కంచె ఐలయ్య ప్రసంగం కేరళలో ఎందుకు రద్దయింది? వివాదం ఏంటి?

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇజ్రాయెల్ – పాలస్తీనా వివాదంపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన వ్యాసం వివాదం కేరళను తాకింది. ప్రతిష్ఠాత్మక ‘మనోరమ లిటరేచర్ ఫెస్టివల్‌’లో ఐలయ్య ప్రసంగాన్ని రద్దు చేశారు నిర్వాహకులు.

కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ (కాలికట్)లో మలయాళ మనోరమ సంస్థ ‘మనోరమ హార్టస్’ అనే పేరుతో ఒక సాహితీ సమ్మేళనం నిర్వహిస్తోంది. అందులో రచయిత, సామాజిక - రాజకీయ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ ప్రసంగించాల్సి ఉండగా, పాలస్తీనా అనుకూల నిరసనకారుల భయంతో ఆయన ప్రసంగాన్ని రద్దు చేశారు నిర్వాహకులు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రొఫెసర్ ఐలయ్య.

అసలేం జరిగింది?

అక్టోబరు 23వ తేదీన సాక్షి తెలుగు దిన పత్రికలో ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై ఒక వ్యాసం రాశారు కంచె ఐలయ్య. ‘‘రెండు దేశాలుగా బతకడమే దారి’’ అనే శీర్షికతో ప్రచురితమైన వ్యాసంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పాలస్తీనా అనుకూల వాదులకు ఆగ్రహం తెప్పించాయి.

ఆ వ్యాసంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక మంది వ్యాసాలు రాశారు, వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మలయాళ మనోరమ సంస్థ నిర్వహించే లిటరేచర్ ఫెస్టివల్ మీద కూడా ఆ ప్రభావం పడింది. ఆ కార్యక్రమంలో మాట్లాడాల్సిందిగా ఐలయ్యకు 2 నెలల ముందే ఆహ్వానం అందింది. అన్ని ఏర్పాట్లూ జరిగాయి. కానీ ఆయన ప్రసంగానికి రెండు రోజుల ముందు పరిస్థితి మారిపోయింది.

‘‘ప్రసంగం నేపథ్యంలో పాలస్తీనా అనుకూలురు పెద్ద ఎత్తున నిరసనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అది అశాంతియుత ప్రదర్శన కూడా కావచ్చు’’ అని తనకు నిర్వాహకుల నుంచి కాల్ వచ్చినట్టు ప్రొఫెసర్ ఐలయ్య చెప్పారు.

‘‘ఇది చాలా పెద్ద సమస్య’’ అని నిర్వాహకులు బంధు ప్రసాద్ అలెయమ్మ తనతో చెప్పినట్టుగా ఐలయ్య బీబీసీకి చెప్పారు. సభకు రావద్దని బంధు ప్రసాద్ తనకు పరోక్షంగా సూచించారని ఐలయ్య తెలిపారు.

అయితే, తన వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకునే ఆ చర్యను సభా ముఖంగా ఖండించాలని నిర్వాహకులను కోరానని, వారు దానికి స్పందించలేదని ఐలయ్య చెప్పారు.

కమ్యూనిస్టు ప్రభుత్వం భద్రత కల్పించాలి: ఐలయ్య

‘‘నిఘా సమాచారం అందితే, పోలీస్ రక్షణ కల్పించాలి. విషయం దేశమంతా తెలిసింది కాబట్టి కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం నా వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి తగిన భద్రత ఇవ్వాలి. లేకపోతే ఆ ప్రభుత్వానికే చెడ్డపేరు.

స్వయంగా పత్రికా రంగంలో ఉన్న మలయాళ మనోరమ సంస్థ కూడా నా వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ అలా జరగలేదు. నాకు మాట్లాడే హక్కు కల్పించకుండా, సభకు రావొద్దంటే స్వేచ్ఛ ఉన్నట్టవుతుందా?

ఈ నిరసనకు అండగా ఉన్న ముస్లిం శక్తులు, మనోరమ నిర్వాహకులు, కేరళ ప్రభుత్వానిదే దీనికి బాధ్యత’’ అని బీబీసీతో అన్నారు ప్రొఫెసర్ ఐలయ్య.

ఈ నిరసనకు మద్దతిచ్చిన పాలస్తీనా అనుకూల, ముస్లిం సంఘాలపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.

