యెమెన్: ‘చుట్టూ బుల్లెట్లు, బాంబులు పడుతున్నాయి.. మోకాళ్లు,చేతులపై పాకుతూ శరణార్థి శిబిరానికి చేరుకున్నా’

ఫొటో సోర్స్, Liam Weir/BBC
- రచయిత, నవల్ అల్-మఘాఫీ
- హోదా, బీబీసీ రిపోర్టర్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
'ఇది మొదటి డ్రోన్, దీని తర్వాత దాడి మొదలవుతుంది' అని నైరుతి యెమెన్‌లో మాతోపాటు వచ్చిన సైనికుడు చెప్పారు.
ఆ శబ్దం మరింత పెరుగుతుండటంతో సమీపంలోని పొదల చాటున దాక్కున్నాం. ఆ తర్వాత మేం వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాం.
పది నిమిషాల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దాడుల శబ్దాలు వినిపించాయి. కానీ అవి ఎక్కడ జరిగాయో స్పష్టత లేదు.
తాయిజ్ నగరానికి నైరుతి దిశలో ఉన్నపర్వతాల్లో పోరాట ప్రాంతం ఎక్కడ మొదలవుతుందో చెప్పడం చాలా కష్టం.
హూతీలను వెనక్కి నెట్టేందుకు సౌదీ ప్రభుత్వ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల ప్రారంభంలో హూతీలు ఎర్ర సముద్రం తీరంలో దూసుకెళ్లి నౌకల రాకపోకలకు కీలకమైన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని అంతర్యుద్ధాన్ని తీవ్రం చేశారు.

ఇళ్లన్నీ నిశ్శబ్దం
పోరాటాన్ని దగ్గరగా పరిశీలించడానికి ప్రభుత్వ దళాలతో కలిసి తాయిజ్ నగరం నుంచి చెక్‌పోస్టుల గుండా ప్రయాణించి, యెమెన్ దళాల అధీనంలోని ప్రాంతం ముగిసి, ఎవరికి చెందని ప్రాంతాలు మొదలయ్యే చోటుకు వెళ్లాం.
ఆ పర్వత వాలు ప్రాంతంలో అక్కడక్కడా ఇళ్లు ఉన్నాయి. అయితే ఘర్షణల భయంతో చాలా మంది ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లిపోవడంతో నివాసాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఆ ప్రాంతంలో భయంకరమైన నిశ్శబ్దం నెలకొని ఉంది. నిరంతరం వినిపించే మోటార్ బైక్స్, కార్ల చప్పుడు లేదు. పశువుల అరుపులు, ఇరువైపుల జరుపుతున్న కాల్పుల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Liam Weir/BBC
'ఇక్కడ నా భూమిపై రెండు మోర్టార్లు పడ్డాయి' అని మేకలమందతో ఇంటి బయట కూర్చున్న అలీ చెప్పారు. పోరాట ప్రాంతానికి సుమారు కిలోమీటరు దూరంలో ఆయన ఇల్లు ఉంది.
షెల్లింగ్, తుపాకుల కాల్పులకు తట్టుకోలేక నిరాశ్రయుల శిబిరానికి పిల్లలను పంపించానని ఆయన చెప్పారు. పశువులను చూసుకోవడానికి భార్య, సోదరీమణులతో కలిసి అక్కడే ఆయన ఉండిపోయారు.
'నాకు చాలా భయంగా ఉంది' అని ఆయన అన్నారు. 'కానీ నాకు వేరే దారి లేదు, ఈ పశువులు లేకపోతే ఆహారం ఉండదు. అప్పుడైనా చనిపోవాల్సిందే' అని తెలిపారు.
రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని హూతీలు స్వాధీనం చేసుకుంటే జరిగే పరిణామాలకు భయపడి ఆయన తన పేరులో కొంత భాగాన్ని మాత్రమే చెప్పారు.
