You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహేంద్ర సింగ్ ధోనీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ "మాహీ"లా ఎలా మారాడు?
- రచయిత, పరాగ్ పాఠక్
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి
- ప్రచురణ
ఒకరి పుట్టినిల్లు పట్నా. మరొకరిది రాంచీ. కొత్త రాష్ట్రంగా జార్ఖండ్ అవతరించే ముందు బిహార్‌లో భాగమై ఉండేది. అందుకే రెండు రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలూ ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి.
పట్నా నుంచి వచ్చిన యువకుడు పొడుగైనవాడు.. అందగాడు.. ఆకట్టుకునే దేహం కలవాడు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే అతడికి సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. టీవీ సీరియల్స్‌లో ఇంట్లో అబ్బాయిగా అతడు అందరి మన్ననలు పొందాడు. అదే అతణ్ని వెండి తెరవైపు నడిపించింది.
మరోవైపు రాంచీ నుంచి వచ్చిన యువకుడికి మొదట్నుంచీ క్రీడలపై ఆసక్తి ఉండేది. ఫుట్‌బాల్‌లో గోల్‌కీపర్‌గా ఉండే అతడు క్రికెట్‌లో వికెట్‌కీపర్‌గా మారాడు.
బౌలర్లకూ అతడు చుక్కలు చూపించేవాడు. పొడుగైన జుట్టు, దేశీ స్వాగ్‌తో క్రికెట్ ఆడే అతడికి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో టీసీగా పనిచేసిన అతడు బిహార్ రంజీ టీమ్‌తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.
తన వైపుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అతడు పైకి వెళ్లాడు. క్రికెట్ సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ రాంచీ రాకుమారుడు మన అందరికీ సుపరిచితుడైన మహేంద్ర సింగ్ ధోనీ. టీం ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యాట్స్‌మన్‌లలో అతడూ ఒకరు.
వన్ డే, టీ-20 క్రికెట్‌లలో అత్యుత్తమ ఫినిషింగ్ బ్యాట్స్‌మన్గా అతడికి మంచి పేరుంది. తిరుగులేని కెప్టెన్‌గానూ ఆయన భారత క్రికెట్ జట్టును నడిపించారు.
వెండి తెరకు ఎక్కిన ధోనీ జివిత చరిత్ర <bold>ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ</bold>లో మాహీ పాత్రలో ఒదిగిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.
ధోనీని అభిమానులంతా మాహీ అని ముద్దుగా పిలుచుకుంటారు. కెరియర్‌లో పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ధోనీ.. చాలా ప్రశాంతంగా, సాధారణంగా కనిపించేవాడు.
ధోనీ ముఖం, శరీరంతో పోలిస్తే శుశాంత్ భిన్నంగా కనిపిస్తాడు. వీరిద్దరి మధ్య పోలికలు లేకపోయినప్పటికీ.. ధోనీ కథను నటించే బాధ్యతను సుశాంత్ తీసుకున్నాడు. సర్వశక్తులూ ఒడ్డి తెరపై ధోనీలా మారేందుకు అతడు ప్రయత్నించాడు.
ధోనీలా మారేందుకు సుశాంత్ క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేశారు. మాజీ క్రికెటర్ కిరణ్ మోర్, ఓ వీడియో ఆనలిస్ట్ ఆధ్వర్యంలో ఏడాది పాటు అతడు శిక్షణ తీసుకున్నాడు.
ఓ వికెట్ కీపర్ ఎలా ఆలోచిస్తాడు? అతడి కదలికలు ఎలా ఉంటాయి? బౌలర్‌కు అతడు ఎలా సాయం చేస్తాడు? ఫిట్‌నెస్‌తో ఉండటం ఎలా? లాంటి అంశాల్లో సుశాంత్‌కు కిరణ్ శిక్షణ ఇచ్చారు. ః
మరోవైపు ధోనీ షాట్‌లను వీడియో అనలిస్ట్ విశ్లేషించి సుశాంత్‌కు చెప్పేవారు. దీంతో ఏ బాల్‌ను ఎలా కొట్టాలో సుశాంత్‌కు అర్థమయ్యేది.
ధోనీ బ్యాట్ కదలికలు, పెద్దపెద్ద షాట్‌లు కొట్టేటప్పుడు చేతులు, కాళ్లు ఉపయోగించే తీరు, ఏ కాలుపై ఎక్కువ బలం పెడతారు? క్రీజ్ ఎక్కడుందో గుర్తుపెట్టుకొని ఆడటం, క్రీజ్ ముందుకొచ్చి గట్టి షాట్‌లు కొట్టడం లాంటివి సుశాంత్‌కు అనలిస్ట్ నేర్పించారు.
