హీరాబెన్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని చూడటానికి వస్తారని గుజరాత్ బీజేపీ నేతలు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, BJP Gujarat/Facebook
హీరాబెన్ 100వ పుట్టిన రోజు సమయంలో మోదీ ఏమన్నారంటే..
ఈ ఏడాది జూన్ 18న హీరాబెన్ 100వ పుట్టిన రోజు సందర్భంగా నరేంద్ర మోదీ తల్లి గురించి అనేక విషయాలు తన బ్లాగులో పంచుకున్నారు. నరేంద్ర మోదీ తన బ్లాగులో తల్లి గురించి ఇలా రాశారు...
‘ఈ ఏడాది జూన్ 18న ఆమె 100వ పడిలోకి అడుగుపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది.
తన చుట్టూ ఉండే వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అమ్మ కోరుకునేది.
మా ఇల్లు చిన్నదే కావొచ్చు. కానీ మా అమ్మ మనసు చాలా పెద్దది.
మా పక్క ఊర్లో నాన్న స్నేహితుడు ఒకరు ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు... పేరు అబ్బాస్.
నాన్న స్నేహితుడు చనిపోవడంతో అబ్బాస్‌ను నాన్న మా ఇంటికి తీసుకొచ్చారు.
మా అందరి మాదిరిగానే అబ్బాస్‌ను కూడా ఎంతో ప్రేమతో అమ్మ పెంచింది.
ఈద్ రోజున అబ్బాస్‌కు నచ్చినవి చేసేది’ అంటూ అమ్మ గురించి మోదీ అప్పట్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సామాన్యురాలే కానీ శక్తిమంతురాలు.. నా మంచితనం ఆమె నుంచి వచ్చిందే’
‘నాలోని మంచి అంతా అమ్మ, నాన్న నుంచి వచ్చిందే. అమ్మ సామాన్యురాలే కావొచ్చు. కానీ ఆమె చాలా శక్తిమంతురాలు. అమ్మ అంటే వ్యక్తి కాదు. ఆమె దేవుని మాదిరి ఒక రూపం.
గుజరాత్‌లోని మెహసనా జిల్లాలో గల విస్నానగర్‌లో అమ్మ పుట్టింది.
ఆమె పుట్టిన కొద్ది రోజులకు మా అమ్మమ్మ చనిపోయింది. అమ్మ చిన్నతనమంతా తల్లి లేకుండానే గడిచింది. తన తల్లి ఒడిలో తల పెట్టుకునే అదృష్టానికి అమ్మ నోచుకోలేదు.
అమ్మకు ఉత్తరాలు అంటే ఏంటో తెలియదు. కనీసం స్కూలు గేటును కూడా ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమె చూసిందల్లా ఇంట్లో కనిపించే పేదరికమే.
అమ్మ ఇంట్లో అందరికంటే పెద్దది. పెళ్లి అయిన తరువాత పెద్ద కోడలు అయింది. వాద్నానగర్‌లో మేం ఉండే ఇల్లు చాలా చిన్నగా ఉండేది. ఆ ఇంటికి ఒక్క కిటికీ కూడా ఉండేది కాదు. బాత్రూం, టాయిలెట్లు లేవు’ అంటూ తన తల్లి జీవితం గురించి మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
‘నన్ను మీరు అని పిలుస్తుంది’
‘మట్టితో కట్టిన గోడల మీద పెంకులతో ఉండే ఆ ఒకటిన్నర గదుల ఇంట్లో అమ్మనాన్నతో మా అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఉండేవారు. ఆ చిన్న ఇంట్లోనే ఒక గోడకు వెదురు కర్రలతో మంచెలాగా నాన్న కడితే, అది ఎక్కి అమ్మ వంట చేసేది.
నాన్న తెల్లవారు జామున నాలుగు గంటలకే పనికి వెళ్లేవాడు. అమ్మ కూడా అదే సమయంలో నిద్ర లేచేది.
ఇంటిని నడిపేందుకు ఇతరుల ఇళ్లలో అమ్మ పని చేసేది. పత్తి విత్తనాలు తీయడం, పత్తి ఒడకడం వంటి పనులు చేసేది మా అమ్మ.
నేను ఇంటికి వస్తే ఇప్పుడు కూడా స్వీట్లు తినిపిస్తుంది. చిన్న పిల్లాడికి తుడిచినట్లు మూతి తుడుస్తుంది.
గుజరాతీలో ‘నువ్వు’ అనాలంటే ‘తు’ అంటారు. ‘మీరు’ అనాలంటే ‘తమే’ అని పిలుస్తారు. నేను ఇంటి దగ్గర ఉన్నంత కాలం నన్ను అమ్మ, ‘తు’ అనే పిలిచేది. కానీ నేను ఇల్లు విడిచి వెళ్లిపోయిన తరువాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తరువాత అమ్మ పిలుపు మారింది.
ఇప్పుడు నన్ను ‘తు’ అని పిలవడం లేదు. ‘తమే’ అని మాత్రమే పిలుస్తోంది.’ అని మోదీ బ్లాగులో రాశారు.
ఇవి కూడా చూడండి:
- కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’
- ధనిక దేశంలో పేదల కోసం సూపర్ మార్కెట్లు.. ఎలా సక్సెస్ అయ్యాయంటే
- ఇండియా-చైనా ఉద్రిక్తతలు: భారత్‌కు ఆయుధాల సరఫరాను రష్యా నిలిపివేస్తుందా
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























