ఆంధ్రప్రదేశ్ టెన్త్, ఇంటర్ పరీక్షల వివాదం... కోవిడ్ సోకిన విద్యార్థులకు పరీక్షలెలా నిర్వహిస్తారన్న హైకోర్టు

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ వివాదస్పదం అవుతోంది. కరోనా ఉధృతి నేపధ్యంలో పరీక్షలు నిర్వహించవద్దని ప్రతిపక్షాలు, కొన్ని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అధికార పార్టీ మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్తోంది. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా విడుదలైంది.

పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను ఈరోజు (శుక్రవారం) విచారించిన ఏపీ హైకోర్టు, 'దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని' సూచించింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉన్నందును ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేయాలని చెప్పిన హైకోర్టు ఈ కేసును మే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

తల్లిదండ్రుల అందోళన...

పరీక్షలకు పంపితే కరోనా వస్తుందనే భయం. పంపకపోతే పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే అందోళన... ఈ రెండింటి మధ్య ఎటూ తేల్చుకోలేకపోతున్నామని పేరెంట్స్ అంటున్నారు.

"ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కింటి వాళ్లు పంపిస్తే, అప్పుడు మనమూ పంపిద్దామన్నట్లుగా ఆలోచించాల్సి వస్తోంది. అదే ప్రభుత్వమే పరీక్షలు రద్దు, వాయిదా వంటి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ ఒకటే వర్తిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పరీక్షలు ముఖ్యమే. కానీ, పిల్లల ప్రాణాలకంటే మాత్రం కాదు. అంతా బాగుంటే... రానున్న రోజుల్లో ఎక్కువ గంటలు చదవించడమో...సెలవులు లేకుండా బడులు పెట్టడమో ఏదో ఒకటి చేసి సిలబస్ పూర్తి చేయవచ్చు. అంతేకానీ తీవ్రమైన భయాందోళనలు ఉన్నసమయంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తామని పట్టుబట్టడం మాత్రం తల్లిదండ్రులుగా మాకు తీవ్రమైన అందోళన కలిగిస్తోంది. ఎటు తేల్చుకోలేకపోతున్నాం" అని ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఫణీంద్రరెడ్డి చెప్పారు.

'మేనమామా... కంస మామా?'

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా కూడా ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తామని మొండిగా ముందుకు మంచిది కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు పేరు చెప్పి వారి ప్రాణాలను సీఎం జగన్ ఫణంగా పెడుతున్నారంటూ విమర్శించారు. కరోనాతో వయసులతో తేడా లేకుండా ప్రాణాలు పోతుంటే... అదేమీ పట్టించుకోకుండా సీఎం జగన్ పరీక్షల పేరుతో 15 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని లోకేష్ విమర్శించారు. అలాగే పరీక్షల రద్దు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో అన్ లైన్ సమావేశాలు కూడా నిర్వహించారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. పరీక్షలు రద్దు చేసి పిల్లలతో మా మేనమామ అనిపించుకుంటారో...పరీక్షలు నిర్వహించి కంసమామ అని పించుకుంటారో సీఎం నిర్ణయించుకోవాలి." అంటూ ట్వీట్ చేశారు.

5 లక్షల ప్రాణాలతో చెలగాటం...

కొన్ని ఉపాద్యాయ సంఘాలు సైతం పరీక్షలు రద్దు చేయడమో, లేదా వాయిదా వేయడమో మంచిదని అంటున్నాయి. రాష్ట్రంలో కరోనా సమయంలో 130 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వం ఆ విషయం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంటూ విశాఖ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు జి. చినబ్బాయి బీబీసీతో చెప్పారు.

"ప్రతి విద్యార్థికి పరీక్షలు, కెరియర్ చాలా ముఖ్యం, కానీ ప్రాణాలకంటే మాత్రం కాదు. ప్రాణాలు పోయిన తరువాత పాసులు, ర్యాంకులు వలన ఉపయోగం ఏముంటుంది. కనీసం కరోనా వస్తే బెడ్లు, ఆక్సిజన్, మందుల ఏర్పాట్లు కూడా సరిగా లేవు. ఈ సమయంలో పది, ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న 16 లక్షల మంది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, వారికి పాఠాలు చెప్పేవారు అంతా కూడా హై రిస్క్ లో ఉన్నట్లే లెక్క. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను ఉపయోగించడం వల్లనే వందల్లో ఉపాధ్యాయులు కరోనాకు బలయ్యారు. కనీసం టీచర్లుకు వ్యాక్సీన్ కూడా ఇవ్వలేదు. అందువలనే టీచర్ల ద్వారానే పిల్లలకు కరోనా వచ్చి ఉంటుంది" అని చినబ్బాయి చెప్పారు.

