‘అసలు నేను చేసిన నేరమేంటి’- 50 కేసులు ఎదుర్కొని, 13 ఏళ్లు జైలులో గడిపి.. నిర్దోషిగా విడుదలైన బిర్జు పుంగటి అడుగుతున్న ప్రశ్న ఇది

ఫొటో సోర్స్, Birju Pungati
- రచయిత, శతాలీ శెడ్‌మాకే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
‘‘నేను ఒక పనిమీద చత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్ వెళ్లి, తిరిగి వస్తుండగా.. నక్సలైట్‌నంటూ గోండియా జిల్లాలోని సాలేకసాలో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. నా యవ్వన దశలోని 13 ఏళ్లు జైలులోనే గడిపి బయటకు వచ్చాను. కానీ, ఒక ప్రశ్నకు నాకింకా సమాధానం దొరకలేదు. ‘అసలు నేను చేసిన తప్పేంటి’'' అని 36 ఏళ్ల బిర్జు పుంగటి అడుగుతున్నారు.
బిర్జు పుంగటి తన కథ బీబీసీకి చెప్పారు. మొదట్లో ఆయన మాట్లాడటానికి కూడా భయపడ్డారు. కొంతసేపటి తర్వాత "నాలాంటి చాలామంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు, వారి ప్రశ్న కూడా ఇదే. మనమెందుకు జైలులో ఉన్నాం?" అని వారు ప్రశ్నిస్తున్నారని బిర్జు పుంగటి చెప్పారు.
ఆయన గొంతు నిరాశతో కూడిన బాధతో నిండిపోయింది. బిర్జుపై వివిధ నక్సల్ సంబంధిత ఆరోపణలపై మొత్తం 50 కేసులు ఉండగా, ఆ కేసుల్లో ప్రస్తుతం ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.
అయినప్పటికీ, ఇన్నేళ్లుగా కేవలం అనుమానం ఆధారంగా జరిగిన అరెస్టులు, కోర్టుల కుటిలమైన ఎత్తుగడలు… ఇవన్నీ ఆయన్ని తన ఆలోచనల నుంచి బయటపడనివ్వడం లేదు.
ఈ ఆరోపణలతో జైలు జీవితం గడిపిన తన 13 ఏళ్ల జీవితాన్ని ప్రభుత్వం తిరిగి ఇస్తుందా? ఈ ప్రశ్న ఆయన్ను వేధిస్తూనే ఉంది. బిర్జును మొదటిసారి అరెస్టు చేసినప్పుడు ఆయనకు అప్పుడే పెళ్ళయింది. 13 ఏళ్ల తర్వాత తామిద్దరం ఇప్పుడే కలిసి జీవిస్తున్నామని ఆయన చెబుతున్నారు.

అసలేంటి విషయం?
నక్సలైట్లతో సంబంధాలు అన్న అనుమానంపై 2012 మార్చిలో గోండియా జిల్లా సాలేకసాలో బిర్జుతో పాటు మరికొందర్ని అరెస్ట్ చేశారు.
సాలేకసా తాలూకాకు చెందిన ఒక వ్యక్తిపై దాడి, బెదిరింపు, హత్య ఆరోపణలలో బిర్జుపై రెండు కేసులు నమోదయ్యాయి.
గోండియాలోని సెషన్స్ కోర్టులో ఈ కేసు వాదనలు జరిగాయి. ఆధారాలు సరిగ్గా లేకపోవడంతో, 2017లో ఆయన్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే, ఆయన విడుదల కాలేదు.
గోండియా కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తే.. మరికొన్ని ఆరోపణలపై ఆయన్ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. నక్సలైట్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలపై గడ్చిరోలిలో ఆయన మీద 48 కేసులు నమోదయ్యాయి. చంద్రపూర్ జైలుకి తరలించారు. మూడు నెలల తర్వాత నాగ్‌పూర్‌కి బదిలీ చేశారు.
బిర్జుపై మొత్తం 50 కేసులు ఉండగా, వాటిల్లో 49 కేసులలో ఆయన సాక్ష్యాధారాలు లేకుండా నిర్దోషిగా విడుదలయ్యారు. జైలు నుంచి బెయిల్ కూడా పొందారు. ఆ తర్వాత, జూలై 24న చివరి కేసు తీర్పు వెలువడగా.. అన్ని ఆరోపణల నుంచి బిర్జు నిర్దోషిగా విడుదలయ్యారు.
