తెలంగాణ సీఎం కేసీఆర్: 'యాదాద్రి పనులు పూర్తి చేయడానికి ఇంకా అయిదేళ్ళా?' :ప్రెస్‌ రివ్యూ

కేసీఆర్ ఆగ్రహం

ఫొటో సోర్స్, FACEBOOK/Telangana CMO

ప్రచురణ

యాదాద్రి ఆలయ పనుల ఆలస్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సాక్షి తొలి పేజీ కథనాన్ని ప్రచురించింది.

ఆలయ పనులపై అధికారులతో అయిదు గంటలపాటు సమీక్ష నిర్వహించిన కేసీఆర్, పనులు జాప్యం చేసిన ఆర్‌ అండ్ బీపై ఈఈపై వేటు వేసినట్లు ఇందులో చెప్పారు.

ప్రధాన ఆలయం పనుల్లో సింహభాగం పూర్తయింది. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలాయి. వాటి పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

''ఫిబ్రవరిలో యాగం చేద్దామనుకున్నా.. అందరినీ పిలిచి దేవుడికి దండం పెడదాం అనుకున్నా.. పనులు ఇలా జరిగితే ఎలా? ఇంకా అయిదేళ్లు పడతాయా ఈ పనులు జరగడానికి? మీకైనా ఉండాలి.. నాకైనా ఉండాలి.. ఇలా ఎన్నిసార్లు మాటలు చెబుతారు? గర్భాలయ పనులతో పాటు మిగతా పనులన్నీ సమాంతరంగా పూర్తి చేయాలని గత ఫిబ్రవరిలో వచ్చినప్పుడు చెప్పాను. కానీ, ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తే ఎక్కడివి అక్కడే ఉన్నాయి''అని కేసీఆర్‌ మండిపడ్డారని సాక్షి తెలిపింది.

పనుల్లో జాప్యం చేస్తూ కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్న ఆర్‌అండ్‌బీ ఈఈ వసంత నాయక్‌పై వేటు వేసి, ఆయన స్థానంలో సీఈ మోహన్‌నాయక్‌ను డిప్యుటేషన్‌లో వైటీడీఏ విధుల్లో చేరాలని సీఎం ఆదేశించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

ప్రధాన ఆలయంతోపాటు మిగతా పనులన్నీ డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను సూచించారు.

జగన్ అమెరికా పర్యటన

ఫొటో సోర్స్, FACEBOOK/Andhra Pradesh CM

ప్రవాసాంధ్రులకు సీఎం జగన్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

వైసీపీ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్న జగన్ అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే నా కల అన్నారు.

"పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదు. రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం" అని జగన్ అన్నారని కథనంలో చెప్పారు.

రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ఉన్నాయి. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టామని జగన్ చెప్పారు.

కనీసం ఏడాదికి ఒకటి.. రెండు సార్లయినా ప్రవాసాంధ్రులను ఏపీకి రావాలని జగన్ ఆహ్వానించారు. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందాం అన్నారు.

ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌ తెరవబోతున్నామని ప్రవాసాంధ్రులకు చెప్పిన జగన్, అది నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానమై ఉంటుందని, పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆ పోర్టల్‌లో చెప్పొచ్చని తెలిపారు.

పోర్టల్‌ పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తామని అని జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చినట్లు ఈనాడు కథనం చెప్పింది.

పోలవరం

ఫొటో సోర్స్, polavaram.cgg.gov.in

ఫొటో క్యాప్షన్, పోలవరం ప్రాజెక్టు

పోలవరం రివర్స్ టెండర్లు ఖరారు

కీలకమైన దశలో పోలవరం కాంట్రాక్టులు రద్దు చేయద్దు అని పీపీఏ లేఖ రాసిన మరునాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ టెండర్లు ఖరారు చేసిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

''వినయపూర్వకమైన సలహా ఇస్తున్నాం! పోలవరం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లవద్దు. కీలకమైన దశలో కాంట్రాక్టును రద్దు చేయవద్దు''... అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖ రాసిన మరుసటి రోజే... రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్నది చేసేసింది! పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో మిగిలిన హెడ్‌వర్క్స్‌ పనులు, జల విద్యుత్కేంద్రం నిర్మాణ పనులకు తిరిగి టెండర్లు పిలిచారు అని కథనంలో చెప్పారు.

సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా దీవించాలని శనివారం పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నదికి చీఫ్‌ ఇంజనీరు సుధాకర బాబు పూజలు నిర్వహించారు.

అనంతరం.. హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు, పోలవరం సాగు నీటి పథకం హెడ్‌వర్క్స్‌ పనులు రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్‌ పిలిచారు. టెండర్‌ డాక్యుమెంట్‌లను ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఇవి ఈ నెల 22 నుంచి కాంట్రాక్టు సంస్థలకు అందుబాటులోకి వస్తాయి. గతంలో పోలవరం హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఏపీ జెన్కో టెండర్లను పిలిచింది. ఇప్పుడు జెన్కోను ఈ బాధ్యతల నుంచి తప్పించి.. జల వనరుల శాఖకే అప్పగించారు.

పోలవరం హెడ్‌వర్క్స్‌, పవర్‌ ప్లాంటుకు కలిపి మొత్తంగా రూ.4987.55 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు.

నాగార్జున సాగర్

ఫొటో సోర్స్, FACEBOOK/మన నాగార్జున సాగర్

వరదనీటి నిల్వల దిశగా అధికారులు

తెలంగాణలో ఎగువ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటిపారుదల అధికారులు ఇక జలాశయాలను నింపే పనిలో పడ్డారని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. భీమా నదికి కూడా వరదఉధృతి తగ్గుతున్నది. ఫలితంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు తగ్గుతున్నాయని ఇందులో తెలిపారు.

కృష్ణాబేసిన్‌లలోని నదులన్నింటిలో వర ద తగ్గుతున్నదని, ఆదివారానికి మరింత తగ్గే అవకాశం ఉన్నదని సీడబ్ల్యూసీ పేర్కొంటున్నదని పత్రిక చెప్పింది.

ఈ నేపథ్యంలో లోటు నిల్వను భర్తీచేసేందుకు ఆయా ప్రాజెక్టుల అధికారులు చర్యలు ప్రారంభించనున్నారు. ఆల్మట్టి, నారాయణపుర, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులను పూర్తిస్థాయి నీటిమట్టానికి తీసుకువచ్చేందుకు మరికొన్ని టీఎంసీలు నిల్వ చేయాల్సి ఉన్నదని చెప్పారు.

తుంగభద్ర డ్యామ్‌లో పూర్తిస్థాయిలో నీటినిల్వ, నీటిమట్టాలను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం వద్ద మాత్రం ఇన్‌ఫ్లో భారీగా కొనసాగుతోంది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు శనివారం కూడా సందర్శకులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. ఆదివారం ఈ సంఖ్యమరింత పెరుగొచ్చని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)