You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పసిబిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులను నమ్మించారు. రూ.13 లక్షలకు వేరే జంటకు అమ్మేశారు’: ప్రెస్ రివ్యూ
పసిబిడ్డ చనిపోయిందని నమ్మించి, ఇంకో జంటకు భారీ మొత్తానికి విక్రయించిన ఓ ఉదంతాన్ని విశాఖ పోలీసులు గుర్తించారంటూ ‘ఈనాడు’ పత్రిక ఓ వార్త రాసింది.
సృష్టి ఆసుపత్రి కేసుపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లికి బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ బిడ్డను ఇంకో జంటకు భారీ మొత్తానికి అమ్మేసిన విషయం తాజాగా బయటపడింది. ఇందులో మరో ఆసుపత్రికి సంబంధం ఉండటంతో ఆ వైద్యురాలిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి, డీసీపీ-2 సురేష్‌బాబులు వెల్లడించిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా చోడవరం మండలానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మి గతేడాది చోడవరంలోని స్థానిక ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది.
అక్కడున్న నూకరత్నం అనే మహిళ ఆమెను పరిచయం చేసుకొని విశాఖ సృష్టి ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవం చేస్తారని నమ్మించింది. ఆశావర్కర్ కె.వెంకటలక్ష్మి, ఆమె బంధువైన రామకృష్ణ (సృష్టి ఆసుపత్రి ఏజెంట్) భాగస్వాములై సృష్టి ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం వెంకటలక్ష్మిని నవంబరులో తీసుకువచ్చారు.
జనవరి నెలాఖరులో ప్రసవం అవుతుందని వైద్యురాలు డాక్టర్ తిరుమల చెప్పడంతో జనవరి 29న ‘సృష్టి’లో ఆమెని ప్రసవం నిమిత్తం చేర్చారు. రక్త పరీక్షలు చేసి ఆ నివేదికను సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రికి చెందిన డాక్టర్ పద్మజకు పంపించారు.
పరిశీలించిన పద్మజ.. సిజేరియన్ చేయాలని చెప్పటంతో వెంకటలక్ష్మిని సృష్టి ఆసుపత్రి నుంచి డాక్టర్ తిరుమల, డాక్టర్ సరోజినిల సహకారంతో పద్మజ ఆసుపత్రిలో జనవరి 30న చేర్పించారు. మర్నాడు ఆమెకు సిజేరియన్ చేయగా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
వెంకటలక్ష్మి దంపతులకు పుట్టిన బిడ్డ చనిపోయిందని వైద్యులు, ఆశా వర్కర్, ఏజెంట్ రామకృష్ణలు నమ్మించారు. బిడ్డను ఒక తెల్లని వస్త్రంలో ఉంచి చనిపోయినట్లు చూపించి తీసుకువెళ్లిపోయారు. ఆమెను ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేశారు. బిడ్డను రహస్యంగా అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం విజయనగరానికి చెందిన దంపతులకు రూ.13 లక్షలకు బిడ్డను విక్రయించారు.
ప్రసవం సమయానికి పద్మజ ఆసుపత్రిలో చేరినప్పుడు బిడ్డ తల్లిదండ్రుల పేర్లను వెంకటలక్ష్మీ, సన్యాసిరావుగా రాసిన డాక్టర్ పద్మజ, తర్వాత బిడ్డను మరో ఆసుపత్రికి పంపించినప్పుడు తల్లిదండ్రుల పేర్లను మార్చి రాశారు.
ఈ కేసు విషయమై తాజాగా పద్మజ, నూకరత్నంలను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు ఇప్పటికే జైలులో ఉన్నారు. సృష్టి ఆసుపత్రి ద్వారా పిల్లలు అమ్మకాలు జరిగినట్లుగా వెలుగులోకి రావటంతో తన బిడ్డను కూడా ఇలానే అమ్మి ఉంటారనే అనుమానంతో వెంకటలక్ష్మి జులై 30న ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
(విశాఖలో పిల్లల అక్రమ రవాణాపై ఇటీవల ‘బీబీసీ తెలుగు’ కథనం రాసింది. ఆ కథనం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి. ‘బాబును నాకు చూపించకుండానే హాస్పిటల్ వాళ్లు తీసుకున్నారు’’.. విశాఖలో బయటపడ్డ పసిపిల్లల వ్యాపారం)
‘అమరావతిలో భవనాలు నిలిచిపోతే ఆ వృథాకు బాధ్యులెవరు?’
