అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ ఆరోసారి గెలుస్తుందా... ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరులో ఎవరిది పైచేయి?

    • రచయిత, మనోజ్ చతుర్వేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ప్రతీ ఏడాది ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్‌లో విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది.

ఉదయ్ ప్రతాప్ సహారన్ నేతృత్వంలోని భారత జట్టుకు ఛాంపియన్‌గా నిలవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

2012, 2018 ఫైనల్స్‌లో యువ భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఇది ఇండియాకు సానుకూలాంశం.

ఈ ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆడిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ మ్యాచ్‌లను చూసినా అభిమానులకు ఆదివారం జరిగే ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతుందని అంచనా.

ఇక ఫైనల్‌లో భారత్‌‌ను ఇబ్బంది పెట్టే వాళ్లలో ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ బెవాగన్, సీమర్ టామ్ స్ట్రాకర్ ముందుండొచ్చు.

కెప్టెన్ హ్యూ బ్యాటింగ్‌లో అదరగొడుతుండగా, పాకిస్థాన్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో బౌలర్ టామ్ 24 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్‌కు ఈ ఐదుగురే కీలకం

భారత్‌ ఆరోసారి టైటిల్‌ గెల్చుకోవడానికి సాగుతున్న పోరులో ఐదుగురు ఆటగాళ్ల పాత్ర కీలకం కానుంది.

వాళ్లే కెప్టెన్ సహారన్, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, పేస్ బౌలర్ రాజ్ లింబానీ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌమీ పాండే.

ఈ ఐదుగురు ఆటగాళ్లు భారత్‌ ప్రతి మ్యాచ్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేయడంలోనూ, ఉత్తమ బౌలింగ్‌తో మ్యాచ్‌లను గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ఎదురునిలిచే కెప్టెన్‌...

ఉదయ్‌ సహారన్‌ కెప్టెన్సీని ఎంత ప్రశంసించినా తక్కువే. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో మఫాకా విధ్వంసంతో భారత బ్యాటింగ్ పేకమేడలా కూలిపోతున్నట్లు కనిపించింది. అయితే, కెప్టెన్ సహారాన్ జట్టును ముందుండి నడిపించాడు.

సచిన్ దాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించి, ఒక్కసారి వికెట్‌పై నిలదొక్కుకుంటే విజయం దిశగా పయనించగలమని చూపించాడు.

రిస్క్‌లు తీసుకోకుండా ఆడటమే సహారాన్ ఆటలోని ప్రత్యేకత. ఈ ఛాంపియన్‌షిప్‌లో అతను అత్యధికంగా 389 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సహారన్ ఎల్లప్పుడూ సహాయక పాత్రలో ఉంటాడు, మిగతా బ్యాట్స్‌మన్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పిస్తాడు. బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌ మోహరించడంలోనూ సహారన్ తెలివితేటలు ప్రశంసనీయం.

పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ మార్పులూ చేస్తుంటాడు.

ముషీర్ ఖాన్.. సర్ఫరాజ్‌ఖాన్‌ సోదరుడు

తన సోదరుడు సర్ఫరాజ్‌ఖాన్‌ను చూసి క్రికెటర్‌గా మారిన ముషీర్‌ఖాన్‌కు చిన్నప్పటి నుంచి సవాళ్లను ఎదుర్కోవడమంటే ఇష్టం.

''ఆరేళ్ల వయసులో మా నాన్న, సోదరుడితో కలిసి క్రికెట్ నేర్చుకోవడానికి వెళ్లేవాడిని. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని స్వీకరించడం నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ముందుకు వెళ్లే మార్గం తెలుస్తుందని నాన్న చెప్పేవారు'' అని ముషీర్ ఖాన్ అన్నాడు.

ఈ విషయాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకుంటానని ముషీర్ ఖాన్ చెప్పాడు. ఈ టోర్నీలో అతను రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో 338 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు.

ముషీర్‌ఖాన్‌ బౌలింగ్ కూడా చేస్తాడు. ఈ టోర్నీలో ఆరు వికెట్లు తీశాడు. ముషీర్ నైపుణ్యాలను సరిగ్గా అధ్యయనం చేస్తే, అతను మంచి ఆల్ రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడగలడు.

ముషీర్ ఖాన్ ఇప్పటివరకు ముంబై తరపున మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, 96 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు.

సచిన్ దాస్‌లో 'టెండూల్కర్'

భారత జట్టు ఫైనల్స్ లో సచిన్ దాస్ పాత్ర కీలకం కానుంది. అతనెంత ముఖ్యమో సెమీస్ మ్యాచ్‌లో చూపించాడు. దక్షిణాఫ్రికాపై భారత్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

సచిన్ దాస్ వచ్చి కెప్టెన్ సహారన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించి భారత విజయానికి బాటలు వేశాడు. ఇందులో సచిన్ దాస్ 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 96 పరుగులు చేశాడు. దాస్ టెండూల్కర్‌లా స్ట్రోక్‌ ప్లే ఆడగలడు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో సచిన్ 73కు పైగా సగటుతో 294 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.

సచిన్ టెండూల్కర్ పేరు మీదనే సచిన్ దాస్ పేరు పెట్టారని చెబుతారు. దాస్‌ స్వస్థలం మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతం. కొడుకును క్రికెటర్‌ని చేసేందుకు తండ్రి అప్పులు చేసి మరీ ఆట స్థలం సిద్ధం చేశాడు.

సచిన్ దాస్ సిక్సర్లు కొట్టడంలో లోకల్‌గా చాలా పాపులర్. అతని ఆట చూసి ఒకసారి బ్యాట్‌ని కూడా తనిఖీ చేశారు.

దూసుకొచ్చిన రాజ్ లింబానీ

రాజ్ లింబానీ బౌలింగ్‌లో ఎక్కువగా పేస్ లేకపోయినా, బౌన్స్ కారణంగా అతని బంతిని బ్యాటర్లు ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది.

సెమీ-ఫైనల్స్‌లో రాజ్ మూడు వికెట్లు తీశాడు, మొత్తంగా ఈ టోర్నీలో 8 వికెట్లు మాత్రమే తీశాడు. రాజ్ లింబానీ ప్రపంచకప్ జట్టులో ఎంపికవుతాడని చాలామంది అనుకొని ఉండరు.

ఎందుకంటే నమన్ తివారీ, ఆరాధ్య శుక్లా, ధనుష్ గౌడలు అప్పటికే మెరుగైన ప్రదర్శనతో ముందున్నారు. కానీ ఆసియా కప్‌లో రాజ్ లింబానీ ప్రదర్శన అంతా మార్చేసింది.

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజ్ 13 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు, దీంతో ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు.

సౌమి పాండే మరో జడేజా

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు తీసుకురావడంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌమి పాండేది కీలక పాత్ర.

ఇప్పటివరకు 8.47 సగటుతో 17 వికెట్లు తీశాడు పాండే. అతని ఎకానమీ రేటు 2.44. పాండే బౌలింగ్ శైలి చూసి భవిష్యత్ రవీంద్ర జడేజా అంటూ పిలుస్తారు.

ఈ ఐదుగురు ఆటగాళ్లు నిలబడి కలబడితే టీమిండియాకు ప్రపంచకప్ టైటిల్ నల్లేరు మీద నడకే.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)