You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్‌డౌన్-5: మే 31 తర్వాత ఏం జరుగుతుంది? దేశంలో లాక్‌డౌన్ పొడిగిస్తారా.. లేదా?
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇండియలో లాక్‌డౌన్ 4.0 ముగియడానికి మరో రెండు రోజులే మిగిలి ఉన్నాయి. భవిష్యత్ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై గురువారం నాడు హోంమంత్రి అమిత్‌షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు.
ఇప్పటి వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ వచ్చారు. అయితే అమిత్‌షా సమావేశానికి ముందు క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గబా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్టాడారు. అత్యధిక కేసులు ఉన్న13 నగరాలపై వారు ప్రధానంగా దృష్టిపెట్టారు.
ఈ చర్చల నేపథ్యంలో లాక్‌డౌన్ 5.0 వస్తుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. మరి వస్తే ఆ లాక్‌డౌన్ ఎలా ఉండబోతోంది?
లాక్‌డౌన్-5 వస్తుందా?
లాక్‌డౌన్-4లో సడలింపుల కారణంగా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ముందుగానే ఊహించింది. కానీ ఐదు రాష్ట్రాలలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండటంపై కేంద్రం ఆందోళన చెందుతోంది. కాబట్టి ఈసారి లాక్‌డౌన్ ఉంటే, ఈ రాష్ట్రాలపై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
అంతేకాదు లాక్‌డౌన్ విషయంలో ఈసారి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు కట్టబెట్టే అవకాశం కూడా లేదనలేము.
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు విమానాలను తక్కువగా నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము అభ్యర్ధించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారిపై ఆంక్షలు కొనసాగుతాయని, రైళ్లు ఎటూ నడుస్తాయని కర్ణాటక ప్రభుత్వం తన ట్వీట్‌లో పేర్కొంది.
రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ వస్తే నిబంధనల విధింపులో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించవచ్చనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రులతో హోంమంత్రి సమావేశానికి ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ లాక్‌డౌన్ ఆంక్షల్ని మరింత కఠినంగా, వేగవంతంగా అమలు చేస్తామని ప్రకటించారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కొన్ని సడలింపులపై తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. అయితే తాము కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ స్థానంలో కర్ఫ్యూ విధించింది.
వివిధ రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను బట్టి చూస్తుంటే ఇక ముందు రాష్ట్రాలే తమ స్థాయిలో లాక్‌డౌన్ నిబంధనలపై నిర్ణయాలు తీసుకుంటాయన్న అభిప్రాయం కలుగుతోంది.
ఈ పరిస్థితులనుబట్టి.. ఈసారి కేంద్ర ప్రభుత్వం మరో లాక్‌డౌన్ ప్రకటించకపోవచ్చు. కానీ రాబోయే 15 రోజుల్లో వేటిని నిషేధించాలి, వేటికి అనుమతించాలి అన్నదానిపై కొన్ని నిబంధనలను ప్రకటించే అవకాశం ఉంది.
రెడ్ జోన్‌లో వ్యాపారాలు
లాక్‌డౌన్-4కు ముందు పరిశ్రమలు ఆర్ధిక ప్యాకేజీని డిమాండ్ చేశాయి. ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరింది. చాలాచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు వారి సమస్య కొత్తగా కార్మికులను నియమించుకోవడం కాదు.. ఇప్పుడున్న వారితో ఎలా పని చేయించుకోవాలన్నదే వారికి ముఖ్యం.
ప్రస్తుతానికి రిటైల్ వ్యాపారాలు ఓపెన్ అయినా వాటిలో కస్టమర్లు లేరు, ఉద్యోగులూ లేరు. తెరిచే షాపులకు కూడా పరిమిత సమయంలోనే అనుమతిస్తున్నారు. ఇప్పుడు 10 శాతం షాపులు మాత్రమే తెరుచుకుంటున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్ బీబీసీకి చెప్పారు.
తెరవడానికి అనుమతి ఉన్నా వ్యాపారుల్లో భయం మాత్రం అలాగే ఉంది.
రెడ్ జోన్‌లో ఉన్న కొన్నిమార్కెట్లు ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. వేలాది దుకాణాలున్న దిల్లీ సదర్ హోల్‌సేల్ మార్కెట్ లాంటివి పూర్తిగా మూసేసి ఉన్నాయి. ఈ మార్కెట్ కంటైన్‌మెంట్ జోన్‌లోకి వస్తుంది. షాపులు తెరిచి ఉంచే వేళలను పెంచాలని, తద్వారా ఆదాయం పెరుగుతుందని వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.
అలాగే విద్యుత్, నీటి బిల్లులపై కూడా రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మెట్రోలు, రైళ్లు, లోకల్ రైళ్లు సిద్ధం...
తన ప్రయాణ సన్నాహాల గురించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మే 23న ఒక ఫోటోను ట్వీట్ చేసింది. మెట్రోలను నడపడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కానీ కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు.
