కరోనావైరస్: లాక్‌‌డౌన్ అంటే ఏంటి? - ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వినబడుతున్న మాట లాక్‌డౌన్. చైనాలోని వుహాన్ పట్టణంలో మొదలైన లాక్‌డౌన్‌ ప్రపంచ దేశాల మీదుగా ఇప్పుడు ఇండియానూ తాకింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వినబడుతోందని సాక్షి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఇంతకూ లాక్‌డౌన్ అంటే ఏంటి?

లాక్‌డౌన్‌ అనేది ఓ అత్యవసర నిర్వహణ నియమం (ప్రొటోకాల్)

సాధారణ పరిభాషలో దీని అర్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం.

అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రొటోకాల్‌ను ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది.

తమ పరిధిలోని ప్రజలను రక్షించడానికి పాలకులు ఈ ప్రొటోకాల్‌ను సాధారణంగా ఉపయోగిస్తుంటారు.

బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకువస్తున్నప్పుడు లేదా ఇతర బాహ్య సంఘటన నుంచి రక్షించడానికి లాక్‌డౌన్‌ ప్రయోగిస్తారు.

భవనాలలో లాక్‌డౌన్‌ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటకు పోరు.

అలాగే, పూర్తిస్థాయి లాక్‌డౌన్ అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి.

చెప్పిన చోటు నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదు, బయటకు రాకూడదు.

లాక్‌డౌన్ రెండు రకాలు. 1) నివారణ లాక్‌డౌన్‌ (ప్రివెంటివ్ లాక్‌డౌన్‌). 2) ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌.

ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది ప్రివెంటివ్ లాక్‌డౌన్‌.

అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యల్లో భాగం.

ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం.

ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌ విధిస్తారు.

వాహనాల తయారీ బంద్

కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకూ పెరగడంతో భారత్‌లోని పలు ఆటో రంగ సంస్థలు ఆదివారం నుంచి తమ ఉత్పత్తికి విరామం ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

పలు ఆటో రంగ సంస్థలు ఆదివారం నుంచి తమ ఉత్పత్తికి విరామం ప్రకటించాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజాలు మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్‌లతోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫియట్‌ సంస్థలు లాక్‌డౌన్‌ దిశగా నిర్ణయాలు తీసుకున్నాయని ఇందులో చెప్పారు.

హర్యానాలోని మనేసర్‌, గురుగ్రామ్‌లలోని ప్లాంట్లను తక్షణమే మూసివేస్తున్నట్లు మారుతి స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఇతరత్రా ఆఫీసు కార్యకలాపాలను ఆపేస్తున్నామని తెలిపింది. వీటిని తిరిగి ఎప్పుడు తెరుస్తామన్నది ప్రభుత్వ విధానాలపైనే ఆధారపడి ఉందని తెలియజేసింది.

ఈ నెలాఖరుదాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అన్ని ఉత్పాదక కేంద్రాల్లో వాహన తయారీని ఆపేస్తున్నట్లు దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది.

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో నాగ్‌పూర్‌ ప్లాంట్‌ను తక్షణమే మూసేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. పుణె, ముంబై ప్లాంట్లను సోమవారం రాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

మహీంద్రా హాలిడేస్‌ రిసార్టులను రోగులకు సేవా కేంద్రాలుగా వినియోగించండి. అలాగే చిరు వ్యాపారులు, స్వయం ఉపాధితో బ్రతుకుతున్న పేదల కోసం మహీంద్రా ఫౌండేషన్‌ ఓ నిధిని ఏర్పాటు చేయనుంది. దీనికి నా జీతాన్ని పూర్తిగా విరాళంగా ఇస్తున్నాను అని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ కూడా చేసినట్లు కథనంలో వివరించారు.

హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ సైతం దేశంలోని తమ రెండు తయారీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. తిరిగి ఉత్పత్తి ఏప్రిల్‌ 1 నుంచి మొదలు కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హోండా.. ప్రభుత్వ నిర్ణయాలపైనే ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

విద్యాసంస్థల ఆన్‌లైన్ బోధన

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా సెలవులు ప్రకటించిన విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ బోధన చేస్తున్నాయని ఈనాడు కథనం ప్రచురించింది.

ఈ సంస్థలు విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందించడం, వారికి వచ్చే సందేహాలకు నివృత్తి చేయడం, అధ్యాపకుల పాఠాలను రికార్డు చేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం లాంటి చర్యలు చేపట్టాయి.

విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూసేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నాయి.

కేంద్రీయ విద్యా సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కళాశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తుండగా.. కరోనా తీవ్రత దృష్ట్యా మరిన్ని కళాశాలలు ఈ నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నాయని ఈనాడు రాసింది.

కొన్ని కోచింగ్‌ కేంద్రాలు విద్యార్థులకు వాట్సప్‌ల్లో అసైన్‌మెంట్లు ఇస్తున్నాయి. కొన్ని సీబీఎస్ఈ పాఠశాలలు యాప్‌ల సాయంతో పాఠాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో స్వయం ప్రతిపత్తి కలిగిన ఇంజినీరింగ్‌ కళాశాలలు 'కోర్సు ఎరా'లో విద్యార్థులను రిజిస్టర్‌ చేయించి, ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయని ఈనాడు వివరించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)