‘‘నా వ్యాసానికి వ్యతిరేకంగా ఎందరో మైనార్టీలు, లెఫ్ట్ లిబరల్స్ నన్ను అబ్యూజ్ చేస్తూ రాశారు. నా జీవితాంతం నేను సంఘ్, బీజేపీల మీద పోరాటం చేశాను, వ్యాసాలు, పుస్తకాలు రాశాను. కానీ ఒక్క వ్యాసానికే (పాలస్తీనా అనుకూలురు) నన్ను అడ్డుకుంటున్నారు.

ఇక్కడ హిందూత్వ ప్రభుత్వ పాలనలో ఇరకాటంలో ఉన్నామని అంటున్నవారే, మరోవైపు ఒక్క వ్యాసం రాసిన రచయితను అడ్డుకోవాలని చూస్తున్నారు. వారు నన్ను అడ్డుకోవడానికి నిఘాకు సమాచారం వెళ్ళేంత స్థాయిలో ప్రయత్నాలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ మా జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కులకు భంగం కలుగుతుందని మాట్లాడే వారే వేల మైళ్ళ దూరంలోని ఇజ్రాయెల్‌పై నేను రాసిన విషయాల్లో ఒక పాయింట్ పట్టుకుని నన్ను వ్యతిరేకిస్తున్నారు.

నేను చాలా విషయాలు రాశాను. అవన్నీ వదిలేసి మీరు ఇజ్రాయెల్‌ను పొగిడారు కాబట్టి, నిన్ను ఎక్కడా మాట్లాడనీయం అంటే అది భారతీయ ముస్లింలకు మంచిది కాదు. నన్ను అడ్డుకోవాలని చూసిన ముస్లిం, పాలస్తీనా అనుకూల శక్తులను భారతీయ ముస్లింలు ఖండించాలి’’ అని ఐలయ్య బీబీసీతో అన్నారు.

ఏంటీ లిటరేచర్ ఫెస్టివల్?

కేరళకు చెందిన మీడియా సంస్థ మలయాళ మనోరమ గ్రూపు ఈ సాహితీ సమ్మేళనం నిర్వహిస్తోంది. దీని పేరు మనోరమ హార్టస్. ఇక్కడ సాహిత్యం, సంగీతం, కళలపై చర్చలు జరుగుతాయి.

సాహితీ నగరంగా యునెస్కో గుర్తింపు పొందిన కోళికోడ్ నగరంలో ఇది నవంబరు 1 నుంచి 3 వరకూ జరుగుతుంది. కోళికోడ్ సముద్ర తీరంలో మొత్తం 8 వేదికల్లో, 400 మంది రచయితలు, వక్తలు, కళాకారులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. 3 లక్షలకు పైగా పుస్తకాలతో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఈ సమ్మేళనంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి.

నిర్వాహకులు ఏం చెప్పారంటే..

కంచె ఐలయ్య ప్రసంగాన్ని రద్దు చేయడానికి కారణాలు, ఇతర అంశాలపై స్పందన కోసం నిర్వాహకులను బీబీసీ సంప్రదించింది.

వారు స్పందిస్తూ.. ‘‘మేం ఆయన ఆహ్వానాన్ని రద్దు చేయలేదు. ఆయన ఈ మధ్య రాసిన ‘ప్రొ ఇజ్రాయెల్, యాంటీ పాలస్తీనా’ వ్యాసం వలన, ఆయన సెషన్లో నిరసన జరగడం లేదా, అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టు మాకు నిఘా సమాచారం అందిందని తెలియజేశాం. ఈ విషయం అంతా ఆయనకు సవివరంగా ఈమెయిల్ చేసి, ఒకవేళ పరస్పరం అంగీకరించిన అంశంపై ఆయన సెషన్ నిర్వహించాలని అనుకుంటే, మేం కూడా నిర్వాహిస్తామని తెలియజేశాం. కానీ ఆయన ఆ ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వలేదు. అదే విషయాన్ని అక్టోబరు 30న ఆయనకు ఫోన్ ద్వారా తెలియజేశాం. మాకు ఏ సంస్థ, ఎవరు నిరసన ప్లాన్ చేశారన్నది తెలియదు, కానీ నిఘా వర్గాల నుంచి ఉన్న సమాచారాన్ని మాత్రమే ఆయనకు తెలియజేశాం’’ అని చెప్పారు.

ఐలయ్య కోరినట్టుగా సమ్మేళనం ప్రారంభోత్సవ వేడుకలో ఆ నిరసన వ్యవహారం గురించి ప్రస్తావించలేదని నిర్వాహకులు తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)