ధోనీకి ప్రత్యేకమైన హెలికాప్టర్ షాట్‌ను ఆరు ఫ్రేమ్‌లలో సుశాంత్‌కు చూపించారు. బౌలింగ్ మెషీన్ సాయంతో సుశాంత్‌కు బాల్‌లు వేసేవారు. హెలికాప్టర్ షాట్ కోసం రోజుకు 300 కంటే ఎక్కువ బాల్‌లే సుశాంత్ ఆడేవారు.
తెరపై ఈ షాట్ మరీ అసహజంగా కనిపించకుండా చూసేందుకు ఆయన చాలా శ్రద్ధ పెట్టారు.
కిరణ్, వీడియో అనలిస్ట్‌ల కంటే ముందు.. జూహూకు చెందిన గౌతమ్ మంగేలా నుంచి క్రికెట్‌లో సుశాంత్ సాధారణ శిక్షణ తీసుకున్నారు. గౌతమ్‌కు ఒక క్రికెట్ శిక్షణ అకాడమీ ఉంది. దీన్ని 25ఏళ్లుగా జూహూలో ఆయన నడిపిస్తున్నారు.
<bold>ధోనీని అర్థం చేసుకున్నారిలా...</bold> ధోనీగా మారే క్రమంలో ఆయన్ను సుశాంత్ మూడుసార్లు కలిశారు. మొదటిసారి కలిసినప్పుడే ధోనీ తన జీవిత కథను సుశాంత్‌కు వివరించారు. రెండోసారి సుశాంత్ వరుస ప్రశ్నలతో ధోనీ దగ్గరకు వచ్చారు.
చాలా ప్రశ్నలు అడుగుతున్నారు అని సుశాంత్‌కు ధోనీ చెప్పినప్పుడు.. మీ అభిమానులు నాలో మిమ్మల్ని చూసుకుంటారు. అందుకే మిమ్మల్ని నేను పూర్తిగా అర్థంచేసుకోవాలి అని సుశాంత్ వివరించారు.
"సుశాంత్ ఒక నటుడు. క్రికెటర్ కాదు. కానీ క్రికెట్‌లోని చిన్న చిన్న మెళకువలనూ ఆయన నేర్చుకున్నారు. ఆయన చాలా కష్టపడ్డారు. ఫాస్ట్ బౌలర్లను, బౌలింగ్ మెషీన్‌కూ ఆయన ఎదురునిలిచారు.
ఆయన వెనకడుగు వేయడు. ధోనీకి ప్రత్యేకమైన హెలికాప్టర్ షాట్‌ను నెలన్నర రోజుల్లో సుశాంత్ నేర్చుకున్నారు. రోజూ 300నుంచి 400 బాల్‌లను ఆయన ఆడేవారు" అని సుశాంత్‌కు శిక్షణ ఇచ్చిన కిరణ్ వివరించారు.
బ్యాటింగ్ చేసేటప్పుడు శరీరానికి బ్యాట్ అడ్డుపెట్టుకోవచ్చు. కానీ కీపింగ్ చేసేటప్పుడు బాల్ నేరుగా తగులుతుంది.
అందుకే ప్రాక్టీస్ చేసే సమయంలో సుశాంత్‌కు ముఖం, వేళ్లు, ఛాతీపై గాయాలయ్యాయి.
ఒకసారి అయితే బాల్ నేరుగా పక్కటెముకలకు తగిలింది. దీంతో సుశాంత్ పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అంధేరిలోని హన్స్‌రాజ్ మోరార్జీ పబ్లిక్ స్కూల్, చంద్రకాంత్ పండిట్ అకాడమీ, ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన బీకేసీ కాంప్లెక్స్‌లలో సుశాంత్ ప్రాక్టీస్ చేసేవారని కిరణ్ చెప్పారు. "సుశాంత్ రోజూ ఉదయం ఏడు గంటలకు గ్రౌండ్‌కు వచ్చేవారు. ఎప్పుడూ ఆయన ఆలస్యం చేయలేదు."
<bold>సుశాంత్‌ను ఎలా ఎంపిక చేశారు? </bold>సినిమా కోసం సుశాంత్‌ను ఎలా ఎంపిక చేశారో ధోనీ వ్యాపార భాగస్వామి, సినీ నిర్మాత అరుణ్ పాండే బీబీసీతో చెప్పారు. "ధోనీ సినిమా కోసం కొంత మందిని ఎంపిక చేశాం. ఆ జాబితాలో సుశాంత్ పేరుంది.
కైపోచే సినిమాలో సుశాంత్.. క్రికెట్ కోచ్ పాత్రలో నటించారు. అందుకే ఆయన క్రికెట్ ఆడివుంటారని మేం భావించాం. దీంతోపాటు ధోనీ పాత్ర పోషించేందుకు సుశాంత్ కూడా ఆసక్తి కనబరిచారు."
