You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోదీ, అమిత్ షాల ఆశీస్సులతోనే జగన్ ముందుకు వెళ్తున్నారు: విజయసాయిరెడ్డి - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర సీఎం జగన్ ఏ నిర్ణయమైనా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను సంప్రదించే తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించిటనట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం రాసింది.
దిల్లీలో బుధవారం వైస్సార్సీపీ ప్రతినిధులతో కలిసి రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను విజయసాయి రెడ్డి కలిశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు.
మోదీ, షా ఆశీస్సులతోనే తమ పార్టీ ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు.
పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష సహా అన్ని విషయాలపై ప్రధానితో కూలంకషంగా చర్చించే నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు.
'ఖజానాను దోచుకుని, కూడబెట్టుకున్న ఆస్తులను బయటపెట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిశ్చయాన్ని ప్రధాని, కేంద్ర హోం మంత్రి సమర్థించారు. వారి ఆశీస్సులతోనే మేం నిర్ణయాలు తీసుకుంటున్నాం' అని స్పష్టం చేశారు.
వైస్సార్సీపీ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని గోయల్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో భారీ అమెజాన్ క్యాంపస్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ క్యాంపస్ బుధవారం ప్రారంభమైనట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనం రాసింది.
గచ్చిబౌలి సమీపంలోని నానక్‌రాంగుడాలో 9.5 ఎకరాల స్థలంలో 3 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణ స్థలంతో దీన్ని నిర్మించారు. ఏకకాలంలో 15వేల మంది ఉద్యోగులు ఇందులో పనిచేయొచ్చు.
జాన్ స్కాట్లర్ మాట్లాడుతూ.. నిర్మాణమైన ఈ భవనంలో భాగస్వామ్యం పంచుకోవడం అదృష్టమన్నారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అందించిన సహకారంతోనే స్వల్పవ్యవధిలోనే అత్యున్నత ప్రమాణాలతో ఈ క్యాంపస్ నిర్మించుకోగలిగామని అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వైస్‌ప్రెసిడెంట్ జాన్‌స్కాట్లర్ చెప్పారు.
‘కృత్రిమ వరదలు సాధ్యమేనా చంద్రబాబు’
కృష్ణా వరదలను ఏపీ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, అసలు అది సాధ్యమయ్యే పనేనా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించినట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన చంద్రబాబు వరదలతో సానుభూతి పొందేందుకు దిగజారి విమర్శలు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు.
''తన ఇంటిని ముంచేందుకే ప్రభుత్వం వరదలు సృష్టించిందని చంద్రబాబు అంటున్నారు. వరదలు ఎవరైనా సృష్టించగలరా? నదీ గర్భంలో కట్టిన ఇంట్లో నివసించడమే తప్పు. ముంచేస్తున్నారని ఆరోపించడం ఏమిటి?'' అని అంబటి ప్రశ్నించారు.
''గుండె నొప్పో, మరొకటో వస్తే హైదరాబాద్ లేదా ముంబై వెళ్లొచ్చు. చంద్రబాబు చేతి నొప్పికి హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందా?'' అని విమర్శించారు. వరదలపై రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు.
''అమెరికాలో అగ్గిపెట్టెలు, ఒత్తులతో జ్యోతులను అంటించడం నేరంగా పరిగణిస్తారు. అందుకే జగన్ ఎల్రక్టానిక్ జ్యోతిని వెలిగించారు. దీనిపైనా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది'' అని అంబటి మండిపడ్డారు.
రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ‘భూమాత’గా పేరు మారే అవకాశం
తెలంగాణలో రెవెన్యూశాఖకు ‘భూమాత’గా పేరు మారే అవకాశాలున్నట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది.
రాష్ట్రంలో చేపట్టిన పాలన సంస్కరణల్లో భాగంగా రెవెన్యూశాఖకు కొత్త పేరు పెట్టే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఆంగ్లేయుల పాలనలో భూమి శిస్తు, పన్ను వసూళ్లకు సంబంధించిన శాఖ కావడంతో రెవెన్యూ అని పేరు ఉండేదని, ఇప్పుడు అలాంటి పన్నులేవీ లేనందున పేరు మారాలని కేసీఆర్ ఇదివరకు కూడా చాలా సార్లు వ్యాఖ్యానించారు.
రెవెన్యూలో అధిక శాతం భూములకు సంబంధించిన అంశాల కావడంతో భూమాత అనే పేరు పరిశీలనలో ఉంది.
పేరు మార్పిడితోపాటు పాలనకు సంబంధించిన పలు అంశాలతో కూడిన కొత్త బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కసరత్తు నడుస్తోంది.
రెవెన్యూ పరిధిలో భూములకు సంబంధించి ఓ శాఖ, మిగతా విభాగాలతో మరో శాఖ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చిదంబరం అరెస్ట్: విచారణ కోసం సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలింపు
- శాండ్విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు
- చిదంబరంపై వచ్చిన ఆరోపణలేంటి.. ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్తి కథేమిటి
- ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- అమెరికా ఇతర దేశాల నుంచి ఎన్ని భూభాగాలను ఎంత ధరకు కొన్నదో తెలుసా...
- డీప్ ఫేక్: నకిలీ వీడియోలను ఎలుకలు గుర్తిస్తాయా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)