హూతీలతో సంబంధాలు ఉన్నవ్యక్తులను సంప్రదిస్తే పెద్ద దాడికి సిద్ధమవుతున్నామని దీని కోసం బలగాలను సమీకరించుకుంటున్నామనే కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, వాటి గురించి తమకు తెలుసునని, అందుకు తగ్గట్టుగానే తాము కూడా సంసిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.

తాయిజ్ కోసం హూతీల పోరు
పోరాట ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న చెక్‌పాయింట్ వద్ద సైనికులను మేం కలిశాం. హూతీలు ఆక్రమించిన ప్రదేశాలకు వందల మీటర్ల దూరంలో పర్వతాలపై తమ స్థానాల నుంచి వారు అప్పుడే కిందకు దిగారు. ఆ సైనికుల్లో ఒకరు మాట్లాడుతూ, ఒక చోట పడి ఉన్న 18 మంది సైనికుల మృతదేహాలను తీసుకు రావడానికి కాల్పులు జరిపామని, కానీ వాటిని స్వాధీన పరుచుకోలేకపోయామన్నారు.
నాలుగేళ్లపాటు సాగిన కాల్పుల విరమణ ఒప్పందం విచ్చిన్నమైన తర్వాత హూతీలు సెప్టెంబర్ 10న ఎర్రసముద్ర ఓడరేవు నగరం మోఖాను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి మోఖాకు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయిజ్ చుట్టూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
బాబ్ అల్- మండెబ్ జలసంధిని పర్యవేక్షించే కీలక ప్రాంతాన్ని హూతీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జలసంధి ఆసియా- యూరప్‌ను కలిపే ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గం. దీంతో ఆ ప్రాంతం నుంచి సరఫరాలకు ఆటంకం వాటిల్లుతుందనే ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి.
యెమెన్‌లోనే మూడో అతి పెద్ద నగరం తాయిజ్. ఇది ఆ దేశ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది నివసించేవారు. ఇది ఉత్తర యెమెన్‌లోని హూతీలు నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దక్షిణాన ప్రాంతాలకు మధ్య ఉంది. అందుకే ఈ నగరానికి అన్ని వైపులా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది.
తాయిజ్ నగర మధ్య భాగం ప్రభుత్వ దళాల నియంత్రణలో ఉంది. ఉత్తర, తూర్పు భాగాలు హూతీల స్వాధీనంలో ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంపై పట్టు సాధించడానికి ఇరు వర్గాలు చేస్తున్న పోరాటంతో అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. దక్షిణ మార్గాన్ని పర్యవేక్షించే ఎత్తైన ప్రదేశాల కోసం వీళ్లు తలపడుతున్నారు. దీన్ని హూతీలు వశం చేసుకుంటే మోఖాను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ దళాలకు చాలా కష్టమవుతుంది.
మేం దక్షిణాన ఎడెన్ నుంచి తాయిజ్ వరకు ప్రయాణం చేశాం. అక్కడే అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్, ప్రభుత్వం ఉన్నాయి.
ఆ మార్గంలో వేర్వేరు కమాండర్లు పర్యవేక్షిస్తున్న దాదాపు 30 చెక్‌పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ దళాలు ఒక్కటిగా కాకుండా విడివిడిగా పోరాడుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది.
మేం నగరానికి సమీపిస్తున్న కొద్దీ అంబులెన్స్‌లు మమ్మల్ని దాటి వెళ్తున్నాయి. అరగంటలోనే కనీసం ఐదు అంబులెన్స్‌లు తాయిజ్ ఆసుపత్రివైపు వెళ్లడం మేం దారుణమైన పోరాటానికి కేంద్రంగా ఉన్న నగరంలోకి వెళుతున్నామనే సంకేతాన్ని ఇచ్చాయి.

ఫొటో సోర్స్, Liam Weir/BBC
చిన్నారులను నియమించుకుంటున్న హూతీలు
చీకటి పడిన తర్వాత మేం అక్కడికి చేరుకున్నాం. దుకాణాలు వెలుగులు చిమ్ముతున్నాయి. రెస్టారెంట్స్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. చిన్నారులు వీధుల్లో ఆడుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు ఆ నగరం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాల నుంచి బాంబుల శబ్దాలు, తుపాకుల మోత మాత్రం వినిపిస్తోంది.
