ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం.. రూ.1500 కోట్ల బకాయిలు.. చెల్లించకుంటే సేవలు నిలిపి వేస్తామన్న ఆసుపత్రులు : ప్రెస్‌ రివ్యూ

వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సలను, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్‌) కింద చికిత్సలను అరకొరగా అందిస్తుండగా.. ఆ కొద్దిపాటి పరిమిత చికిత్సలకు కూడా ఇక నుంచి ఆటంకం ఏర్పడనుందని ఈనాడు తెలిపింది.

ఆరోగ్యశ్రీ పథకానికి అనుసంధానంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు దాదాపు రూ.1500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో.. ఇక ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ చికిత్సలందించడం తమ వల్ల కాదని అవి చేతులెత్తేశాయి. ఈ నెల 10లోగా బకాయిలన్నింటినీ పూర్తిస్థాయిలో చెల్లించని పక్షంలో ఈ నెల 11వ తేదీ నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఈ నెల 15లోగా చెల్లించని పక్షంలో 16వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రులు ఆయా పథకాల కింద సేవలన్నింటినీ నిలిపివేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించాయి.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆసుపత్రుల సంఘం(తన్హా) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తన్హా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వినతిపత్రాన్ని సోమవారం సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారికి, ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో పథకం ముఖ్య కార్యనిర్వహణాధికారికి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.వైద్య సేవల నిలిపివేతపై తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా) ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు వినతిపత్రం అందజేసింది.

మొత్తం 1500 కోట్ల బకాయిల్లో టీషాకు చెల్లించాల్సినవే సుమారు 800 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ వర్గాలు మాత్రం రూ.1500 కోట్ల బకాయిలు లేవని, రెండు పథకాలకు కలుపుకొని టీషా, తన్హాలకు సుమారు రూ.800 కోట్ల వరకు చెల్లింపులు జరపాల్సి ఉందని చెబుతున్నాయి.

ఈ వారంలోనే సుమారు రూ.200 కోట్ల వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయని, దశలవారీగా బకాయిలను చెల్లిస్తామని పేర్కొంటున్నాయి. నిధుల విడుదలలో జాప్యం, ఆసుపత్రులు చికిత్సలు నిలిపివేయడం.. ఈ రెండింటి ఫలితంగా ప్రధానంగా నిరుపేదలు, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో పైరవీలు చేయించుకుంటే తప్ప చికిత్సలు పొందలేని దుస్థితి నెలకొందని ఈనాడు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, ysrcp/fb

ఉప్పు నీరు మంచి నీరవుతుందిలా..

ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్‌ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును సందర్శించారని సాక్షి వెల్లడించింది.

ఆయన వెంట టెల్‌ అవీవ్‌లోని భారతీయ మిషన్‌ ఉప అధిపతి షెరింగ్‌ ఉన్నారు. హడేరా చేరుకున్న ముఖ్యమంత్రికి సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ప్లాంటు అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

మంచినీటి తయారీ ప్రక్రియను, ప్లాంటు నెలకొల్పడానికి అయ్యే ఖర్చు, ఇతర వ్యయం వంటి అంశాలను విపులంగా వివరించారు. ఆ తర్వాత సీఎం ప్లాంటు అంతా కలియతిరిగి పరిశీలించారు. మంచినీటి తయారీ ప్రక్రియలో విభిన్న దశలను చూశాక అధికారులను అభినందించారు.

అక్కడ తయారైన మంచినీటిని రుచి చూసి చాలా నాణ్యతతో ఉన్నాయంటూ ప్రశంసించారు. హడేరా ప్లాంటులోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ రఫీ షామీర్‌ ఈ ప్లాంటు సందర్శనను ఏర్పాటు చేశారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలసి ఇజ్రాయెల్‌కు వెళ్లిన విషయం విదితమే.

పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి ముంబయి మీదుగా గన్నవరం విమానాశ్రయానికి 10 గంటల ప్రాంతంలో చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయని సాక్షి తెలపింది.

ఉసురుతీసిన లారీ

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారని నమస్తే తెలంగాణ పేర్కొంది..

మిడ్జిల్ మండలం వాడ్యాలలో వ్యవసాయ పనులు ముగించుకొన్న కూలీలు స్వగ్రామమైన కొత్తపల్లికి ఆటోలో వస్తుండగా.. చిల్వేర్ గేట్ దగ్గర సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్‌తోపాటు మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు.

లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. పన్నెండు మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చికిత్సకోసం మొదట సమీపంలో ఉన్న బాదేపల్లి కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్సకోసం మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ దవాఖానకు తీసుకెళ్లారు.

అక్కడ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరా బాద్‌కు తరలిస్తుండగా పార్వతమ్మ అనే మహిళ మార్గమధ్యంలో మరణించారు. ప్రమాదవార్త తెలియగానే జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకొంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించారు.

మిడ్జిల్ మండలంలోని వాడ్యాలలో వరినాట్లు వేయడానికి అదే మండలంలోని గోగ్యాతండాకు చెందిన 17 మంది కూలీలు.. ఆటోలో (ఏపీ 22-వై 3750) వెళ్లారు. సాయంత్రం ఆరుగంటలకు పనులు ముగించుకొని అంతా అదే ఆటోలో తిరుగుప్రయాణమయ్యారు.

గోగ్యాతండా కొత్తపల్లి శివారు గ్రామం. చిల్వేరు గేటుదాకా వచ్చిన ఆటో.. మరో ఐదు నిమిషాలైతే తండాకు చేరుకొనేదే. అంతలోనే అమాంతంగా మృత్యువు వచ్చిపడింది. లారీ ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. దాని భాగాలు వందల మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడి కనిపించాయి. మృతదేహాలు ఆటోలో ఇరుక్కుపోయాయి.

మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడి మాంసంముద్దల్లా మారిపోయాయి. ఆరు మృతదేహాలు రోడ్డు రెయిలింగ్ దాటి అవతలకు పడిపోయాయంటేనే లారీ ఎంత వేగంగా వస్తున్నదో అర్థం చేసుకోవచ్చని నమస్తే తెలంగాణ తెలిపింది.

తమ్మినేని సీతారాం

ఫొటో సోర్స్, Andhrapradeshcm/fb

‘అనైతికతను ప్రోత్సహించవచ్చా? అని వెంకయ్య నాయుడినే అడగాలి’

పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు వ్యవహరించిన తీరును అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తప్పుబట్టారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఆదివారం విజయవాడలో 'మీట్‌ ది ప్రెస్‌'లో.. రాజ్యసభలో ఫిరాయింపులపై విలేకరులు ప్రస్తావించగా.. అనైతికత ను ప్రోత్సహించడం సరికాదన్నారు. ''ఆదర్శవంతమైన, ఉన్నతమైన రాజ్యసభ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా ఉన్న మీరు అనైతికతను ప్రోత్సహించవచ్చా? అని వెంకయ్య నాయుడినే మీరు అడగాలి. అయినా నా అభిప్రాయం అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను.

నా అభిప్రా యం ప్రకారం విలువల రాజకీయం కావాలి. విలువలు అనే నిర్వచనంలోకి వెళ్తే చాలా దూరం వెళ్తుంది. నిజం గా అలాంటి(ఫిరాయింపులు) చర్యలను మనం ఖం డించాలి. ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో, రాజ్యసభ చైర్మన్‌గా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

పార్టీలు మారే వారికి ఈ రోజు హ్యాపీనే. కానీ, ప్రజలు అలాంటి వారిని వెనక్కి తీసుకొస్తారు. కచ్చితంగా ఆ చర్య(ఫిరాయింపులు) తప్పే. రాజకీయాల్లో నైతికతను ప్రోత్సహించాల్సింది పోయి, అనైతికతను ప్రోత్సహించడం అనే చర్య... అదీ రాజ్యాంగంలో ఉన్నత స్థానాల్లో రాజ్యాంగ నిర్దేశకులుగా ఉన్న మనం చేయకూడదు'' అన్నారు.

భవిష్యత్తులో తనకూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే కచ్చితంగా ఫిరాయింపులపై చర్య తీసుకుంటానని స్పష్టంచేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను రీకాల్‌ చేసే లా కొత్త విధానాలు రావాలన్నారు. స్పీకర్‌ వ్యవస్థ దేశంలో సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహ క, పాత్రికేయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి కీలకం అ ని, కానీ అవి గాడి తప్పుతున్నట్లుగా ఉన్నాయని సీతా రాం వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలను మించిన వ్యవస్థ... పౌర వ్యవస్థ ఒకటి ఉందని అందరూ గుర్తుంచుకోవాలన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)