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని, ఆ భవనాలు నిలిచిపోతే డబ్బంతా వృథాయే కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వార్త రాసింది.
‘అమవరావతి భవనాలకు వెచ్చించిన సొమ్ము ప్రజలదే. అందువల్ల ఆ నష్టమూ ప్రజలకే. ఇది రాష్ట్ర ఖజానాకూ నష్టమే. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు’? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాజధానిలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారు? ఏ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయాయి? వంటి వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.
ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆ మొత్తాన్ని ఎలా రాబట్టాలన్న విషయంపై తదుపరి విచారణలో తేలుస్తామని పేర్కొంది.
తెలంగాణలో ఇళ్లకు సత్వర అనుమతులు
భవన నిర్మాణాలకు, లే అవుట్లకు త్వరగా అనుమతులు మంజూరయ్యేలా తెలంగాణలో కొత్త విధానం రానుందంటూ 'సాక్షి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీలో అవినీతి నిర్మూలన, సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతుల జారీ నిమిత్తం కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోంది.
పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులిచ్చేందుకు ఆరేళ్ల కింద తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ పాలసీ స్ఫూర్తిగా రూపకల్పన చేసిన టీఎస్-బీపాస్ విధానాన్ని బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పాలసీకి చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో దీనిని అమలు చేయనుంది.
ఈ విధానం ప్రకారం ఏడు మీటర్ల ఎత్తుతో 75 చదరపు గజాల ప్లాట్‌లో భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. భవనం నిర్మించడానికి దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్ చేసుకుని టోకెన్ ఫీజుగా రూ.1 చెల్లిస్తే సరిపోనుంది. (టోకెన్ ఫీజుతోపాటు తొలి ఆస్తిపన్నుగా రూ.100 చెల్లించడం ఐచ్ఛికం). ప్లాటు సైటు, ఫ్లోర్ల సంఖ్యను తెలపడంతోపాటు సదరు స్థలం ప్రభుత్వ స్థలం/చెరువులు/ఇతర నిషేధిత భూమి కాదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది.
75 నుంచి 600 చదరపు గజాల వరకు (500 చదరపు మీటర్లు) ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ఆన్‌లైన్‌లో తక్షణ అనుమతులు(ఇన్‌స్టంట్ పర్మిషన్æ) జారీ కానున్నాయి.
జీహెచ్‌ఎంసీలో జోనల్ కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ స్వీయ ధ్రువీకరణ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనుంది. ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినట్టు తేలితే సదరు అనుమతులను అధికారులు ఉపసంహరించుకుంటారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా జారీ చేసిన అన్ని అనుమతులను టీఎస్-బీపాస్ వెబ్‌సైట్‌లో ప్రదర్శన కోసం ఉంచనున్నారు. వీటిపై ఎవరైనా 21 రోజుల్లోగా అభ్యంతరం తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు.
భారీ భవనాలకు 21 రోజుల్లో అనుమతులు 600 చదరపు గజాల(500 చదరపు మీటర్ల) పైన ఉన్న స్థలంలో నివాస భవనాలు, 10 మీటర్లకుపైగా ఎత్తైన నివాస భవనాలు, అన్ని నాన్ రెసిడెన్షియల్ భవనాలు, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో జారీ చేయనున్నారు. ఇంటి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో 95 శాతం 600 చదరపు గజాలలోపు స్థలాలకు సంబంధించినవే ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోనుంది.