ఆ దేశంలో జరుగుతున్న వినాశకరమైన అంతర్యుద్ధంలో తాయిజ్ ఒక ప్రధాన రణక్షేత్రంగా ఉంది. 2015లో సనా నుంచి ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత తాయిజ్‌ను స్వాధీనం చేసుకోవడానికి హూతీలు ప్రయత్నించారు. కానీ స్థానిక మిలీషియా సభ్యులు వారిని తరిమేశారు.
ఇప్పుడు హూతీలు చేస్తున్న దాడిలో ఆయుధాలతోపాటు డ్రోన్స్ వాడుతున్నారు.
వారికి ఆయుధాలు, నిధులు, సైనిక సలహాలు ఇస్తున్నది ఇరాన్ అని సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాలు, ఐక్యరాజ్యసమితి నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఇరాన్ ఇప్పటికే ఖండించింది. హూతీలకు రాజకీయంగా మాత్రమే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది.
హూతీలు బాలసైనికులను నియమించుకుంటున్నారని చాలా కాలంగా వివిధ నివేదికలు చెబుతున్నాయి. పోరాట ప్రాంతంలో వారిని ఎదుర్కొన్నట్టు ఒక ప్రభుత్వ సైనికుడు చెప్పారు.
' యెమెన్ చిన్నారులను చూసి, వారిపై కాల్పులు జరపడం కష్టంగా ఉంటుంది. కానీ వారు మీపై గురి పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి' అని ఆయన వివరించారు.
ఈ దుస్సంప్రదాయానికి ముగింపు పలుకుతున్నట్టు 2022లో ఒక కార్యచరణ ప్రణాళికలో సంతకం చేసి ఐక్యరాజ్యసమితికి హూతీలు హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సైన్యంతో పని చేస్తున్న యువతతో బీబీసీ మాట్లాడింది.
యెమెన్‌లో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి మద్దతు ఇస్తూ ఆయుధాలను కూడా సరఫరా చేస్తోంది. ఎర్ర సముద్ర తీరం వెంబడి ఉన్న హూతీల స్థావరాలపై వందల వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా హూతీలు నైరుతి సౌదీ అరేబియాలోని నగరాలు, మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు.

ఫొటో సోర్స్, Liam Weir/BBC
మేకలు మేపుతున్న బాలికపై దాడి
తాయిజ్‌లోని అల్-థవ్రా ఆసుపత్రికి వెళ్లాం. యుద్ధరంగంలో గాయపడిన ప్రతి ఒక్కర్నీ ఈ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరుస్తున్నారు. అక్కడ మేం చూసిన ఏ మంచం కూడా ఖాళీగా లేదు.
వీరిలో కొందరు సైనికులు, మరికొందరు పౌరులు ఉన్నారు. మేకలు మేపుతుండగా ఒక పదునైన లోహపు ముక్క 12 ఏళ్ల ఘనా నబీల్ తలకు తగిలింది. హూతీలు వేసిన మోర్టార్ ఆమె సమీపంలో పడిందని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆమె అపస్మారక స్థితిలో ఉంది. తలకు కట్టుకట్టి ఉంది. మొహం గాయాలతో వాచిపోయి ఉంది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో బెడ్ పక్కనే కుటుంబ సభ్యులు కూర్చున్నారు.
గాయంతో ఆమె మెదడు దెబ్బతిన్నట్టు వైద్యుడు చెప్పారు. 'ఆమె మునుపటిలా ఉండలేదు' అన్నారు.
తాయిజ్‌కు దక్షిణాన సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అల్-మోనింగ్ నిర్వాసితుల శిబిరం ఉంది. మోఖా సహా ఈ పోరు వల్ల నష్టపోయిన గ్రామాల నుంచి వచ్చిన కుటుంబాలు ఇక్కడకు చేరుకుంటున్నాయి. వందల గుడారాల్లో తలదాచుకుంటున్నాయి.