అయితే, ఆయన జీవితంలో ఎక్కువ భాగం ఈ కేసులు, జైళ్లతోనే గడిచిపోయింది.

ఫొటో సోర్స్, Birju Pungati
‘అన్నీ మారిపోయాయి’
గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాలోని గోడెలి గ్రామానికి చెందిన బిర్జు పుంగటి వ్యవసాయం చేస్తారు. గ్రామంలో 14 ఎకరాల భూమి ఉంది. దానిపైనే కుటుంబం జీవనోపాధి పొందుతోందని బిర్జు చెప్పారు. బిర్జు కుటుంబంలో ఆయన తల్లి, సోదరి, భార్య ఉన్నారు. ఆయన తండ్రి 2018లో మరణించారు.
తాను అరెస్టు అయిన రోజును బిర్జుకు స్పష్టంగా గుర్తుంది. 2012 మార్చిలో సాలేకసాలో అరెస్టైన తర్వాత, ఆయన్ను సాలెకసా నుంచి భండారా జైలుకు తీసుకువెళ్లారు. అక్కడే ఆయన 5 సంవత్సరాలు గడిపారు. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.
''ఎందుకు నన్ను అరెస్ట్ చేశారని పదేపదే పోలీసులను అడిగాను. వారు నా కుటుంబాన్ని పిలిపించారు. వారిని వివిధ రకాల ప్రశ్నలు వేశారు. ఏడాదిన్నర తర్వాతనే నా కుటుంబానికి నా గురించి తెలిసింది. వారికి చాలా భయం వేసింది'' అన్నారు బిర్జు.
''తొలుత నన్ను భండారా జైలులో ఉంచారు. ఆ తర్వాత గోండియ జైలు, అక్కడ్నుంచి 2018లో చంద్రపూర్ జైలుకు తరలించారు. అయితే, భద్రతా కారణాల వల్ల నన్ను అక్కడ ఉంచలేమని చెప్పి ఆ తర్వాత మూడు నెలలకు చంద్రపూర్ నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు'' అని బిర్జు చెప్పారు.
ఇలాంటి అనుమానంతో అరెస్ట్ అయిన వాడిని నేనొక్కడినే కాదు. నాలాంటి ఎంతోమంది ఎలాంటి నేరం చేయకుండా.. కేవలం అనుమానం కారణంగా ఏళ్ల తరబడి జైలులో గడుపుతున్నారని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Birju Pungati
‘నా భార్యను కూడా అరెస్ట్ చేశారు’
బిర్జు భార్య 30 ఏళ్ల పార్వతి సడ్‌మెక్ కూడా నక్సలిజం ఆరోపణలపై 2018లో అరెస్ట్ చేశారు. పార్వతిపై ఐదు కేసులు నమోదయ్యాయి. పార్వతిని నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడే ఆమె ఆరేళ్లు గడిపారు.
సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. 2025 అక్టోబర్‌లో ఆమెపై ఉన్న ఆరోపణలన్నింటిన్నీ కోర్టు కొట్టేసి, నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. అప్పట్నుంచి ఆమె ఆ గ్రామంలోనే నివసిస్తున్నారు.
''మొదట నేను జైలులో ఉన్నాను, ఆ తర్వాత నా భార్య. పెద్దవారైనా నా తల్లిదండ్రులు బాగా అలసిపోయారు. నా తండ్రి 2019లో చనిపోయారు. ఒత్తిడి కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దానివల్లే ఆయన కన్నుమూశారు'' అని బిర్జు అన్నారు.
పార్వతి అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా విడుదల కాగా, బిర్జుపై ఉన్న 49 కేసుల్లో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత నాగ్‌పూర్ హైకోర్టు ఆయనకు కూడా బెయిల్ మంజూరు చేసింది.
ఆయన 2025 ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చారు. చివరి కేసులో కూడా ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, Birju Pungati
'నా కుటుంబమంతా నాశనమైంది'
బిర్జు అరెస్ట్ తర్వాత..ఆయన కుటుంబం తరచూ పోలీసుల నుంచి విచారణను ఎదుర్కొంది. ఈ విషయం ఆయనే వెల్లడించారు.
