‘నాపై ఎన్నో ఒత్తిళ్లున్నా లొంగే ప్రసక్తే లేదు’ : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, jagan/fb
అవినీతిపై పోరాటం చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని సాక్షి తెలిపింది.
గత ఐదేళ్లలో టెండర్ల ప్రక్రియ మొదలు తీసుకువచ్చిన అప్పుల వరకు పై స్థాయిలో ఏది చూసినా వందలు.. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
ఇళ్ల నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి లేకుండా ఉండి ఉంటే అవే ఇళ్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేవి కావా అని ప్రశ్నించారు. బుధవారం అర్బన్ హౌసింగ్ (టిడ్కో)పై మంత్రివర్గ ఉప సంఘంతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయినా దేనికీ లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసిన వారిని వదిలేయాలా? అని ప్రశ్నించారు.
దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని కోరారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీని వల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.
పట్టణాల్లో అర్హులైన మిగిలిన 4 లక్షల మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు కట్టించడానికి భూమిని గుర్తించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు తక్కువ ధరలో దీర్ఘకాలం నిలిచే విధంగా ఫ్లాట్లు నిర్మించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మేరకు అధికారులు పనిచేయాలన్నారు.
ముఖ్యంగా ఏ పని చేపట్టినా అందులో స్కాం లేకుండా చూసుకోవాలన్నారు. మార్కెట్‌లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కల్యాణ లక్ష్మికి కాసుల కొరత
పేదింటి ఆడపిల్లల వివాహానికి సాయం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి కాసుల కటకట ఎదురవుతోందని ఈనాడు కథనం వెల్లడించింది.
‘‘ఆరు నెలలుగా లబ్ధిదారులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఓటాన్ అకౌంట్ కింద పేర్కొన్న నిధులు సరిపోక ఈ పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నాలుగు నెలలు సాధారణ, పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది.
ఇప్పుడు పరిష్కరిస్తున్నా అందుబాటులో బడ్జెట్ నిధులు సరిపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 2019-20 ఏడాదికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో మూడోవంతు పరిశీలన దశలో ఉన్నాయి. ఈ పథకాల కింద దాదాపు 90,000 లబ్ధిదారులకు సహాయం అందాల్సి ఉంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల కోడ్ మొదలైతే దరఖాస్తుల పరిశీలనకు మళ్లీ ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ప్రభుత్వం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిష్కారానికి రూ. 1,581 కోట్లు అవసరమని అంచనా.
దరఖాస్తును గరిష్ఠంగా 45 రోజుల్లో పరిష్కరించి, వివాహం సమయానికి సహాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు నెలలు గడుస్తున్నా సహాయం లభించడం లేదు. కల్యాణలక్ష్మి పథకం ప్రాచుర్యం పొందడంతో దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పథకానికి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ కింద రూ. 675 కోట్లు పేర్కొంది. కానీ డిమాండ్‌ను బట్టి అంతకు రెండింతలకు పైగా అవసరమని అధికారులు అంచనా వేశారు.
కేటాయింపుల్లోనూ రూ. 620 కోట్లే విడుదల అయ్యాయి. ఆ మేరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మిగతా నిధులు విడుదల చేయాలంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టినపుడే సాధ్యమని సంక్షేమవర్గాలు తెలిపాయి.
ఈ పథకానికి అందిన దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎమ్మార్వో కార్యాలయాల్లో దాదాపు రెండు నెలల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఎమ్మార్వో ఆమోదం తరువాత ఎమ్మెల్యేల వద్దకు పంపిస్తున్నారు.
ఇక్కడ ఆమోదం కోసం నెలరోజులకు పైగా సమయం పడుతోంది. ఆ తరువాత ఆర్డీవో ఆమోదం కోసం మరో 15 రోజులు అవుతోంది. చెక్కు సిద్ధం చేసి పంపిణీకి మరో 15 రోజులు పడుతోంది. ఈ లెక్కన ఒక్కో దరఖాస్తు పరిష్కారానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు వేచి చూడాల్సి వస్తోంద’’ని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘మత్స్యకారులకు వరం.. కాళేశ్వరం’
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు మత్స్యకారులపాలిట వరంగా మారనున్నదని నమస్తే తెలంగాణ తెలిపింది.
