోని రూ.30 కోట్ల నగదును స్తంభింపజేశామని తెలిపారు.

వల వేస్తున్నారిలా..: టెలిగ్రామ్‌ మెసెంజర్‌ ద్వారా యువకులు, విద్యార్థులను చైనా కంపెనీలు సంప్రదిస్తున్నాయి. వారికి వేర్వేరు యాప్‌లను పంపించి డౌన్‌లోడ్‌ చేసుకోమంటున్నాయి. బ్యాంక్‌ ఖాతాల వివరాలు, గూగుల్‌పే, పేటీఎం వివరాలను యాప్‌తో అనుసంధానించాలని సూచిస్తున్నాయి.

తర్వాత దిల్లీలోని కాల్‌సెంటర్ల ద్వారా బెట్టింగ్‌ నిర్వాహకులు వారికి ఫలానా వెబ్‌సైట్‌లో ఆటలున్నాయంటూ చెబుతున్నారు. ఒక చిత్రంలో రంగులను పాక్షికంగా చెరిపేసి.. ఆ రంగులేవో సరిగ్గా చెబితే.. డబ్బులు ఇవ్వడం. అలాగే రంగులపై పందెం కట్టి గెలిస్తే రూ. వేలల్లో నగదు జమ చేయడం వీరు ఆటల్లో అనుసరిస్తున్న విధానం.

సులువైన ఆ ఆటల ద్వారా ఒక్కరోజులోనే రూ.లక్షలు సంపాదించుకోవచ్చంటూ వివరిస్తున్నారు. ఆశతో వేల మంది యువకులు, విద్యార్థులు పందేలాడుతున్నారు. లాభాలొస్తున్న సమయంలో బెట్టింగ్‌ నిర్వాహకులు ప్రవేశించి ఆటల్లో పాల్గొన్న వారిని ఓడించి రూ. లక్షలు కొల్లగొడుగుతున్నారు.

ఇ-కామర్స్‌ సంస్థల ముసుగు..: పందేల్లో పాల్గొంటున్న వారి నుంచి నగదు బదిలీ చేసుకునేందుకు పలు పేర్లతో ఇ-కామర్స్‌ సంస్థలను దిల్లీలో రెండేళ్ల క్రితం ప్రారంభించారు. పందేల్లో కొల్లగొట్టిన నగదును ఇ-కామర్స్‌ సంస్థల ద్వారా చైనా కంపెనీలకు బదిలీ చేస్తున్నారని సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాశ్‌ మహంతి తెలిపారు.

ఏడు నెలల్లో రూ. 1100 కోట్ల లావాదేవీలను గుర్తించామని, పన్ను ఎగవేసేందుకు కరీబియన్‌ దీవుల్లోని కేమెన్‌లో ఒక కంపెనీని ప్రారంభించి అందులోకి రూ.110 కోట్లు బదిలీ చేశారని వివరించారు.

డేటింగ్‌ యాప్‌లతోనూ నగదు లూటీ..: ఇవే చైనా కంపెనీలు డేటింగ్‌ యాప్‌లతోనూ నగదు లూటీ చేస్తున్నాయని అదనపు సీపీ (నేర పరిశోధన) శిఖాగోయల్‌ తెలిపారు. యాహువోను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన ఎస్సై మదన్‌ వారి కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఈ వివరాలు తెలిశాయన్నారు.

డేటింగ్‌ యాప్‌లపై ఎవరైనా క్లిక్‌ చేస్తే.. వారి బ్యాంక్‌ ఖాతాల్లోంచి దానంటతదే నగదు బదిలీ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారన్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా మోసాలు చేసిన నేరస్థుల సొమ్ము కూడా ఇ-కామర్స్‌ సంస్థల్లో ఉన్నట్టు గుర్తించామన్నారు. కొందరు డైరెక్టర్లు చైనాకు పారిపోయారని, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపారు.

టిక్‌టాక్.. అంబానీ చేతికి... బైట్‌డ్యాన్స్‌తో రిలయన్స్‌ చర్చలు!

