డొమినికన్ రిపబ్లిక్ నైట్‌క్లబ్ ప్రమాదంలో 98కి పెరిగిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, వానెస్సా బూషుల్టర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 98 మంది మరణించారని, 150 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు.
మృతుల్లో ఓ ప్రావిన్షియల్ గవర్నర్, మేజర్ లీగ్ బేస్ బాల్ మాజీ పిచర్ ఆక్టావియో డోటెల్ ఉన్నారు. 51 ఏళ్ల డోటెల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.
జెట్ సెట్ నైట్‌క్లబ్‌లో ప్రముఖ మెరెంగ్యూ గాయకుడు రూబీ పెరెజ్ నిర్వహిస్తున్న కన్సర్ట్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఆయన కూడా ఉన్నట్టు సమాచారం.


ఫొటో సోర్స్, Getty Images
సహాయక కార్యక్రమాల్లో 400 మంది సిబ్బంది
ప్రమాదస్థలంలో వందల మంది చిక్కుకుపోయారు. వారిని బయటకు తెచ్చేందుకు 400 మంది సహాయకసిబ్బంది శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కూలిపోయిన పైకప్పు కింద చిక్కుకున్న వారిలో చాలామంది బతికే ఉన్నారని తాను భావిస్తున్నట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (సీఓఈ) డైరెక్టర్ జువాన్ మాన్యుయెల్ మెండెజ్ అన్నారు.
శాంటో డొమింగోలో జెట్ సెట్ ప్రముఖ నైట్‌క్లబ్. సోమవారం సాయంత్రం మ్యూజిక్ కన్సర్ట్‌లను తరచుగా నిర్వహిస్తుంటుంది. రాజకీయ నాయకులు, అథ్లెట్లు, ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ కన్సర్ట్‌లకు హాజరవుతుంటారు.
బాధితుల్లో మోంటే క్రిస్టి ప్రావిన్స్ గవర్నర్ నెల్సీ క్రూజ్ కూడా ఉన్నారని అధ్యక్షుడు లూయిస్ అబినాదర్ తెలిపారు. ఆమె మాజీ బేస్ బాల్ ప్లేయర్.
ప్రమాదంలో మరణించిన డోటెల్ 1999 లో న్యూయార్క్ మెట్స్ తరపున ఆడటం ప్రారంభించాడు. 2013 వరకు హ్యూస్టన్ ఆస్ట్రోస్, ఓక్లాండ్ ఏ'స్, న్యూయార్క్ యాంకీస్, చికాగో వైట్ సాక్స్, డెట్రాయిట్ టైగర్స్ వంటి జట్లకు ఆడాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘పై కప్పు నుంచి ఏదో పడుతోంది’
క్లబ్ లోపల తీసిన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. రూబీ పెరెజ్ పాడుతుండగా.. కార్యక్రమానికి హాజరైనవారిలో కొందరు వేదిక ముందు కూర్చున్నారు. వెనక టేబుళ్ల దగ్గర కూర్చున్న కొందరు సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది. వేదిక పక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తి ''పైకప్పు నుంచి ఏదో పడిపోయింది'' అని చెప్పడం కనిపిస్తోంది. ఆయన వేలితో పైకప్పు చూపిస్తూ ఆ మాట చెబుతున్నారు.
ఆ వ్యక్తి చూపిస్తున్న వైపు రూబీ పెరేజ్ కూడా తలెత్తి చూస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
మరో 30 సెకండ్లలోపే...ఏదో గందరగోళం వినిపించింది. స్క్రీన్ నల్లగా మారిపోయింది. నాన్నా.. నీకేమయిందని అంటున్న ఓ మహిళ అరుపులు వినిపించాయి.
"అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ఆ సమయంలో క్లబ్ మొత్తం నిండిపోయి ఉందని రూబీ పెరెజ్ బ్యాండ్ సభ్యుల్లో ఒకరు స్థానిక మీడియాతో చెప్పారు.
ఇది భూకంపం అనుకున్నానని ఓ మ్యుజీషియన్ చెప్పారు.
శిథిలాలలో చిక్కుకున్న వారిలో తన తండ్రి కూడా ఉన్నారని రూబీ పెరెజ్ కుమార్తె చెప్పారు.
అధ్యక్షుడు అబినాదర్ బాధిత కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