గోదావరి ప్రాజెక్టుపై కొత్తగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్, పార్వతి(సుందిళ్ల) బరాజ్, సరస్వతి (అన్నారం)బరాజ్‌లతో కొత్తగా 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నీటి వనరులు చేపల పెంపకానికి వినియోగంలోకి రానున్నాయి.
దీంతో చేపలు, రొయ్యల పెంపకంతో మత్స్యకార కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధి లభించనున్నది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి చేపట్టిన నాల్గో విడుత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ మూడు బరాజ్‌ల్లో 1.24 కోట్ల చేపపిల్లలు, 24 లక్షల రొయ్య పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 27 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు చేపల వేటకు అవకాశాలు మెరుగుకానున్నాయి.
ప్రస్తుతం ఈ మూడు జిల్లాల పరిధిలో 27 మత్స్య సొసైటీలకు చెందిన 693 మంది గుర్తింపు పొందిన మత్స్యకారులున్నారు. ప్రాజెక్టులో చేపల పెంపకానికి అవకాశాలు పెరుగడంతో ఈ వృత్తిపై ఆధారపడే వారిసంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
భూపాలపల్లి జిల్లాలోని 11 గ్రామాల్లో 92 మంది, మంచిర్యాలలోని ఆరు గ్రామాలకు చెందిన 418 మంది, పెద్దపల్లి జిల్లాలోని 10 గ్రామాలకు చెందిన 193 మంది మత్స్యకారులు చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు.
కొత్తగా ఈ మూడు బరాజ్‌ల పరిధిలో కొత్తగా చేపల సాగు చేపడుతున్నందున ఈ సంఖ్య 3 వేలకు చేరనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, Tdp/fb
బాబు నివాసం మునుగుతోందా!
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి వరద ముప్పు ఉందన్న వార్తలు బుధవారం కలకలం రేపాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.
రాష్ట్ర మంత్రులు కూడా ఆయన ఇల్లు మునగబోతోందని అనడం మరింత హడావుడిని పెంచింది. కానీ వరద ఆయన ఇంటిని పెద్దగా తాకలేదు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు తన నివాసంగా కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న ఒక ప్రైవేటు భవనాన్ని ఎంపిక చేసుకున్నారు.
గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలోకి ఇది వస్తుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు అతిక్రమించి కట్టారంటూ ఈ నివాసంతో పాటు కరకట్ట వెంబడి ఉన్న భవనాలకు నోటీసులు ఇచ్చారు.
తాజాగా కృష్ణానదికి పెరిగిన వరద చంద్రబాబు నివాస పరిస్థితిపై ఆసక్తి పెంచింది. ముందు జాగ్రత్తగా నివాసంలో కింద ఉన్న గదుల్లోని సామగ్రిని సిబ్బంది పై అంతస్తులోకి మార్చారు. చంద్రబాబు వాహన శ్రేణిని కూడా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు.
నివాస భవనం వద్ద కొన్ని ఇసుక బస్తాలు కూడా వేశారు. చెయ్యి నొప్పిగా ఉండడంతో విశ్రాంతి కోసం చంద్రబాబు ఒకరోజు ముందే హైదరాబాద్ వెళ్లారు. ఈ ఇల్లు మునిగిపోతోందంటూ మంత్రులు మొదలుకొని వైసీపీ నేతలు పలువురు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
పులిచింతల నుంచి బుధవారం ఉదయం సుమారు 5లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల కావడంతో కరకట్ట పక్కన ఉన్న భవనాలు మునిగిపోవడం తథ్యమని ప్రభుత్వ వర్గాలు కూడా భావించాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)























