సౌమిత్ర ఛటర్జీ: కోవిడ్‌తో చనిపోయిన ప్రఖ్యాత బెంగాలీ నటుడు

ప్రచురణ

ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కోవిడ్‌-19తో చనిపోయారు. ఆస్కార్ అవార్డు గెల్చుకున్న దర్శకుడు సత్యజిత్ రేతో కలిసి అనేక చిత్రాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న సౌమిత్ర వయసు 85 ఏళ్లు.

ఆయన అక్టోబర్ 6న కోవిడ్ చికిత్స కోసం కోల్‌కతాలోని ఆస్పత్రిలో చేరారు. నెలరోజులకు పైగా కోవిడ్‌తో పోరాడి చివరకు ఆదివారం తుదిశ్వాస విడిచారు.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో 300లకు పైగా చిత్రాల్లో నటించిన సౌమిత్ర ఛటర్జీ మృతి సినిమా అభిమానులను విషాదంలో ముంచెత్తింది. నాటక కర్త, రంగస్థల నటుడు, కవి కూడా అయిన సౌమిత్ర ఛటర్జీ 'శ్రేష్ఠ కవిత' అనే సంకలనాన్ని కూడా ప్రచురించారు.

ఆసుపత్రిలో చేరిన కొన్ని వారాలకు ఆయన కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కానీ అక్టోబరు చివరి వారంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించాల్సిన పరిస్థితికి ఆయన వచ్చారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన సత్యజిత్ రే చిత్రాల్లో సౌమిత్ర నటించారు. సత్యజిత్ రే తీసిన 'అపూ' సిరీస్‌లో మూడవది, అఖరుదీ అయిన 'అపూర్ సంసార్' (1959)తో సౌమిత్ర సినీ జీవితం మొదలైంది. ఒక బెంగాలీ గ్రామంలో పుట్టి పెరిగిన ఒక యువకుడి జీవితం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ''అపూ'' సిరీస్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి చాలా అవార్డులు వచ్చాయి. ప్రపంచ చిత్ర పటంలో భారత సినిమాకు ఇవి ఒక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

అపూ సంసార్ చిత్రం తర్వాత సత్యజిత్ రే తీసిన 14 సినిమాల్లో సౌమిత్ర నటించారు.

''చాలా భిన్నమైన పాత్రల్లో సౌమిత్ర నటించారు. కొన్ని పాత్రల్లో అయితే, నటించింది ఆయనేనా? అని మనం ఆశ్చర్యపోతాం. ఆయన ఒంటరిగానే సినిమాను రక్తికట్టించగలరు'' అని అమెరికాకు చెందిన ప్రముఖ సినిమా విశ్లేషకుడు పాలిన్ కీల్ వ్యాఖ్యానించారు.

అత్యుత్తమ భారత సినిమా అవార్డు దాదా సాహెబ్ ఫాల్కెను 2012లో సౌమిత్ర అందుకున్నారు. 2018లో అత్యుత్తమ ఫ్రాన్స్ అవార్డు లీజియన్ ఆఫ్ హానర్‌ను కూడా ఆయన అందుకున్నారు.

పాఠశాలలో ఉన్నప్పుడే సౌమిత్ర నటనను మొదలుపెట్టారు. స్కూలు నాటక ప్రదర్శనల్లో ఆయన నటించేవారు. కాలేజీ సమయంలో తన స్నేహితుల్లో ఒకరు ఆయన్ను సత్యజిత్ రేకు పరిచయం చేశారు. ఈ పరిచయమే వీరి తొలి సినిమాకు బాటలు పరిచింది.

''రే నన్ను అడిగినప్పుడు ఏం చేయాలో అర్థంకాలేదు. స్టేజ్‌పై నాటకాలు వేయడానికి, తెరపై నటించడానికి మధ్య తేడా కూడా నాకు తెలియదు. కొంచెం అతిగా నటిస్తానేమోనని నాకు భయం వేసింది''అని సినీ విమర్శకుడు మేరీ సేటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమిత్ర చెప్పారు.