అనుమతుల కోసం ఏ ప్రభుత్వ శాఖనూ సంప్రదించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పరిశీలన అనంతరం 21 రోజుల్లో అనుమతి జారీ చేయాలి. లేని పక్షంలో 22వ రోజు ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా పర్మిషన్ జనరేట్ కానుంది. ఇలా ఆటోమెటిక్‌గా జారీ చేసిన అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం/ భవన నియమాళిని ఉల్లంఘించడం/ మాస్టర్ ప్లాన్ భూవినియోగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలితే అనుమతుల జారీ తేదీ నుంచి 21 రోజుల్లోగా వాటిని ఉపసంహరించుకునే అధికారం సంబంధిత అధికారులు కలిగి ఉంటారు.
'హైదరాబాద్‌లో ఏటా 500 కోట్ల వ్యాక్సిన్ డోసులు'
ఏటా ఐదు వందల కోట్ల వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్‌లో తయారవుతున్నాయని, ప్రపంచ ఉత్పత్తిలో ఇది మూడో వంతు అని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించినట్లు 'నమస్తే తెలంగాణ' ఓ వార్త రాసింది.
‘‘కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడేలా హైదరాబాద్ లైఫ్‌సైన్సెస్ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని, ఆ దిశగా ఇప్పటికే ఫలవంతమైన భాగస్వామ్యాన్ని అందించిందని కేటీఆర్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ, దేశీయంగా బయోటెక్ పరిశ్రమలను ఉన్నతస్థానాలకు తీసుకువెళ్లేందుకు, బయోరంగంలో భారత్‌స్థానాన్ని మరింత బలోపేతంచేసేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ గురువారం కేంద్ర ఆరోగ్య, సైన్స్‌అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు.
హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలు కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తున్నాయని.. త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని చెప్పడానికి గర్వంగా ఉందని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అనేక ఫార్మాకంపెనీలు హైడ్రాక్సీక్లోరోక్విన్ తదితర మందులతయారీలో పాలుపంచుకొంటున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ అనుమతులు, టెస్టింగ్ ట్రాకింగ్ వ్యవస్థను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. తద్వారా క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ల తయారీలో కంపెనీలు మరింత సులభంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్ లేబోరేటరీ కేంద్రం బ్రిటిష్‌కాలంలో ఏర్పాటుచేసిందని.. ఇప్పటికీ అక్కడే కొనసాగుతుడటం బయోటెక్ కంపెనీలకు కష్టమవుతోందని తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో శాంపిళ్లను ఈ కేంద్రానికి పంపించడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి కంపెనీలు వేగంగా పనిచేస్తున్న తరుణంలో వారికి కొంత సులభంగా అనుమతులివ్వాలని సూచించారు. తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు.
ప్రపంచ బయోటెక్‌రంగంలో పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతులు, క్లియరెన్స్‌లు మరింత సులభంగా ఉండేలా నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా వికేంద్రీకరణకు చర్యలు తీసుకున్న కేంద్రం.. సీడీఎస్‌సీవో జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇవ్వాలని కోరారు.
దేశంలో వ్యాక్సిన్‌ల తయారీకి సుమారు ఆరు కేంద్ర మంత్రిత్వశాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతోపాటు రాష్ట్రస్థాయిలోనూ ప్రక్రియ ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్.. ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ క్లిష్టమైన ప్రక్రియను కొంత సులభతరం చేయాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఎఫ్‌డీఏఏ సంస్థలు మార్గదర్శకాలను జారీచేశాయని.. వీటికనుగుణంగా దేశీయంగానూ మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే రెండు కంపెనీలు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని పేర్కొన్న మంత్రి కేటీఆర్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌కు కూడా నూతన మార్గదర్శకాలను విడుదల చేయాలని సూచించారు. కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేశాక దానిని పెద్దఎత్తున మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం కల్పించాలని.. తద్వారా పేదలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీని సిద్ధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు..
ఇవి కూడా చదవండి:
- మతాలకు అతీతంగా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్న రాజమండ్రి యువకులు
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)