శానిటైజర్‌తో సారా తయారీ... నలుగురు అరెస్ట్ - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

శానిటైజర్‌తో సారా తయారీ... నలుగురు అరెస్ట్

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం డిమాండ్‌ను పసిగట్టిన ఓ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ మరో ముగ్గురితో కలసి శానిటైజర్‌తో సారా తయారీ చేసి విక్రయిస్తూ మంగళవారం ఆబ్కారీశాఖ అధికారులకు చిక్కారని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం, అనంతపురంలోని కమలానగర్‌ రఘువీరా కాంప్లెక్స్‌ ప్రాంతంలో నలుగురు కల్తీ సారా విక్రయిస్తున్నారని తెలుసుకుని అధికారుల ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. ఓ వ్యక్తిని సారా కొనేందుకు పంపారు. సదరు వ్యక్తి కొనుగోలు చేస్తుండగా అధికారుల బృందం నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి.. 18 శానిటైజర్ల సీసాలు, సారా స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం ఆబ్కారీశాఖ కార్యాలయంలో ఉప కమిషనర్‌ విజయశేఖర్‌ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

'తెలంగాణలో స్కూళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయండి'

నూతన విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచొద్దని, పాత ట్యూషన్‌ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. పాత ఫీజును కూడా నెలవారీగా మాత్రమే వసూలు చేయాలని, ఈ నిబంధనలు రాష్ట్రంలోని ప్రైవేటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇంటర్నేషనల్‌ స్కూళ్లన్నింటికీ వర్తిస్తాయని స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆదేశాలను అమలు చేయని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎక్కువ ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై 18004257462 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

మరోవైపు.. ఈ నెలలో కూడా వైద్య ఆరోగ్యం, మునిసిపల్‌, పోలీసు శాఖల సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రొత్సాహకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు గ్రాస్‌ శాలరీపై 10%.. జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌ సిబ్బందికి రూ. 7,500, పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో పనిచేస్తున్న వారికి రూ. 5000 చొప్పున చెల్లించనున్నారు.

తెలుగు, ఇంగ్లిష్... ఏ మీడియం కావాలి?' - అభిప్రాయ సేకరణకు ఏపీ సర్కారు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020-21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్‌ మీడియంలో రాసేలా చేయాలని భావించింది.

ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. అలాగే ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించాలని నిర్ణయించింది.

అయితే.. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.

100 కోట్లు దాటిన కరోనావైరస్ పరీక్షల వ్యయం

దేశంలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల కోసం చేసిన వ్యయం రూ. 100 కోట్లు దాటిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం, కోవిడ్-19 అనుమానితులకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబుల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఒక్కో రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్షకు రూ. 2,500 వ్యయం అవుతున్నట్టు అంచనా. ఇందులో రసాయనాలకు రూ. 800-1,500 వరకు ఖర్చవుతున్నది. రవాణా, మానవ వనరుల వ్యయం కలిపితే రూ. 2,500 అవుతున్నది.

ఏప్రిల్ 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 4,01,586 పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఈ లెక్కన ఇప్పటివరకు రూ. 102.65 కోట్లు వ్యయం చేసినట్టు లెక్క.

మహారాష్ట్రలో 72 వేల మందికి (రూ. 18 కోట్లు), రాజస్థాన్‌లో 57 వేల మందికి (రూ.14.3 కోట్లు) పరీక్షలు నిర్వహించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)