భిన్న పాత్రల్లో ఒదిగిపోయేలా సౌమిత్రకు రే అవకాశాలు ఇచ్చారు. సోనార్ కెల్లా సినిమాలో షెర్లాక్ హోమ్స్ తరహా డిటెక్టివ్ పాత్రను, దేవిలో కొత్త పెళ్లికొడుకులా, అభిజాన్‌లో ఉత్తర భారత దేశ ట్యాక్సీ డ్రైవర్‌లా, అసనీ సంకేత్‌లో గ్రామ పూజారిలా సౌమిత్ర జీవించారు. రబీంద్రనాథ్ ఠాగూర్ రచన, రే దర్శకత్వంలో వచ్చిన చారులత సినిమాతో విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు.

రేకు బాగా నచ్చిన నటుల్లో సౌమిత్ర ఒకరు. సౌమిత్రకు రే చాలా సినిమా పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. కోల్‌కతాలో ఆదివారం హాలివుడ్ సినిమా మార్నింగ్ షోలకు వీరిద్దరూ కలిసి వెళ్లేవారు. ''ఆయన అన్ని పనులకు ఒక లక్ష్యం ఉంటుంది. మేం ఏదో సరదాగా గడిపేందుకు సినిమాకు వెళ్లేవాళ్లం కాదు'' అని సౌమిత్ర ఒకసారి వివరించారు.

సౌమిత్ర మంచి ప్రతిభ కల నటుడని రే చెప్పేవారు. ''రేను గుర్తుచేసుకోని రోజంటూ ఉండేది కాదు. ఆయన నా జీవితంలో అంత భాగమైపోయారు. ఆయన్ను తలచుకుంటే వెంటనే నాలో స్ఫూర్తి నిండుతుంది'' అని ఒక ఇంటర్వ్యూలో సౌమిత్ర చెప్పారు. 1992లో రే మరణించారు.

ప్రముఖ బెంగాలీ ప్రేమ కథా చిత్రాల్లోనూ సౌమిత్ర నటించారు. అయితే, తోటినటుడు ఉత్తమ్ కుమార్‌తో పోల్చినప్పుడు సౌమిత్ర నటించిన ప్రేమ కథా చిత్రాలు కాస్త తక్కువేనని విమర్శకులు చెబుతుంటారు.

ప్రముఖ డైరెక్టర్లు అయిన తపన్ సిన్హా, మృనాల్ సేన్, అసిత్ సేన్, అజోయ్ కర్, రీతుపర్ణో ఘోష్, అపర్ణ సేన్ సినిమాల్లోనూ సౌమిత్ర నటించారు.

''సౌమిత్రలో తెరపై బెంగాలీ కళ ఉట్టిపడేది. మధ్యతరగతి యువకుల పాత్రల్లో ఆయన ఒదిగిపోయేవారు. చాలా సున్నితంగా ఆయన కనిపిస్తారు'' అని భారత సినీ ప్రముఖుల్లో ఒకరైన అదూర్ గోపాల్‌కృష్ణన్ వ్యాఖ్యానించారు.

సినిమాలతోపాటు రచనల్లోనూ సౌమిత్రకు ప్రావీణ్యముంది. ఒక సాహిత్య మ్యాగజైన్‌ను ఆయన నడిపించారు. కవిత్వాలు, వ్యాసాలకు సంబంధించి 30కిపైగా పుస్తకాలను ఆయన ప్రచురించారు. కొన్ని నాటకాల్లో నటించడంతోపాటు వాటి రచన బాధ్యతలూ ఆయనే భుజాలపై వేసుకున్నారు. పెయింటింగ్ కూడా వేసేవారు.

అయితే, సౌమిత్ర బాలీవుడ్‌ను దూరం పెడుతూ వచ్చారు. బెంగాలీ సినిమాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)