అద్దెకు బాయ్‌ఫ్రెండ్: కాఫీకి రూ.499, సినిమాకైతే రూ.1250.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాడ్స్, పోలీసుల హెచ్చరికలు

''మీకు బాయ్‌ఫ్రెండ్ కావాలా.. అయితే, అద్దెకు ఇస్తాం. పనిని బట్టి, సమయాన్ని బట్టి రేటు'' అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని యాడ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రకటనల వెనుక అమ్మాయిలను మోసం చేసే ఎత్తుగడలు ఉన్నాయని చెబుతున్నారు హైదరాబాద్ పోలీసులు.

‘‘ఇది ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త డేటింగ్ ట్రాప్’’ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనర్ హెచ్చరించారు.

''ఒంటరితనంతో బాధపడుతున్నారా..? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా..? అది కూడా 50 శాతం ఆఫర్లతో.. అంటూ సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నపోస్టర్ల వెనుక సైబర్ మోసం ఉంది'' అని చెప్పారాయన.

అయితే, యుక్త వయసులో వచ్చే ఆకర్షణలను ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడతున్నారని హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్టు అనిత ఆరె బీబీసీతో చెప్పారు.

ఆ ప్రకటనల్లో ఏముంది?

సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని సజ్జనర్ చెప్పారు.

ఈ విషయంలో తమకు కనిపించిన కొన్ని ప్రకటనల వివరాలను ఎక్స్ ఖాతాలో సజ్జనర్ షేర్ చేశారు

ఈ ప్రకటనలను పరిశీలిస్తే, రెండు విషయాలు ప్రధానంగా గమనించవచ్చు.

1. సమయం

2. రేటు.

ఏ పనికి ఎంత రేటో ఆ ప్రకటనల్లో చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు.

ఓ గంట సేపు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు తోడు రావడానికి రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడు కోసం రూ.1,999గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ చెప్పారు.

''ఇవే కాకుండా, పది గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ.4,499గా నిర్ణయించి రేట్ కార్డు ప్రకటిస్తుంటారు'' అని ఆయన తెలిపారు.

బాయ్‌ఫ్రెం‌డ్‌ను పంపే సమయంలో ఎవరికీ తెలియకుండా అమ్మాయి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పి నేరుగా మెసేజ్ చేయాలంటూ ప్రకటనల్లో కనిపిస్తుంటుంది.

ప్రకటనల్లో చూపించే అబ్బాయిలు వాస్తవం కాదని, ప్రకటనల్లో చూపించే ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)తో తయారు చేస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని సజ్జనర్ చెప్పారు.

''అమ్మాయిల వివరాలను పంపించిన తర్వాత మాటలతో మభ్యపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యురిటీ డిపాజిట్, అడ్వాన్సుల పేరుతో వ్యాలెట్ ట్రాన్స్ ఫర్, క్యూఆర్ కోడ్ల సాయంతో డబ్బును వసూలు చేస్తంటారు. తర్వాత అకౌంట్లను బ్లాక్ చేసి మాయం అవుతుంటారు'' అని వివరించారు.

అప్రమత్తత అవసరం

సైబర్ నేరాల విషయంలో పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, ఏదో కొత్త రూపంలో పుట్టుకొస్తున్నాయి.

కాల్ సెంటర్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్టు, డేటింగ్ యాప్స్.. ఇలా రకరకాలుగా సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి.

ఇప్పుడు సైబర్ నేరాల్లో ''రెంట్ బాయ్‌ఫ్రెండ్' పేరుతో మరో నయా మోసం జరుగుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

ఇప్పటివరకు బాధితులు గానీ యువతులు గానీ నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో, ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే మున్ముందు ఈ తరహా మోసాలు బాగా ఎక్కువయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ బీబీసీతో చెప్పారు.

''పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు చూస్తున్నప్పుడు ఈ తరహా మోసం ఉన్నట్లుగా గుర్తించాం. ఇది ఇప్పుడిప్పుడే మొదలైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది’’ అన్నారు సజ్జనర్.

ఈ మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించిందని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలు, వారు చెప్పే మాటలు నమ్మి నేరుగా కలవడానికి వెళితే మాయమాటలు చెప్పి పరిచయాలు పెంచుకుని ప్రేమ పేరుతో మోసం చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

''ఫోన్ నంబరు, వ్యక్తిగత ఫోటోలను అశ్లీలత కోసం వాడుకుని బ్లాక్ మెయిలింగ్ పాల్పడే ప్రమాదం ఉంది'' అని సజ్జనర్ హెచ్చరించారు.

ఒకవేళ ఎవరైనా ఈ తరహా సైబర్ నేరాలకు గురైనా లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఏటా సైబర్ నేరాల్లో పెరుగుదల

భారత్‌లో ఏటా సైబర్ నేరాలు పెరుగుతూపోతున్నాయి. 2024 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం, 2022లో దేశంలో 65,893 సైబర్ నేరాలు నమోదు కాగా, 2023లో 86,420 సైబర్ నేరాలు నమోదయ్యాయి.

అదే 2024లో 1,01,928 సైబర్ నేరాలు రికార్డు అయ్యాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

వీటిలో మహిళలపై దాడులకు సంబంధించి 18,615 కేసులున్నాయి. .

మొత్తంగా 601 సైబర్ బ్లాక్ మెయిలింగ్ కేసులు నమోదవ్వగా, ప్రత్యేకించి మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 370 కేసులు నమోదయ్యాయి.

''తల్లిదండ్రుల్లో మార్పు రావాలి''

యుక్త వయసుకు వచ్చేసరికి పిల్లలకు చేసే సూచనలు, మాటల విషయంలో తల్లిదండ్రుల వైఖరిలో మార్పులు రావాలని సూచిస్తున్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్టు అనిత ఆరె.

''పిల్లలు యుక్త వయసు వచ్చాక ఆకర్షణలకు గురయ్యే అవకాశం ఉంది. దీనికితోడు తోటివారికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నారన్న ఉద్దేశంతో తమకు ఆ తరహాలో ఉండాలనే ఆలోచనతో ఇలాంటి ప్రకటనలవైపు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది'' అని చెప్పారు.

''ఇంట్లో తమ పిల్లలే అన్న చనువుతో నెగిటివ్ విషయాలు చెబుతుంటారు. కానీ, అలా కాకుండా నెగిటివ్ విషయాలు చెప్పేముందు వారికి ఉన్న పాజిటివ్ విషయాలను తల్లిదండ్రలు ప్రస్తావించాలి'' అని అనిత చెప్పారు.

బయట వ్యక్తులు లేదా అద్దెకు వచ్చే వ్యక్తులు అమ్మాయిలపై ఎలాంటి విమర్శల జోలికి పోకుండా మాయమాటలతో పొగిడి వలలో వేసుకునే అవకాశం ఉందని, దానివల్ల మోసపోయే ప్రమాదం ఉందని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)