You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎల్జీ పాలిమర్స్: విమానాశ్రయంలోకి ముగ్గురు దక్షిణ కొరియా నిపుణులు.. దేశం దాటడానికి ఎవరైనా సహకరిస్తున్నారా? - ప్రెస్ రివ్యూ
ఎల్జీ పాలీమర్స్ ఘటనపై విచారణకు దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఆ సంస్థ నిపుణుల బృందంలో కొందరు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నట్లు 'ఈనాడు' దినపత్రిక వెల్లడించింది.
ఈ కథనం ప్రకారం.. వీరంతా కేంద్ర ప్రభుత్వ అనుమతితో దక్షిణ కొరియా నుంచి భారత్‌కు వచ్చారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసి వీరు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే వీరిలో ఒకరు అత్యవసరంగా విశాఖ నుంచి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది, అయితే ఆ ఒక వ్యక్తితోపాటు మరో ఏడుగురు వ్యక్తులు కూడా విమానాశ్రయానికి వచ్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు.
మొదట ముగ్గురు వ్యక్తులు విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. మిగిలినవారు బయట కారులో కూర్చుని వేచి చూశారు. పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది అడ్డుకోవడంతో ఆ ఏడుగురు తాము ఉంటున్న హోటల్‌కు తిరిగి వచ్చారు.
అయితే స్వదేశం వెళ్లడానికి ఒక వ్యక్తి పేరుతో అనుమతి తీసుకుని ఏడుగురు ఎలా విమానాశ్రయానికి వచ్చారన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరికి ఎవరైనా సహకరిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు 'ఈనాడు' దినపత్రిక వార్త రాసింది. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై స్పందించేందుకు ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు నిరాకరించారు.
కరోనా మహమ్మారి: మృతులకూ టెస్టులు జరపాల్సిందేనన్న హైకోర్టు
ఆసుపత్రుల్లో చనిపోయిన రోగుల మృతదేహాలకు కరోనా వైరస్ టెస్టులు జరపాల్సిందేనని తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు 'ఆంధ్రజ్యోతి' పత్రిక రాసింది.
ఆ కథనం ప్రకారం.. మృతులకు రోగ నిర్దారణ పరీక్ష అవసరంలేదంటూ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏప్రిల్ 20న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దీంతోపాటు ఈ నెల 25నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కరోనా పరీక్షలు చేశారో వెల్లడించాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
ఆర్ధిక ఇబ్బందులను చూపి టెస్టుల నుంచి తప్పించుకోవడం కుదరదని, ఆకుచాటున వాస్తవాలను దాచలేరని ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
టెస్టులు సరిగా నిర్వహించకుండా జోన్లను ఎలా గుర్తిస్తున్నారని, ఒక జోన్ నుంచి మరో జోన్‌గా ఎలా మారుస్తున్నారని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సమగ్ర వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ధర్మాసనం కోరింది.
సూర్యాపేట, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు కోరింది.
కృష్ణా జలాలను సంగమేశ్వరం లిఫ్ట్‌తో ఆంధ్రాకు తరలింపు
శ్రీశైలం నుంచి ఆంధ్రకు రోజూ 3 టీఎంసీల నీటిని తరలిస్తామని జగన్ చేసిన ప్రకటనను 'వెలుగు' పత్రిక ప్రముఖంగా రాసింది.
ఆ కథనం ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం లిఫ్ట్‌ను నిర్మించి దాని ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలిస్తామని జగన్ ప్రకటించారు.
శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని రోజుకు మూడు టీఎంసీల చొప్పున తీసుకుంటామని ''మన పాలన మీ సూచన'' కార్యక్రమంలో జగన్ వెల్లడించారు.
మరోవైపు రూ.27వేల కోట్లతో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కింద గోదావరి నుంచి కూడా రాయలసీమకు నీటిని తరలిస్తామని జగన్ వెల్లడించారు.
అయితే ఒకప్పుడు పోతిరెడ్డిపాడు విషయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిని తీవ్రంగా విమర్శించిన ప్రస్తుత మంత్రి కేటీఆర్, ఇప్పుడు జగన్ ప్రకటనలపై మౌనంగా ఉన్నారని కూడా 'వెలుగు' పత్రిక ఓ కథనం రాసింది.
విమాన ప్రయాణికులకు కొనసాగుతున్న కష్టాలు
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండో రోజున ఆంధ్రప్రదేశ్‌లో కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయ. అయితే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు రద్దు కష్టాలు మాత్రం ఆగలేదని 'నమస్తే తెలంగాణ' పత్రిక వెల్లడించింది.
ఆ కథనం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
మొదటి రోజు దేశం మొత్తం మీద 608 సర్వీసులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు.
గురువారం నుంచి కోల్‌కతాతోపాటు మరికొన్ని విమానాశ్రయాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
కొందరు ప్రయాణికులు తమకు జ్వరం ఉన్న విషయం బైటపడకుండా ఉండేందుకు పారాసెటమాల్ మాత్రలు వేసుకుని వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఎత్తుగడ పని చేయదు. విమాన ప్రయాణికులంతా 14రోజుల హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ వార్డుల్లో ఉండక తప్పని పరిస్థితి. దీంతో పారాసెటమాల్ వేసుకున్నా ఉపయోగంలేదు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు
- ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్‌తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారు
- వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)