ఒడిశా: 24 మందితో ప్రయాణిస్తున్న కార్గో నౌక బంగాళాఖాతంలో మునక, ఇద్దరు తప్ప మిగిలిన వారు గల్లంతు

ఒడిశా, కార్గో నౌక, ఓషన్ విన్నర్

ఫొటో సోర్స్, Costfoto/NurPhoto via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

పనామా జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌక 'ఓషన్ విన్నర్' శనివారం బంగాళాఖాతంలో మునిగిపోయింది.

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని పీటీఐ వార్తా వార్తా సంస్థ తెలిపింది.

నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 20 మంది చైనీయులు. ముగ్గురు మియన్మార్‌కు, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు.

వీరిలో ఇద్దరిని రక్షించామని, మిగిలిన వారి జాడ తెలియలేదని అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

ఈ నౌక ఒడిశా నుంచి సింగపూర్‌కు ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్తోందని అధికారులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రమాదం తర్వాత, భారత కోస్ట్ గార్డ్‌కు ఈ నౌకతో సంబంధాలు తెగిపోయాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సహాయ చర్యలను ప్రారంభించాయని అధికారులు వెల్లడించారు.

నౌక కోసం గాలింపు, రక్షణ చర్యల కోసం శ్రీ విజయపురం (గతంలో పోర్ట్ బ్లెయిర్‌) నుంచి రెండు నౌకలను పంపినట్లు కోస్ట్ గార్డ్ ప్రతినిధి కమాండెంట్ అమిత్ ఉనియాల్‌ తమకు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కోస్ట్ గార్డ్ ఇప్పటివరకు లైఫ్ రాఫ్ట్‌లో ఉన్న ఇద్దరిని రక్షించింది. మిగిలిన సిబ్బందిని గుర్తించేందుకు గాలింపు జరుగుతోంది.

ఒడిశా, కార్గో నౌక, ఓషన్ విన్నర్

ఫొటో సోర్స్, CFOTO/Future Publishing via Getty Images

గల్లంతైన వారి కోసం గాలింపు

నౌక గురువారం పారాదీప్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ప్రస్తుతం తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల (444 కిలోమీటర్ల) దూరంలో ఉంది. మునిగిపోవడానికి కారణాలపై స్పష్టత రాలేదు.

పారాదీప్ పోర్ట్ అథారిటీ డిప్యూటీ కన్జర్వేటర్ కెప్టెన్ అలేఖ చరణ్ సాహు, సిబ్బంది సభ్యుల భద్రతపై ఆశాభావం వ్యక్తం చేశారు.

నౌకలో ఉన్నవారి భద్రత కోసం ప్రార్థిస్తున్నానని అందరూ క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

నౌక ఇప్పటికీ "అవుటాఫ్ రేంజ్" అని మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ చూపిస్తోంది. నౌక గురించి చివరి అప్‌డేట్ 34 గంటల కిందట నమోదైంది. అప్పుడది బంగాళాఖాతంలో ఉంది.

‘‘నౌక పొడవు సుమారు 225 మీటర్లు. వెడల్పు 32 మీటర్లు. దీని సామర్థ్యం సుమారు 72,928 టన్నులు’’ అని మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ చెబుతోంది.

ఈ బల్క్ క్యారియర్ నౌకను 1998లో నిర్మించారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బల్క్‌గా సరుకులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారని డిజిటల్ సీ కార్గో లాజిస్టిక్స్ ప్లాట్‌ఫారమ్ రిండా వెల్లడించింది.

'ఓషన్ విన్నర్' సరుకు రవాణా సామర్థ్యం 72,928 మెట్రిక్ టన్నులు. దీని స్థూల టన్నేజీ 39,755 టన్నులు. షిప్ సేఫ్టీ, టెక్నికల్ స్టాండర్డ్స్ రివ్యూ సంస్థలలో ఒకటైన బ్యూరో వెరిటాస్ ఈ నౌకకు సర్టిఫికెట్ ఇచ్చింది.

ఇటీవల ఈ నౌక సింగపూర్ జలసంధి, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా సముద్ర ప్రాంతాల్లో కనిపించింది.

గత 36 నెలల్లో 'ఓషన్ విన్నర్'‌కు 67పోర్ట్ స్టేట్ కంట్రోల్ తనిఖీలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ తనిఖీల ద్వారా నౌక భద్రత, నిర్వహణ, సముద్ర నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అంచనా వేస్తారు.

'ఓషన్ విన్నర్' ప్రస్తుతం పనామా జెండాతో ప్రయాణిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)