కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి' - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇవాళ (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో 9 నిమిషాలు పాటు కేవలం విద్యుత్ దీపాలు మాత్రమే ఆపాలంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్, కూలర్లు వంటి వాటిని ఆపకూడదు. అలాగే అపార్టుమెంట్లు, కాలనీలకు కరెంట్ సరఫరా అయ్యే ప్రధాన వ్యవస్థలైన ట్రాన్స్ ఫార్మర్లు, మెయిన్ వద్ద సరఫరా కొనసాగించాలి.

వీధి దీపాలను కూడా వెలగనివ్వాలి. దేశంలో అన్ని ఇళ్లల్లో ఒకేసారి దీపాలు ఆపేస్తే విద్యుత్ గ్రిడ్‌పై పడే ప్రభావం, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారి చేసింది.

దేశం మొత్తం మీద సుమారు 12,897 మెగావాట్ల లోడు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో రాత్రి 9 గంటలకు ఉత్పత్తిని తగ్గించి మళ్లీ 9.09 గంటలకు ప్రారంభించాలని కేంద్రం సూచించినట్టు ఈనాడు తన వార్తా కథనంలో తెలిపింది.

పది రోజుల్లో అదుపులోకి వస్తుంది

దేశంలో కరోనావైరస్ అదుపులోని ఉన్నట్లు ప్రధానికి సాధికార బృందాలు నివేదించినట్టు ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

దేశ వ్యాప్తంగా పరిస్థితి అదుపులోకి వస్తోందని ఎక్కడ వైరస్ జాడలు బయటపడ్డా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధానికి కేంద్ర సాధికార బృందాలు తెలిపాయి.

తబ్లిగీ జమాత్ సమావేశాలు వంటి ఒకట్రెండు అనుకోని పరిణామాలు జరిగినా పరిస్థితి చేయి దాటి పోలేదని ప్రధానికి నివేదించాయి.

శనివారం మోదీ ఈ బృందాల సంయుక్త సమావేశం నిర్వహించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. వచ్చే పది రోజుల్లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

మాస్కులు,గ్లోవ్స్, వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు, వెంటిలేటర్లు, అత్యవసర మందులు.. మొదలైనవన్నీ దేశ వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల్లో కొరత లేకుండా ఉండేట్లు చూడాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఈ నెల 8 ప్రధాని అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అన్ని పార్లమెంటరీ పార్టీ విభాగాలతో సమావేశమై కరోనావైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారని ఆంధ్రజ్యోతి ఈ వార్తలో వివరించింది.

యువతకు కరోనా ముప్పు-కేంద్రం ఆరోగ్యశాఖ నివేదిక

దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసుల్లో 42శాతం కేసులు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలవారివేనని కేంద్రం తెలిపినట్టు నవ తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.

అలాగే 9 శాతం కేసులు 20 ఏళ్లలోపు ఉన్న వారివేనని కూడా వివరించింది.17 శాతం కేసులు 60 ఏళ్ల పైబడి ఉన్నవారివి ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించినట్టు తెలిపింది.

ఇప్పటి వరకు వృద్ధులకు మాత్రమే త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుందన్న వార్తలు వినబడిన నేపధ్యంలో కేంద్రం అందించిన తాజా సమాచారం ఆందోళనకు గురి చేస్తోందని ఈ వార్తలో చెప్పుకొచ్చింది.

దీంతో వయోభేదం లేకుండా అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నట్టు నవ తెలంగాణ ఈ వార్తలో స్పష్టం చేసింది.

2.5 కోట్ల ఉద్యోగాల కోత

కరోనావైరస్‌ను తక్షణం నియంత్రించలేకపోతే ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర కోట్ల ఉద్యోగాలు పోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఒ) హెచ్చిరింనట్టు సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

ప్రపంచ వ్యాప్తంగా 1980 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయని ఐఎల్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

కోవిడ్-19 ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలను చేపట్టేందుకు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా అమెరికా, యూరోప్ దేశాలలో నిరుద్యోగం రేటు రెండంకెలు దాటేసిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనావైరస్ దెబ్బకు అమెరికాలో 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. యూరోప్‌లో గడిచిన రెండు వారాల్లోనే 10లక్షల మంది తమకు బతుకు గడవటమే కష్టంగా ఉందని, తమ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలంటూ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశారు.

అటు జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్ ఇలా అన్ని చోట్ల పరిస్థితి అలాగే ఉందని ఐఎల్ఓ తన నివేదికలో పేర్కొన్నట్టు సాక్షి ఈ వార్తలో వివరించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)