కరోనావైరస్: భారత్‌లో పది లక్షలు దాటిన కేసులు... ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో భారత్

ప్రచురణ

భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య పది లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 35 వేల కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ మూడో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి.

మొత్తంగా పది లక్షల కేసులు దాటిన దేశాలు ఈ మూడే.

భారత్‌లో నమోదైన పది లక్షల కేసుల్లో దాదాపు 34 శాతం యాక్టివ్ కేసులున్నాయి.

కరోనావైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య భారత్‌లో ఎక్కువగానే ఉంది. మరణాల రేటు తక్కువగా ఉంది.

అయితే, ఈ మధ్య మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 25,602 మంది కరోనావైరస్‌తో మరణించారు.

కేసుల సంఖ్య కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్యలో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

కరోనావైరస్ కేసుల సంఖ్యలో ఈ నెల ఆరంభంలోనే రష్యాను దాటేసి, భారత్ మూడో స్థానంలోకి వచ్చింది.

భారత్‌లో తొలి కేసు జనవరిలోనే వచ్చినా, వైరస్ విజృంభించేందుకు సమయం తీసుకుంది.

అంతర్జాతీయ విమానాలు నిలిపివేసి, దాదాపు రెండు నెలల పాటు కఠినమైన లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల కేసులు ఎక్కువగా పెరగలేదని నిపుణులు భావిస్తున్నారు.

అయితే, ఆర్థికంగా తీవ్ర ప్రభావాలు చూపుతుండటంతో జూన్ చివర్లో భారత్ లాక్‌డౌన్ ఎత్తివేసింది.

పరీక్షలను పెంచింది. అందుకు అనుగుణంగా కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి.

లాక్‌డౌన్‌తో పరీక్షలు, ట్రేసింగ్ చేసేందుకు దొరికిన సమయాన్ని దిల్లీతోపాటు కొన్ని రాష్ట్రాలు వృథా చేశాయని నిపుణుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది.

అయితే, దిల్లీలో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, దేశంలోని చాలా చోట్ల కేసులు పెరుగుతున్నాయి.

అత్యధికంగా మహారాష్ట్రలో 2.8 లక్షల కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. ఇవి కూడా కరోనా హాట్‌స్పాట్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. బెంగళూరులో ప్రస్తుతం ఒక వారం లాక్‌డౌన్ అమల్లో ఉంది. చెన్నైలో ఈ మధ్యే కొన్ని రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేశారు.

ఇలాంటి లాక్‌డౌన్‌లు మరిన్ని కనిపించే అవకాశాలున్నాయి.

భారత్‌లో మరణాల రేటు నిజంగా తక్కువగా ఉందా?

అపర్ణ అల్లూరి, షాదాబ్ నజ్మీ

కరోనావైరస్ మహమ్మారి విషయంలో భారత్‌కు ఏదైనా సానుకూల అంశం ఉందంటే, అది మరణాల రేటు తక్కువగా ఉండటమే.

కరోనా మృతుల సంఖ్య పరంగా చూస్తే, భారత్‌ది ప్రపంచంలో ఎనిమిదో స్థానం. కానీ, ప్రతి పది లక్షల మందికి నమోదవుతున్న మరణాల ప్రకారం చూస్తే, భారత్ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది.

భారత్ కోవిడ్ మరణాల గణాంకాల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. మరణాలు పూర్తి స్థాయిలో నమోదు కాకపోతుండవచ్చని చాలా మంది నిపుణులు అంటున్నారు.

అయితే, భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్, ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేసియాల్లోనూ మరణాల రేటు తక్కువగానే ఉంది.

ప్రాంతీయంగా కనిపిస్తున్న ఈ సరళిని కూడా గమనించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)