''అనవసరమైన వేధింపులు, బెదిరింపులు, ఒత్తిడితో నా కుటుంబం కుప్పకూలింది. కానీ, సాయం చేయడానికి ఎవరూ లేరు. పేదల మాట ఎవరూ వినరు'' అని బిర్జు అన్నారు.
2012లో బిర్జును, 2018లో ఆయన భార్యను అరెస్టు చేయగా.. అదే సంవత్సరం బిర్జు తండ్రి మరణించారు. ఆ తర్వాత, ఆయన తల్లి, వితంతువైన సోదరి నిత్యం భయంతోనే బ్రతికారు. వారిద్దరూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు.
2025లో బిర్జు, ఆయన భార్య జైలు నుంచి బయటికి వచ్చారు. 13 ఏళ్ల తర్వాత వారిద్దరూ కలిసుండటం ఇదే మొదటిసారి. ఈ 13 ఏళ్లల్లో.. ఈ చీకటి ప్రపంచంలోనే వారి కలలు ఎన్నో కనుమరుగైపోయాయి. కానీ, ఇప్పుడు వారిద్దరూ ఒకటయ్యారు. ఎంతకాలం తాము కలిసి ఉంటామన్నదానిపై వారికి స్పష్టత లేదు. మరేదైనా అనుమానంతో తమను అరెస్టు చేస్తారేమోనన్న భయం వారిద్దరి మనసుల్లోనూ ఉంది.
మరోవైపు గడ్చిరోలి జిల్లాలో నక్సల్ కార్యకలాపాల పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని గడ్చిరోలి జిల్లా పోలీసులను ప్రశ్నించగా... భద్రతా కారణాల వల్ల ఈ సంఖ్యను బయటికి వెల్లడించలేమని చెప్పారు. 2005 నుంచి యూఏపీఏ కింద 45 నుంచి 50 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
''2005 నుంచి నక్సలైట్ కేడర్‌లో 819 మంది సభ్యులు లొంగిపోయారు. వారి పునరావాసానికి పోలీసు బలగాలే బాధ్యత వహించాయి. అయితే, అనుమానితులుగా అదుపులోకి తీసుకుని, నిర్దోషులుగా విడుదల చేసిన వారి కోసం ఎలాంటి ప్రభుత్వ పథకం లేదు" అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎం.రమేశ్ చెప్పారు.
ఈ వార్తకు సంబంధించి కొంతకాలం కిందట గడ్చిరోలి మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీలోత్పల్‌తో కూడా బీబీసీ మాట్లాడింది. "పోలీసులు ఏ అమాయకుడినీ అరెస్టు చేయరు. సామాన్య పౌరులను రక్షించడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవరినీ అనవసరంగా వేధించరు" అని అప్పుడు చెప్పారు.
న్యాయవాదులు ఏం చెబుతున్నారు?
"బిర్జుపై నక్సలైట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణ కింద ఐపీసీలోని సెక్షన్లు 302, 364, 143, 147, 148, 149, 120బీ, భారత ఆయుధాల చట్టంలోని 3/25, 27(3) సెక్షన్ల కింద... అన్నీ కలిపి 50 కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు గోండియాలో, 48 గడ్చిరోలిలో ఉన్నాయి. ఆయన సుమారు 13 సంవత్సరాలు జైలులో ఉన్నారు. ఆయన భార్య కూడా ఏడెనిమిది సంవత్సరాలు జైలులో ఉన్నారు. అయితే, 2025 అక్టోబర్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఆమెను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా విడుదల చేయడంతో, జైలు నుంచి విడుదలయ్యారు. బిర్జును కూడా అన్ని కేసుల నుంచి కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది" అని ఆయన న్యాయవాది జగదీశ్ మెష్రామ్ చెప్పారు.
''బిర్జు లాంటి చాలామంది అనుమానితులుగా సంవత్సరాల తరబడి జైలులో ఉన్నారు. కొందరిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేయగా, మరికొందరు ఇంకా తమకు న్యాయం దొరుకుతుందని జైలులో వేచిచూస్తున్నారు. పోలీసు-నక్సల్ ఎన్‌కౌంటర్లలో సామాన్య పౌరులు అనవసరంగా గాయపడుతున్నారు. గత 18 ఏళ్లలో నేను ఇలాంటి ఎన్నో కేసులను వాదించాను. ప్రస్తుతం నా దగ్గర బిర్జు కేసు లాంటివి 40 కేసులు ఉన్నాయి" అని మెష్రామ్ తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/SERAJ ALI
నిపుణులు ఏమంటున్నారు?