ఈ విషయంపై ధోనీని అడిగితే... "నేను కైపోచే చూశాను. అందులో సుశాంత్ నటననూ గమనించాను. అందుకే సినిమాకు ఎవరు దర్శకత్వం వహించాలనే విషయానికి ముందే.. సుశాంత్ ఈ పాత్రకు న్యాయం చేయగలడని నిర్ణయించాం"అని ధోనీ చెప్పారు.
పాత్రకు సంబంధించిన శిక్షణ తీసుకునేటప్పుడు నిరంతరం ధోనీని సుశాంత్ గమనించేవారు. అభిమానుల మధ్య కూర్చొని మ్యాచ్‌లు చూసేవారు. హోటల్ ప్రాంగణంలో కూర్చొని ధోనీ వ్యక్తిత్వాన్నీ ఒంటపట్టించుకున్నారు.
ధోనీకి సంబంధించిన ప్రతి చిన్న అంశంపైనా సుశాంత్ దృష్టిపెట్టేవారు. జట్టులోని మిగతా సభ్యులతో ధోనీ ఎలా మాట్లాడతారు? అభిమానులతో ఎలా మాట్లాడతారు? కొత్త వ్యక్తులతో ఎలా మాట్లాడతారు? ధోనీ వ్యవహార శైలి.. ఇలా అన్నింటినీ సుశాంత్ గమనించేవారు.
ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ
ప్రపంచంలో అత్యుత్తమ ఫిట్‌నెస్ గల క్రికెటర్‌లలో ఒకరిగా ధోనీకి మంచి పేరుంది. అలాంటి ధోనీ పాత్ర పోషించేందుకు సుశాంత్ చాలా కష్టపడాల్సి వచ్చింది. మొదటి దశలో ఆయన శరీర సామర్థ్యానికి పరీక్ష పెట్టే కసరత్తులు చేయాల్సి వచ్చేది.
కసరత్తులు, బాక్సింగ్, పర్వతాలు ఎక్కడం, అడ్డంకులను దాటుకుంటూ పరిగెత్తడం లాంటివి కూడా సుశాంత్ చేసేవారు. రెండో దశలో సుశాంత్‌కు బ్యాలే డాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. మూడో దశలో మెషీన్ల సాయంతో జిమ్‌లో ఆయన వర్కవుట్లు చేశారు.
వీటితోపాటు సైక్లింగ్ చేసేవారు. ఫుట్‌బాల్ కూడా ఆడేవారు. ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా విడుదలయ్యే ముందు బీబీసీతో సుశాంత్ మాట్లాడారు.
ధోనీ జీవితం, తన జీవితం ఒక లాంటిదేనని అప్పుడు సుశాంత్ వ్యాఖ్యానించారు.
"మా ఇద్దరి జీవితాల్లో చాలా పోలికలున్నాయి. ధోనీ పాత్ర పోషించడంలో అవి ఎంతో తోడ్పడ్డాయి. ధోనీ జైత్ర యాత్రలో నన్ను నేను చూసుకున్నాను. అందుకే ఈ పాత్ర తేలిగ్గా పోషించగలిగాను" అని సుశాంత్ చెప్పారు.
"మా రంగాలు వేరైనా.. జీవిత విధానాలు ఒకటే. మేం ప్రతి దశలోనూ రిస్క్‌లు తీసుకున్నాం.. విజయం సాధించాం. అందరికీ ధోనీ గురించి బాగా తెలుసు. నేను తెరపై చిన్న తప్పు చేసినా.. అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది."
ఈ సినిమా 30 సెప్టెంబరు 2016లో విడుదలైంది. దీనికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. క్రికెట్ అభిమానులతోపాటు సినిమా అభిమానుల నుంచి దీనికి అద్భుత స్పందన లభించింది. దీన్ని తెలుగు, తమిళం భాషల్లోకి కూడా అనువదించారు.
ఇవి కూడా చదవండి:
- కువైట్: కొత్త చట్టం వస్తే లక్షలాదిమంది భారతీయులు అక్కడి నుంచి వచ్చేయాల్సిందేనా
- ఫేస్‌బుక్‌తో పోటీకి సిద్ధమైన స్వదేశీ యాప్ ఎలిమెంట్స్ కథేంటి
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును <link><caption>ఫేస్‌బుక్</caption><url href="https://www.facebook.com/BBCnewsTelugu/" platform="highweb"/></link>, <link><caption>ఇన్‌స్టాగ్రామ్</caption><url href="https://www.instagram.com/bbcnewstelugu/" platform="highweb"/></link>, <link><caption>ట్విటర్</caption><url href="https://twitter.com/bbcnewstelugu" platform="highweb"/></link>లో ఫాలో అవ్వండి. <link><caption>యూట్యూబ్</caption><url href="https://www.youtube.com/channel/UCiTCB-B_weEmwHk7ifNobQw" platform="highweb"/></link>లో సబ్‌స్క్రైబ్ చేయండి.)