దిల్లీలో ఒక్క గురువారం రోజే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో, మెట్రోను నడపాలనే నిర్ణయం ప్రమాదకరమే కావచ్చు. కానీ మెట్రో రైలు రెండు నెలలుగా మూసేయడంతో ఆదాయం లేక నిధుల లోటులో కూరుకుపోతుంది. సామాజిక దూరం పాటిస్తూ ఏడు సీట్లతో మెట్రోను నడపాలని ఒకవైపు, లేదంటే అత్యవసర సర్వీసుల వారికి మాత్రమే మెట్రోను నడపాలన్న ఆలోచన మరోవైపు కొనసాగుతోంది. అయితే మెట్రోలు రెడ్ జోన్లలో మాత్రం ఆగవు.
మరోవైపు ప్రభుత్వోద్యోగుల కోసం మెట్రోలను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశీయ విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలు మొదలు కావడంతో మెట్రో విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇక అంతర్జాతీయ విమానాల కోసం ప్యాసింజర్లు ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ఇంతకు ముందే దీనిపై సంకేతాలిచ్చారు.
కేంద్రం నిర్ణయం కోసం ఆలయాలు, ప్రార్ధనా స్థలాల ఎదురు చూపు
లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు పెరుగుతున్నందున అదే క్రమంలో ప్రజల నుంచి డిమాండ్లు కూడా పెరుగుతాయి.
కర్ణాటక ప్రభుత్వం జూన్ 1 నుంచి కొన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలను తెరవడానికి అనుమతి ఇచ్చింది. ఒక్క కర్ణాటకలోనే దేవాలయాలలో పూజలు నిలిపివేయడం వల్ల సుమారు 133.56 కోట్ల నష్టం జరిగిందని అంచనా.
పూజారులకు ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కేరళలోని దేవాలయాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. "మేము మా ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేము. ఈ నెలలో సుమారు 25% జీతాన్ని తగ్గించి ఇచ్చాం" అని ట్రావెన్కూర్ దేవాస్వమ్ బోర్డ్ (టీడీబీ) చైర్మన్ ఎన్.వాసు బీబీసీతో అన్నారు.
కేరళలోని 125 దేవాలయాలను ట్రావెన్కోర్ దేవాస్వం బోర్డ్ నిర్వహిస్తుంది. వీటిలో శబరిమల కూడా ఉంది. లాక్‌డౌన్ రావడంతో వీటికి ఆదాయం పూర్తిగా పడిపోయింది.
మరి మద్యం దుకాణాలు తెరుస్తారు గానీ గురుద్వారాలను తెరవరా అంటూ పంజాబ్‌లో అకాల్ తఖ్త్ ప్రశ్నించింది.
ఉత్తరప్రదేశ్‌లో కాదంబరి మఠానికి చెందిన మహంత్ నరేంద్ర గిరి కూడా ఇలాంటి ప్రశ్నే లేవనెత్తారు. కానీ దేవాలయాలను తెరిస్తే, నైవేద్యాల పంపిణీ అతి పెద్ద సమస్యగా మారుంది. కరోనావ్యాప్తి భయంతో దేన్ని తాకినా చేతులు కడుక్కోవాలి. అంటే దేవాలయాలలో ఈ తరహా ఏర్పాట్లు ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
ప్రార్థనా స్థలాలను తెరవడానికి ముందు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
సినిమాలు, సీరియళ్ల షూటింగ్‌లు
గత రెండు నెలలుగా సీరియళ్లలో కొత్త ఎపిసోడ్లు లేవు. సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి.
ఇటీవల అక్షయ్ కుమార్ ఓ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం కోసం తీస్తున్న వీడియో కోసం ఆయన ఈ షూటింగ్‌లో పాల్గొన్నట్లు చెప్తున్నారు.
చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి వేలమంది జీవిస్తున్నారు.
మహారాష్ట్రలో మే 28న చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొన్ని నిబంధనలను పాటిస్తూ సినిమా షూటింగ్‌లు ఎలా కొనసాగించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే వినోద పరిశ్రమకు సబ్సీడీలు పెంచాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అక్కడక్కడా ప్రారంభమవుతున్నాయి. అయితే అవి కేవలం గ్రీన్ జోన్‌లలోనే జరుగుతున్నాయి.
కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా చికిత్సలలో వారికి కొన్ని రాయితీలు కూడా లభిస్తున్నాయి.
ఇక మాల్స్, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లలో కూర్చుని భోజనాలకు మాత్రం ఇప్పట్లో అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. వీటి కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.
ఎక్కడైనా కాస్త సడలింపు ఉందంటే అక్కడ సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం లాంటి నియమాలు కూడా కఠినంగా అమలులో ఉంటాయి.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. హైకోర్టు తీర్పుతో బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ
- మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ: ఆర్థిక జాతీయవాదం ఆచరణ సాధ్యమా? స్వావలంబన ఇంకెంత దూరం?
- ఇండియా లాక్‌డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: ‘లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)