తెలంగాణలో రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60కి పెంచే యోచన - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 ఏళ్లకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. బుధవారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ అజెండా తీసుకొస్తారని, క్యాబినెట్‌ ఆమోదించాక పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ సవరణకు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

‘‘ఆ రోజు కుదరకపోతే ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకల సందర్బంగా సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. వయో పరిమితిని 60 లేదా 61కి పెంచుతామని గతంలో సీఎం హామీ ఇచ్చార’’ని ఈ కథనం గుర్తు చేసింది.

వయోపరిమితి పెంపు వల్ల ఎంత ఆర్ధిక భారం పడుతుందో లెక్కించాల్సిందిగా వేతన సవరణ కమీషన్‌ను కోరగా, మూడు నెలల కిందటే నివేదికను అందజేసినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

మూడు డీఏలతోపాటు, వయోపరిమితి పెంపుపై కూడా ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటిస్తారని, శ్రావణమాసం కావడం, ఈనెల 17 వరకు ముహుర్తాలు ఉండటంతో ఈలోగానే ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఈ కథనంలో పేర్కొంది.

ఈ నెలలో రిటైర్మెంట్ ఉన్నవారికి కూడా ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది.

రాజధాని కోసం రాజీనామా చేయండి- వైసీపీకి చంద్రబాబు 48 గంటల గడువు

మూడు రాజధానుల విషయంలో రాజీనామాలు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరేందుకు తాము సిద్ధమని, వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలకు సిద్ధపడాలని ఇందుకు 48 గంటల గడువిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేసినట్లు సాక్షి పత్రిక కథనం ఇచ్చింది.

మూడు రాజధానుల విషయం ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి, మళ్లీ ప్రజాభిప్రాయం కోరాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేసినట్లు ఈ కథనం పేర్కొంది.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం వైసీపీకి లేదని, రాజధాని వ్యవహారం ఐదుకోట్ల ప్రజలకు సంబంధించినదని చంద్రబాబు అన్నారు.

రాజధాని కోసం తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు సిద్దంగా ఉన్నారని, వైసీపీ కూడా సిద్ధం కావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అయితే వికేంద్రీకరణ గురించి తమ మ్యానిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నామని వైసీపీ నేతలు స్పష్టం చేసినట్లు సాక్షి పత్రిక రాసింది.

ఎన్నికల్లో హామీలను మరిచిన చరిత్ర చంద్రబాబుదని, బాబు రాజీనామాల డిమాండ్‌ను ఆయన పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలే వ్యతిరేకిస్తున్నారని కూడా సాక్షి పేర్కొంది.

అప్పు కట్టలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపారు- గుంటూరు జిల్లాలో దారుణం

భూమిని తనఖా పెట్టి తీసుకున్న అప్పు తీర్చలేదన్న ఆగ్రహంతో ఓ గిరిజన మహిళను ట్రాక్టర్‌ తో తొక్కించి చంపారని ఈనాడు కథనం ఇచ్చింది.

‘‘గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురం తండాకు చెందిన గిరిజన దంపతులు భూమి సాగుకోసం నర్సింగపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ.3.80 లక్షల అప్పు తీసుకున్నారు.

అయితే అప్పు తీర్చాలంటూ గత కొన్నాళ్లుగా శ్రీనివాసరెడ్డి వారిని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

అప్పు తీర్చకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వారు పొలానికి వెళుతున్నారని తెలిసి శ్రీనివాసరెడ్డి శివాపురం తండాకు చేరుకున్నారు.

అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. మాటమాటా పెరిగి ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌ను మహిళ మీద నుంచి పోనిచ్చారు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆసుపత్రి పొమ్మన్నది- ఊరు ఉండొద్దన్నది- వివక్షకు యువకుడి బలి

కరోనా అనుమానంతో ఆసుపత్రికెళ్లగా ఇంట్లో చికిత్స సరిపోతుందని డాక్టర్లు సూచించారని, అయితే వ్యాధి లక్షణాలతో ఊళ్లో ఎలా ఉంటారంటూ గ్రామస్తులు సూటిపోటి మాటలు అనడంతో మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని ఇచ్చింది.

మెదక్‌ జిల్లా కూచన్‌ పల్లి గ్రామంలో ఓ యువకుడు, అతని భార్య నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్నారు.

ఇటీవల గొంతు నొప్పి రావడంతో దంపతులిద్దరూ అనుమానంతో ఆసుపత్రికి వెళ్లారు. భర్తకు పాజిటివ్ అని తేలింది.

అయితే స్వల్ప లక్షణాలే ఉన్నందున ఇంట్లో ఉంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారు. ప్రాణభయం లేదని వైద్యులు చెప్పడంతో ధైర్యంగా ఇంటికొచ్చిన ఆ యువకుడికి గ్రామస్తుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి.

అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి నేరుగా మెదక్‌ జిల్లా ఆసుపత్రికి ఫోన్‌ చేసి, వైరస్‌ బాధితుడికి చికిత్స అందించాలని కోరారు.

దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆయన్ను ఈనెల 1న అంబులెన్స్‌లో తీసుకెళ్లి చికిత్స చేసి లక్షణాలు తగ్గడంతో ఇంటికి పంపారు.

అయితే ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ యువకుడు తెల్లవారే సరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గ్రామస్తులు సూటిపోటి మాటలు అన్నారని, ఊళ్లోంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారని, దానికి మనస్తాపంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని యువకుడి భార్య ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)