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ భారత కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు ముకేశ్‌ అంబానీ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. టిక్‌టాక్‌ భారత వ్యాపారంలో పెట్టుబడుల కోసం అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)తో బైట్‌డ్యాన్స్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గత నెల చివర్లోనే ఇరువర్గాల మధ్య చర్చలు మొదలయ్యాయని, ఇంకా కొలిక్కి రావాల్సి ఉందని ఓ టెక్నాలజీ వెబ్‌సైట్‌ కథనం పేర్కొంది.

అయితే, ఈ వార్తలపై రిలయన్స్‌, బైట్‌డ్యాన్స్‌, టిక్‌టాక్‌ ప్రతినిధులెవరూ స్పందించలేదు. చైనా ఇంటర్నెట్‌ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన బైట్‌డ్యాన్స్‌.. టిక్‌టాక్‌ మాతృసంస్థ.

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం జూన్‌లో నిషేధించింది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

గతవారం అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం సైతం టిక్‌టాక్‌, విచాట్‌ సహా పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది.

మైక్రోసా్‌ఫ్టతోనూ బైట్‌డ్యాన్స్‌ చర్చలు: టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ - బైట్‌డ్యాన్స్‌ మధ్య ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ సైతం ఈ యాప్‌పై ఆసక్తిగా ఉంది.

30 నిమిషాల్లో హ్యాకింగ్‌.. విస్తుపోయే నిజాలు!

ఏదైనా లోకల్‌ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి హ్యాకర్లకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుందని.. ఈ విషయం పాజిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ జరిపిన అధ్యయనాలలో తేలిందిని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. లోకల్‌ నెట్‌వర్క్‌లు ఎంత తేలికగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాజిటివ్‌ టెక్నాలజీస్‌ ఈ ప్రయోగం చేసింది. దీంట్లో ఎంత తేలికగా హ్యాక్‌ చేయొచ్చో తెలిసేలా చేసింది.

హాస్పటళ్లు, కార్పొరేట్‌ కంపెనీలు, ఫైనాన్స్‌, ఐటీ, టూరిజం ఇలా అన్నింటికి సంబంధించిన వాటి మీద టెస్ట్‌ చేసింది. దీనిలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ప్రతి ఆరు కంపెనీలలో ఒక కంపెనీ తేలికగా హ్యాంకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

పాజిటివ్‌ టెక్నాలజీస్‌కు సంబంధించిన వారు నిజమైన హ్యాకర్లు ఎలా అయితే దాడికి పాల్పడతారో అలాగే చేశారు. ఇలా చేయడానికి పెంటెస్ట్‌ అని పేరు పెట్టారు. హ్యాకర్లను పెంటెస్టర్లు అని పిలుస్తారు. పాజిటివ్ టెక్నాలజీస్ పరీక్షించిన సంస్థలలో 93 శాతం స్థానిక నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలిగింది.

ఈ ప్రయోగంలో కొన్ని సంస్థల డేటా గతంలో హ్యాకింగ్‌ బారిన పడినట్లు తెలిసింది. స్థానిక నెట్‌వర్క్‌ని హ్యాక్‌ చేయడానికి కనీసం 30 నిమిషాల నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు పట్టొచ్చని నిపుణులు తెలిపారు.

చాలా సందర్భాల్లో, దాడి సంక్లిష్టత తక్కువగా ఉంటుందని, ఇది ప్రాథమిక నైపుణ్యాలు కలిగిన హ్యాకర్ లోపలికి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. వీటిలో కనీసం ఒక డొమైన్ ఖాతా పాస్‌వర్డ్‌ను హ్యాకర్ విజయవంతంగా ఛేదించ గలిగితే వారు ఇతర వినియోగదారుల పాస్‌వార్డులను ఆఫ్‌లైన్‌లో హ్యాక్‌ చేయవచ్చని తేలింది.

ఈ ప్రయోగంలో ఇదేవిధంగా చేసి పాజిటివ్‌ టెక్నాలజీస్‌ వారు 90,000 ఈ మెయిల్స్‌ను కనుగొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)