పరీక్షలు రద్దు చేయడం కుదరకపోతే...కనీసం మూడు, నాలుగు నెలలైనా వాయిదా వేయాలి. దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించడం లేదు. ఆర్మీ, నేవీలలో ఉద్యోగాలకు వెళ్లేది ఎంత మంది...? వారిలో వాటికి సెలెక్టయ్యేది ఎందరు...? ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఉద్యోగాల పేరు చెప్పి పరీక్షలు నిర్వహించడం తగదు. ముఖ్యంగా పది, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు... కచ్చితంగా పేరెంట్స్ అసోసియేషన్స్, ఉపాధ్యాయ ఎమ్మేల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి. అటువంటివి కూడా చేయలేదు. ఇప్పుడున్న స్థితిలో పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని చినబ్బాయి అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసమే...

ఆంధ్రప్రదేశ్ లో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర విమర్శలు వస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహించి తీరుతామనే స్పష్టం చేస్తోంది. దీనిపై ఏపీ సీఎం కూడా మాట్లాడారు.

"పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధుల భవిష్యత్తుకు నష్టం. విద్యార్ధుల భవిష్యత్‌ గురించి నా కంటే ఎక్కువగా ఎవరూ ఆలోచించరు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే భవిష్యత్తులో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారు. ఆర్మీ, నేవీ వంటి సర్వీసుల్లో...కొన్ని ఉద్యోగాలకు అర్హత కోల్పోతారు. పరీక్షల నిర్వహణపై అన్ని రాష్టాల్లో ఒ‍కే విధానం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణను బాద్యతగా తీసుకుంటాం. పరీక్షల నిర్వహణపై రాజీ పడేది లేదు." అని సీఎం జగన్ స్ఫస్టం చేశారు.

పరీక్షలపై చర్చలు మంచిది కాదు...

పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతుందో అర్థం కావడం లేదు. ఎటు చూసినా కరోనా చుట్టుముడుతున్న సమయంలో విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం కూడా సాధ్యం కాదు. మంచి వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తే మంచింది అని ఏయూ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు చెప్పారు.

"ఈ పరీక్షలు నిర్వహించాల వద్దా అన్న అంశంపై పత్రికలు, టీవీలలో విపరీతమైన వార్తలు రావడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో చదవాలా... వద్దా అనే ఆలోచనలతో పిల్లల సమయం వృధా అవుతుంది. ఒక వేళ చదివినా సరిగా దృష్టి పెట్టలేరు. చదివే విద్యార్థికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాగానే చదువుతాడు, పరీక్షలు బాగా రాస్తాడు. కానీ పరీక్షలు నిర్వహణపై అనుమానాలు వస్తే...యావరేజ్ విద్యార్థులపై ప్రభావం ఎక్కువ పడుతుంది. వారు ఇటు చదవలేక, అటు మానలేక సతమతమవుతారు. అయితే, పిల్లలు మాత్రం పరీక్షల సమయంలో పాజిటివ్ అటిట్యూడ్ తోనే ముందుకు వెళ్లాలి. తల్లిదండ్రులు వారిని ఆ విధంగానే ప్రొత్సహించాలి." అని ప్రొఫెసర్ రాజు బీబీసీకు తెలిపారు.

కోవిడ్‌తో పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించిన హై కోర్టు

ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హై కోర్టు, "ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలి" అని వ్యాఖ్యానించింది.

దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలని సూచించిన హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను మే మూడో తేదీకి వాయిదా వేసింది.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపున న్యాయవాదిని హై కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. కోవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు..? నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా? అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించినప్పుడు, వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది సమాధానం చెప్పారు.

అయితే, అదెలా సాధ్యం...? కోవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? అని తిరిగి ప్రశ్నించింది. ఈ కేసును మే మూడో తేదీకి వాయిదా వేస్తున్నామని, అదే రోజు ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయడాన్ని, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.

తన పిల్లలను జగన్ పంపిస్తారా...? - కెఏ పాల్

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు కోరుతూ విశాఖలో కేఏ పాల్ దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఈ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పరీక్షల రద్దు విషయంపై విచారణను హై కోర్టు మే మూడో తేదీకి వాయిదా వేసిందని తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

"ఈ సమయంలో ఏవరైనా పరీక్షలు నిర్వహిస్తారా? విద్యాశాఖ మంత్రి మాటను సీఎం జగన్ వినవద్దు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి? జగన్ తనసొంత కూతుళ్లను కోవిడ్ హాల్లోకి పరీక్షలు రాయడానికి పంపిస్తారా? నేను చేస్తోన్న దీక్షకు, జీవించి వుంటే రాజశేఖర్ రెడ్డి వచ్చి ఉండేవారు. మే 3 న జరిగే విచారణలో పరీక్షలు వాయిదా పడతాయనే విశ్వాసం నాకు ఉంది. అప్పటి వరకు ఆమరణ దీక్షను కొనసాగిస్తాను‌‌‌" అని కేఏ పాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)