కాలు విరిగిందని జీహెచ్‌ఎంసీపై కేసు వేసిన హైదరాబాదీ- ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

తన కాలికి గాయం కావడానికి రోడ్డుపై ఉన్న గుంతలే కారణమని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారని, గాయానికి జీహెచ్‌ఎంసీ అధికారులే బాధ్యత వహించాలని డబీర్‌పురా ఠాణాలో ఫిర్యాదు చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

పంజాటన్‌ కాలనీకి చెందిన సయీద్‌ అజ్మత్‌ హుస్సేన్‌ జాఫ్రి అక్టోబర్‌ 6న రాత్రి 7.30 గంటలకు తన బైక్‌పై నూర్‌ఖాన్‌ బజార్‌ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో బైక్‌ దిగబడింది. సయీద్‌ వాహనంపై నుంచి కిందపడ్డారు.

ఆయన కుడి కాలు చీలమండలంలోని ఎముక ఫ్రాక్చర్‌ అయింది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ప్రమాదం జరిగిందని సయీద్‌ ఆరోపించారు. రోడ్డుపై గుంతలను పూడ్చకుండా జీహెచ్‌ఎంసీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు.

కేసు నమోదు చేసుకున్న డబీర్‌పురా పోలీసులు విచారణ ప్రారంభించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

అన్ని నదులనూ కాపాడుకోవాలి: పవన్ కల్యాణ్

కాలుష్యం నుంచి ఒక్క గంగా నదినే కాకుండా దేశంలోని అన్ని నదులనూ కాపాడుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారని ఈనాడు తెలిపింది.

విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ తొలి వర్థంతి కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ గురువారం హరిద్వార్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పవిత్ర గంగా నదిని కాలుష్యానికి గురిచేయడమంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. గంగా ప్రక్షాళన పోరాటానికి ఇది నాంది కావాలని పిలుపునిచ్చారు.

తాను పోరాటయాత్రలో ఉండగా జీడీ అగర్వాల్ మరణవార్త తెలిసిందని, ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలిచి వేసిందని ఈ సందర్భంగా వపన్ కల్యాణ్ చెప్పారు.

ఆరోజే తాను హరిద్వార్ వచ్చి అగర్వాల్ పార్ధివ దేహానికి నివాళులు అర్పిద్దామనుకున్నామని, అయితే పోరాట యాత్ర వల్ల రాలేకపోయానని తెలిపారని ఈనాడు వెల్లడించింది.

తెలంగాణలో ఇకపై ప్లాస్టిక్ నిషేధం

పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను తెలంగాణలో నిషేధించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకొన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

పల్లె ప్రగతి ప్రణాళిక అమలు తీరుతెన్నులపై గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న మంత్రిమండలి సమావేశంలో ప్లాస్టిక్ నిషేధంపై వివరంగా చర్చించి ఆమోదిస్తామని.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని దేశవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో సీఎం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

రీసైక్లింగ్ చేయడం వల్ల వచ్చే విషవాయువులు పర్యావరణంతోపాటు ప్రజలకు హానికారకంగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు, నదులు, సముద్ర తీరప్రాంతాలన్నీ కూడా ప్లాస్టిక్‌తో విపరీతంగా నిండిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ముగ్గురు ఆర్టీసీ కార్మికులను బలిగొన్న సమ్మె ఆందోళన

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా నెలకొన్న ఆందోళన ముగ్గురిని బలిగింది. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారని ఈనాడు వెల్లడించింది.

ఉప్పల్ డిపో వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పాల్గొన్న చెంగిచర్ల డిపో డ్రైవర్ డి.కొమురయ్య మరణించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో హెచ్‌సీయూ డిపో డ్రైవర్ చనిపోయారని బాధిత కుటుంబీకులు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం రామారానికి చందిన కొమురయ్య చెంగిచర్ల డిపోలో పనిచేస్తున్నారు. గురువారం ఆందోళనలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనలతో కలత చెంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లు కుటుంబీకులు ఆరోపించారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణ పరిధిలోని బాంబే కాలనీలో నివసిస్తున్న షేక్ ఖలీల్ మియా హెచ్‌సీయూ డిపో డ్రైవర్. వారం రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మెలో జేఏసీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారు.

సమ్మెలో పాల్గొన్న వారందరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఖలీల్ మియా మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మృతి చెందారని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)