చంద్రబాబునాయుడు: ‘ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదు’ - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

'పాలిచ్చే ఆవును వదిలిపెట్టి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లు.. వైసీపీని ప్రజలు గెలిపించారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

టీడీపీకి 23 సీట్లే ఇవ్వడానికి తానేం తప్పు చేశానో అర్థం కావడం లేదని.. అదే ప్రజలను అడుగుతున్నానని, చెబితే దిద్దుకుంటానని చెప్పారు. బుధవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు అవినీతిని వెతకండి అంటూ గత రెండు నెలలుగా అధికారులను ముఖ్యమంత్రి వేధిస్తున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. చివరకు ప్రధాని వద్దకు వెళ్లి రాష్ట్రానికి నిధులు అడగకుండా తనపై ఫిర్యాదులు చేస్తున్నారంటే ఏ స్థాయిలో కక్ష పెంచుకున్నారో అర్థమవుతోందన్నారు. కేవలం తనపై కక్ష పాధించడానికే 70% పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును ఆపేశారని చెప్పారు. తనపై కక్షతో అమరావతిని చంపేస్తారా.. ప్రపంచ బ్యాంకు రుణాలను ఆపేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను కట్టానని తప్ప ప్రజావేదిక ఏం పాపం చేసిందని కూల్చి వేశారని ప్రశ్నించారు.

'గతంలో నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు నా సెక్యూరిటీని ఎక్కడా తగ్గించలేదు. ఈ ముఖ్యమంత్రి మాత్రం నా భద్రతను తగ్గించారు. ఇలాంటి పులివెందుల రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేసుంటే మీరు ఎక్కడ ఉండేవారు' అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. జగన్‌, కేసీఆర్‌ కలిసుంటే తనకు ఎలాంటి బాధ లేదని.. కానీ ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే బాధగా ఉందని చెప్పారు.

కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అనగా.. నీకేంటి నాకే అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 'ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధికి కష్టపడితే కేవలం 23సీట్లు రావడం ఏమిటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడూ ఇంత బాధపడలేదు.

ఎన్నికల ఫలితాల తర్వాత కంటి నుంచి నీళ్లు కూడా వచ్చాయి. సమీక్షించుకోవడానికి ఎక్కడ లోపం జరిగిందో అంతుపట్టడం లేదు. ఇక కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయాలో తెలియడం లేదు. గోదావరి నీళ్లు తాగారు. ఓట్లేయడం మాత్రం మరచిపోయారు. పాలిచ్చే ఆవును వదిలిపెట్టేసుకుని.. తన్నే దున్నపోతును పట్టుకొచ్చుకున్నారని చంద్రబాబు పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

రాష్ట్రానికి అండగా నిలవండి

ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనందిస్తూ 'నవరత్నాలు' సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని సాక్షి తెలిపింది.

దిల్లీ పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి జగన్‌ రెండో రోజు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతో సమావేశమై రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు.

హామీలను నెరవేర్చాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని అమిత్‌షాను అభ్యర్థించారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించిన ముఖ్యమంత్రి ఆయా కార్యక్రమాలకు సాయం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.

రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని, అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని నితిన్‌ గడ్కరీని కోరారని సాక్షి వెల్లడించింది.

వాదనలకు.. వాస్తవాలకు పొంతనలేదు

వారసత్వ కట్టడాల పరిరక్షణ వ్యవహారంలో ప్రభుత్వ వాదనకు.. వాస్తవాలకు పొంతన ఉండటంలేదని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించిందని ఈనాడు తెలిపింది.

ప్రస్తుతం ఐదు మాస్టర్‌ ప్లాన్‌లు అమల్లో ఉన్నాయంటున్న ప్రభుత్వం మొదటి మాస్టర్‌ ప్లాన్‌లో గుర్తించిన వారసత్వ కట్టడాలకు రక్షణ ఉంటుండగా, రెండో ప్లాన్‌లో లేదని ఎలా చెబుతుందని ప్రశ్నించింది.

అసెంబ్లీ భవన నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ మొత్తం 5 మాస్టర్‌ ప్లాన్‌లు అమల్లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపల మాస్టర్‌ ప్లాన్‌ ఉండేదని, ప్రస్తుతం ఆవల కూడా ఉందన్నారు.

వాస్తవంగా జరిగిన మార్పులన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చలేదని, ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌ను కొత్తగా రూపొందిస్తున్నారని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మొదటి మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న అంశాలు చివరిదానిలోనూ కొనసాగుతాయా అని ప్రశ్నించగా అవునని న్యాయవాది సమాధానం చెప్పడంతో ఇది చాలని వ్యాఖ్యానించింది.

దీనిపై న్యాయవాది స్పందిస్తూ 2010 మాస్టర్‌ ప్లాన్‌కు, 2013లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు మధ్య ఉన్న తేడాను చెప్పడానికి శుక్రవారానికి వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. రాతపూర్వక వాదనలు సమర్పిస్తానన్న న్యాయవాది అభ్యర్థనకు అనుమతించి తీర్పును వాయిదా వేసింది. రాత పూర్వక వాదనలను శుక్రవారంలోగా అందజేయాలని ఇరుపక్షాలకూ సూచించిందని ఈనాడు వెల్లడించింది.

రైతుబీమాకు రూ.934 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నదని నమస్తే తెలంగాణ పేర్కొంది.

2019-20 ఏడాదికి రైతు బీమాకు 934.19 కోట్ల ప్రీమియాన్ని ఎల్‌ఐసీకి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పథకం 2020 ఆగస్టు 13 వరకు రైతులకు వర్తించనున్నది.

ఒక్కో రైతు కోసం రూ.3,555.94 చొప్పున మొత్తం రాష్ట్రంలోని 30,94,656 మంది రైతులకు భరోసా కల్పించేందుకు రూ.934.19 కోట్లను ఎల్‌ఐసీకి చెల్లించనుంది. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించి.. తన జీవితంలో చేస్తున్న అతిగొప్ప పని రైతుబీమా పథకమని పేర్కొన్నారు.

2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఏడాదికి ఎల్‌ఐసీతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్లలోపు ఉన్న 29.58 లక్షల మంది పట్టాదారులకు ఒకొక్కక్కరికి రూ.2,271.50 చొప్పున ప్రభుత్వం 2018-19కిగాను రూ.672 కోట్ల ప్రీమియం చెల్లించింది.

ప్రస్తుతం బీమా పరిధిలో ఉన్న 30.92 లక్షల మంది రైతుల కోసం ఇప్పటివరకు మొత్తం రూ.704 కోట్ల ప్రీమియం చెల్లించింది. గత ఏడాది రైతు బీమా కింద చెల్లించిన పరిహారం, రైతుల మరణాల సంఖ్య, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న ఎల్‌ఐసీ.. ఈసారి ప్రీమియం రేటును పెంచుతున్నట్టు పేర్కొన్నది.

డిజిటల్ సైన్ పూర్తయి 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లలోపు ఉన్న 30,94,656 మంది రైతులకు ఈ ప్రీమియం రేటును లెక్కగట్టింది. ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3013. 50 కాగా, ఇందులో ఎస్జీఎస్టీ 9 శాతం రూ.271.22, సీజీఎస్టీ 9 శాతం రూ.271. 22 చొప్పున చెల్లించనున్నది. స్టాంప్ డ్యూటీ కింద రూ.30.94 కోట్లు చెల్లించనున్నారు. మొత్తంగా రూ.934.19 కోట్లు ఎల్‌ఐసీకి చెల్లించడం ద్వారా 2019-20 రైతుబీమా పథకం వర్తింపజేయనుందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)