10 రోజుల్లోనే 200 కుటుంబాలు ఇక్కడకు వచ్చినట్టు మాకు చెప్పారు.
మరియం సాలే(ఇది ఆమె అసలు పేరు కాదు) భర్త, ఐదుగురు పిల్లలతో కలిసి మోఖా నుంచి వారం రోజుల క్రితమే వచ్చారు. ఆమె పెద్ద బిడ్డ వయసు ఏడేళ్లు. మరియం ఆహారం కోసం ఒక టోపీని అల్లుతున్నారు.
'మేం చెప్పుల్లేకుండానే వచ్చాం. మాతో పిల్లల్ని తప్ప ఏం తెచ్చుకోలేదు' అని ఆమె చెప్పారు.
వారు పారిపోతూ వస్తుండగా మోర్టార్ షెల్ శకలం తగిలి తన మేనల్లుడు చనిపోయినట్టు ఆమె చెప్పారు. తను నా వెనకాలే నడుస్తూ వచ్చాడు. తాము వస్తున్నప్పుడు ముందు వెనుక ఘర్షణలు జరిగినట్టు వివరించారు. పర్వతాలపై ఆయుధాలతో ఉన్న వ్యక్తులను చూసినట్టు తెలిపారు.
'మా పని అయిపోయిందనుకున్నాం.' అని ఆమె అన్నారు. 'పిల్లలు గట్టిగా అరుస్తూ, ఏడుస్తున్నారు. కానీ మా కుటుంబం ముందుకు సాగింది' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Liam Weir/BBC
'మోకాళ్లు, చేతులతో పాకుతూ పారిపోయా'
మరో గుడారం బయట ఖాళీ బియ్యం సంచిపై ఫాత్మా మహమ్మద్ సాలే పడుకొని ఉన్నారు. శారీరక వైకల్యం వల్ల ఆమె నడవలేరు. తనకు పడుకునేందుకు చోటు లేదని ఆమె చెప్పారు. 'నాకేం లేదు, ఆశ్రయం లేదు, పరుపు లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు' అని ఆమె అన్నారు.
పోరాటం వారి గ్రామంలోకి వచ్చేసరికి ఇద్దరు పిల్లల, వారి పిల్లలతో కలిసి ఫాత్మా ఉండేవారు. తన వైకల్యం కారణంగా తాను వేగంగా కదల్లేనని గ్రహించి కుటుంబం ఆగిపోతుందని గమనించారు. అందుకే పిల్లల్ని తీసుకొని పారిపోమని వారికి చెప్పినట్టు ఆమె తెలిపారు.
తర్వాత రెండు రోజులపాటు చేతులు, మోకాళ్లతో పాకుతూ ఉన్నట్టు ఆమె వివరించారు.
'నేను పాకుతూ వస్తున్నప్పుడు నా చుట్టూ బులెట్లు, బాంబులు పడుతూనే ఉన్నాయి. నాపై పిడుగులు పడుతున్నట్టు అనిపించింది, దేవుణ్ని ప్రార్థిస్తూ ఉన్నాను'
అప్పుడు ఒక మోటర్‌బైక్ నడుపుతున్న వ్యక్తి తనను చూశాడని, ఈ క్యాంప్‌లోకి తీసుకొచ్చాడని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఆమె తన కుటుంబాన్ని చూడలేదు.
యెమెన్ అంతర్యుద్ధం కారణంగా 52 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ సెప్టెంబర్ 22న వెల్లడించింది. ఈ నెలలోనే యెమెన్ వ్యాప్తంగా 1,30,000 మందికిపైకా ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపింది.
వచ్చే మూడు నెలల్లో ఫాత్మా లాంటి వాళ్లు మరో లక్ష మంది తమ ఇళ్లను వదిలి రావచ్చని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































