You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమిత్ షా నమస్కారంతో మీడియా చేతికి ‘టాప్ సీక్రెట్‘ - ప్రెస్‌రివ్యూ
జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 సవరణ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు వద్దకు చేరుకున్న అమిత్ షా, మీడియాకు నమస్కారం పెట్టి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా షా చేతిలో 'టాప్ సీక్రెట్'పేరుతో ఉన్న పత్రాలు మీడియా కంటపడ్డాయని సాక్షి వెల్లడించింది.
ఆర్టికల్ 370 సవరణ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను.. రాజ్యాంగపరమైన, రాజకీయం, శాంతిభద్రతలు అనే మూడు అంశాలుగా వర్గీకరించారు.
మొదటి విభాగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ విషయాన్ని నివేదించినట్లు అమిత్ షా నోట్ చేసుకున్నారు. సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించాక పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, అదే సమయంలో రాష్ట్రపతి కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అందులో ఉంది.
అలాగే రాజ్యసభలో భద్రత విషయంలో ప్రధాని మోదీ సభ చైర్మన్ వెంకయ్యనాయుడితో చర్చిస్తారని ఉంది. ఇక రాజకీయ విభాగంలో అఖిలపక్ష భేటీ నిర్వహణకు పిలుపునివ్వడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎన్డీయే కూటమి ఎంపీలకు వివరించాలని అమిత్ షా నిర్ణయించారు.
ప్రధాని మోదీ ఆగస్టు 7న జాతినుద్దేశించి ప్రసంగిస్తారని జాబితాలో ఉంది. జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ మాలిక్‌తో పాటు యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతారని ఈ నోట్‌లో ఉంది.
మరోవైపు శాంతిభద్రతల అంశానికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాను జమ్మూకశ్మీర్‌కు పంపాలని నిర్ణయించారు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా కల్పించేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని జాబితాలో చేర్చారని సాక్షి తెలిపింది.
‘కాపు రిజర్వేషన్ సమస్య క్లిష్టమైనదేమీ కాదు‘
గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప అభివృద్ధి పనులను ఆటంకపరచడం సరికాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారని ఈనాడు తెలిపింది.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే క్రమంలో ప్రజలు నష్టపోరాదని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అమరావతి నిర్మాణం నిలిపివేయడంతో దాదాపు 20వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో రెండు నెలలుగా పనులు లేక లక్షలాది మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును నిలిపివేయడంలో ఏదో లోతైన విషయం ఉందన్న పవన్..చిల్లర రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు.
అతి క్లిష్టమైన తెలంగాణ, కాశ్మీర్ సమస్యలకే పరిష్కారం దొరికినప్పుడు కాపు రిజర్వేషన్ సమస్య అంతకంటే పెద్దదేమీ కాదని పవన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా సమస్యను పరిష్కరించాలనే కోణంలో చూడాలని సూచించారు.
కాపులను ఓసీలు, బీసీలు కాదన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం ఆయన భీమవరం మండలం తాడేరులో అనారోగ్యంతో మృతి చెందిన జనసేన అభిమాని కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్యకి రూ.2.50 లక్షల చెక్కును అందజేశారు.
వారిని ఓదార్చే క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షలలో ఆయన పాల్గొన్నారు. అమరావతిలో కరకట్టపై ఆక్రమణల తొలగింపు అంశంలో రాజకీయ కక్ష సాధింపు, పక్షపాత విధానాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం తగవని పవన్ కల్యాణ్ హితవు పలికారని ఈనాడు వెల్లడించింది.
‘ఏ ప్రాతిపదికన కేబినెట్ నిర్ణయించింది?’
హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో చట్టసభల సముదాయాలను నిర్మించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన సమాచార పత్రాలను తమకు నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని సాక్షి వెల్లడించింది.
ఆ భవనాన్ని ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుందో కూడా తెలియజేయాలని తన తీర్పులో పేర్కొంది.
ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో శాసనసభ, శాసనమండలి సముదాయాల్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై సోమవారం కూడా వాదనలు జరిగాయి.
పిటిషనర్ల వివరాలు వేర్వేరుగా ఉన్నందున ఈ వివరాలు కోరుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం వెల్లడించింది. విచారణ మంగళవారానికి వాయిదా పడిందని సాక్షి తెలిపింది.
దరికి రాని గోదారి
వరద గోదావరి దాగుడుమూతలు ఆడుతోంది. ధవళేశ్వరం వద్ద తగ్గుతూ, భద్రాచలం వద్ద మాత్రం అంతకంతకూ ఉధృతమవుతోందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
నాలుగు రోజులనుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ముంపు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో 171 గ్రామాలు వరదల ప్రభావంతో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ సోమవారం మూడు అడుగులకు పైగా వరద ప్రవాహం తగ్గింది. అయితే, ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.
శబరి వంటి నదుల ఎగువ భాగంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రాబోయే రెండు రోజుల్లో వరదనీరు ఎక్కువ చేరే అవకాశం ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గోదావరి వరదపై జిల్లా అధికారులను ఆరా తీశారు.
పై నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఈ బ్యారేజ్ నుంచి 10,92,016 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది.
భద్రాచలంలో మొదటి హెచ్చరిక జారీ చేశారు. అయితే, రెండు మూడురోజులపాటు వరద ప్రభావం ఉండవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం కోనసీమలోని లంక గ్రామాలన్నీ ముంపులోనే ఉన్నాయి.
ఇదిలాఉండగా, కడెమ్మ స్లూయిజ్‌పై వరదనీరు తగ్గుముఖం పట్టింది. దానివల్ల పోలవరం ప్రాజెక్టు సైట్ కార్యాలయాలవైపు తిరిగి రాకపోకలు ఆరంభమయ్యాయి. అయితే, ఎగువ నుంచి మరింతగా వరదనీరు వచ్చి చేరడంతో గోదావరిలో అనూహ్యంగా సాయంత్రానికి వరద కాస్త పెరిగింది.
రానున్న 24 గంటల్లో మరోసారి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ప్రకటించారు. కాగా, ధవళేశ్వరం నుంచి భారీగా నీటి విడుదలతో వశిష్ఠ గోదావరిలో వరద మరింత పెరిగిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఇవి కూడా చూడండి:
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)