"ఏమీ తెలియని ఒక అమాయక వ్యక్తి కేవలం అనుమానం మీద 10 నుంచి 12 సంవత్సరాలు జైలులో ఉండి, ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల నిర్దోషిగా విడుదల అయితే, అటువంటి వ్యక్తులకు పరిహారం, పునరావాసం కల్పించడానికి చట్టంలో పటిష్టమైన నిబంధనలు ఉండాలి. ప్రస్తుతం, అటువంటి కేసుల కోసం కొన్ని చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. కానీ అవి సరిపోవు. అటువంటి వ్యక్తులకు తరచుగా కస్టడీలో ఉన్నప్పుడు బెయిల్ కూడా లభించదు. అందువల్ల, బెయిల్ పొందే ప్రక్రియను సులభతరం, మరింత సరళంగా చేయాలి" అని సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ అన్నారు.
''అంతేకాక, ఒక అమాయకుడిని సంవత్సరాల తరబడి అన్యాయంగా జైలులో పెట్టినట్లయితే, దానికి బాధ్యులైన అధికారులపై కూడా చర్య తీసుకోవాలి'' అని కోరారు.
''ఇలాంటి వారి పునరావాసం కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి. ఎందుకంటే, ఇన్నేళ్లు జైలులో గడపడం ఆ వ్యక్తిపైనే కాకుండా, వారి కుటుంబం మొత్తంపైనా ప్రభావం చూపుతుంది. ఆ కుటుంబం భయంతో జీవించాల్సి వస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తికి ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. ఎన్నో భవిష్యత్ అవకాశాలు చేజారిపోతాయి. ఈ కేసు వారి జీవితంపై చెరగని ముద్ర వేస్తుంది'' అని తెలిపారు.
''ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఇలాంటి కేసులు 3000కు పైగా ఉన్నాయి. అయితే, న్యాయ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉండటంతో ఈ కేసులు చాలాఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఇప్పుడు బస్తర్‌లో పరిస్థితి మెరుగుపడుతోంది. ఈ కేసులను త్వరగా పరిష్కరించి, అన్యాయంగా ఈ కేసుల్లో చిక్కుకున్న వారిని బయటపడేయాలి'' అని సామాజిక కార్యకర్త, పరిశోధకులు బెలా భాటియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నక్సలిజం పేరుతో జైలు నుంచి విడుదలైన ఒక వ్యక్తిని, ఆ వెంటనే మరో ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేయడం అదే తొలిసారి కాదు. వివిధ రాష్ట్రాల్లో చాలామంది అనుమానంతో ఏళ్ల తరబడి జైలులోనే ఉంటున్నారు.
2017లో, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పేరుతో సీఆర్‌పీఎఫ్ 121 మందిని అరెస్టు చేసింది. ఐదు సంవత్సరాల తర్వాత, వారందరినీ విడుదల చేశారు.
మధ్య భారతదేశంలో నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోందని, పోలీసు-నక్సల్ ఘర్షణల వల్ల సామాన్య ప్రజలు అనవసర ఇబ్బందులు పడాల్సి వస్తోందనే అనేక ఆరోపణలు ఉన్నాయి.
గత 25 ఏళ్లలో, వివిధ రాష్ట్రాల్లో నక్సల్-పోలీసు కార్యకలాపాల వల్ల జరిగిన హింసాకాండలో నాలుగు వేల మందికి పైగా మరణించారు .
' మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని 'పూర్తిగా నిర్మూలిస్తామని' కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా, ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రత్యేక ఆపరేషన్‌లు అమలు చేయడం ద్వారా నక్సలిజం నిర్మూలన దిశగా చర్యలు చేపట్టింది.
ఈ ఆపరేషన్‌లో భద్రతాదళాలు అనేకమంది నక్సలైట్లను హతమార్చడంలో విజయం సాధించాయి. వందలమంది నక్సలైట్లు లొంగిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























