You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కూతురిని కొట్టిన తల్లి.. ఏడాది జైలు శిక్ష విధించిన హైదరాబాద్ కోర్టు - ప్రెస్ రివ్యూ
ఏడాదిన్నర వయసున్న కూతురిపై చెయ్యి చేసుకున్న ఓ తల్లికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని మల్కాజిగిరి కోర్టు తీర్పు ఇచ్చినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధి లో 2016లో నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం తన తీర్పును వెలువరించింది.
2016 డిసెంబర్ 1న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాధికా చౌరస్తాలో జయ, కె.అజయ్, కె.లక్ష్మి అనే ముగ్గురు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న జయ తన ఏడాదిన్నర కూతుర్ని విచక్షణారహితంగా కొట్టడంతో చిన్నారి తలకు గాయమై రక్తస్రావమైంది. ఆమె గతంలో కూడా తన చిన్నారి కూతురి మీద పలుమార్లు ఇదే విధంగా దాడికి పాల్పడింది.
ఈ ఘటనపై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పానుగంటి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి జయ, అజయ్, లక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. తల్లి జయకు ఏడాది జైలుశిక్ష, రూ. 1,050 జరిమానా విధించింది. మిగతా ఇద్దరు నిందితులు ఏ2, ఏ3లకు 3 నెలల జైలుశిక్ష, రూ. 250 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు నిందితులను జైలుకు తరలించారు.
దేశ సరిహద్దులోని సియాచిన్, కార్గిల్ వంటి ప్రాంతాలను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని సైన్యం యోచిస్తోందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన ఓ సెమినార్‌లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ ప్రతిపాదన చేశారని సైనిక వర్గాలు చెప్పాయి. లఢఖ్‌తో పాటు సమీప ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు.. పాకిస్థాన్ ఆర్మీతో భారత సైన్యం తలపడిన కార్గిల్ హిల్స్, టైగర్ హిల్స్ సందర్శన కోసం ఆర్మీ అనుమతి కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో సియాచిన్, కార్గిల్‌లోని భారత సైనిక శిబిరాలను సందర్శించాలన్న దేశ ప్రజల ఆసక్తి గురించి పలువురు సైనిక ఉన్నతాధికారులతో ఆర్మీ చీఫ్ చర్చించినట్లు తెలిసింది.
ఇప్పటికే దేశంలోని పలు సైనిక శిక్షణ కేంద్రాలు, సంస్థల సందర్శనకు ప్రజలను ఆర్మీ అనుమతిస్తున్నది. సరిహద్దులోని కీలక సైనిక శిబిరాల సందర్శనకూ పౌరులను అనుమతిస్తే వారిలో జాతీయ సమగ్రత భావన పెంపొందుతుందని రావత్ అభిప్రాయపడినట్లు సమాచారం.
అయితే పర్యాటకులను ఏయే ప్రాంతాల సందర్శనకు అనుమతించాలన్న దానిపై సైన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తు న్నది. ప్రపంచంలోనే ఎత్తైన సియాచిన్ యుద్ధక్షేత్రంలోని అత్యంత చల్లని వాతావరణ పరిస్థితుల్లో సైనికులు గస్తీ నిర్వహిస్తుంటారు.
సీబీఐని రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే భావన బలంగా ఉంది: జస్టిస్ చలమేశ్వర్
కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) స్వతంత్రతపై అనేక అనుమానాలు ఉన్నాయని ఈ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకు పోయిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ అంశం మీద ప్రశ్నించాల్సింది మాత్రం పౌరసమాజమేనని ఆయన అన్నారు.
సీబీఐ మాజీ అధికారి వేణుగోపాల్ రావు జ్ఞాపకార్థం మంగళవారం ఆస్కిలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 'నేరాల దర్యాప్తులో న్యాయవ్యవస్థ ప్రస్తుత తీరు' అనే అంశంపై మాట్లాడారు.
సీబీఐ ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ అని, ఎలాంటి కేసునైనా పరిష్కరిస్తుంది అన్న భ్రమ ప్రజల్లో ఉందన్నారు. వాస్తవం మాత్రం పూర్తి విరుద్థమని పలు కేసులు ఉదాహరించారు. సీబీఐకి ప్రత్యేక కేడర్ లేదని, రాష్ట్ర స్థాయి అధికారులే అందులోకి వెళ్తున్నారన్నారు.
ఈ సమావేశంలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య, వేణుగోపాల్‌రావు కుమారుడు డాక్టర్ మోహన్‌దాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- ‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
- పోలవరం రివర్స్ టెండరింగ్: ప్రభుత్వం ఏం సాధించింది? ప్రతిపక్షం ఏమంటోంది?
- సినిమాల ప్రభావంతో ఆదరణ తగ్గిపోయిన తెలంగాణ కళ.. నకాషీ
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- సౌర విద్యుత్ చరిత్ర: 3000 ఏళ్ల క్రితమే చైనాలో సౌరశక్తి వినియోగం
- ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)