తెలంగాణ: ప్రజాకవి గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రజాకవి గోరటి వెంకన్న, మాజీమంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజ్ సారయ్య, వాసవి సేవా కేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపిందని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

అనంతరం వారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అభ్యర్ధుల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగానే వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో ఎక్స్అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకోనున్నారని తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంటూ ఈ కథనంలో తెలిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 'ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేని సామాజిక వర్గాలకు సాధ్యమైనంతమేరకు రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశమిస్తున్నాం' అని చెప్పినట్లు ఈ కథనంలో తెలిపారు.

వైఎస్సార్‌ బీమా పథకం...ఆపద రోజే రూ.10 వేల తక్షణ సాయం

ఇంటిని పోషించే పెద్ద చనిపోవడం వంటి కారణాలతో ఆ కుటుంబం ఆనాధగా మారకూడదన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ బీమా పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆపద సమయంలో అదే రోజు లబ్ధిదారుని కుటుంబానికి రూ.10 వేలు తక్షణ సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సాక్షిలో ఒక కథనం ప్రచురించారు.

ఈ మేరకు వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలతో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న వారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు.

లబ్ధిదారుని పరిధికి సంబంధించిన వలంటీర్‌ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఈ పథకం కోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుంటారు. పరిశీలన పూర్తికాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్, సంబంధిత వలంటీర్‌.. ఇద్దరు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి రూ.10 వేలు చెల్లిస్తారని ఈ కథనంలో తెలిపారు.

వలంటీర్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో వైఎస్సార్‌ బీమా కాల్‌ సెంటర్‌ ద్వారా సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్లకు సమాచారం తెలియజేసి ఈ సేవలు అందజేస్తారు. ఇందుకు వీలుగా ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఈ పథకం కోసం రూ.20 వేల చొప్పున డిపాజిట్‌ చేస్తారు. సాధారణ మరణం అయితే ఆ కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో, ప్రమాదవశాత్తు మరణం అయితే 21 రోజుల వ్యవధిలో లబ్ధిదారుని నామినీకి ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందజేసే ప్రక్రియకు సంబంధించి వలంటీర్‌ తోడ్పాటు అందిస్తారు. ప్రమాదం జరిగి లబ్ధిదారుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితులలో ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా లబ్ధిదారునికి అందాల్సిన సాయం 55 రోజుల్లో క్లెయిమ్‌ రూపంలో అందించడానికి వలంటీర్, సచివాలయ సిబ్బంది తోడ్పడతారు.

జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్సార్‌ బీమా కాల్‌ సెంటర్లు ఆ జిల్లా పరిధిలో క్లెయిమ్‌ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, సెర్ప్‌ సీఈవో కన్వీనర్‌గా, పది శాఖల ఉన్నతాధికారులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.

ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై క్లెయిమ్‌ల పరిస్థితిని సమీక్షిస్తుంది. జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతి నెల 5వ తేదీలోపే ఆ జిల్లాకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందని ఈ కథనంలో పేర్కొన్నారు.

పీఠాధిపతులకు ప్రత్యేక మర్యాదలు....ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు

ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్ని వ్యక్తిపూజలకు నిలయాలుగా మార్చేలా ప్రభుత్వ ఆదేశాలున్నాయంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాలల్లో పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి ఏపీలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల స్వరూపానంద, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు.

ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికాడంపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నుంచి ప్రభుత్వం బయటపడకముందు ఇప్పుడు కూడా స్వరూపానంద విషయంలో మరో వివాదాస్పద ఆదేశాలు చేసి ప్రభుత్వం అభాసుపాలయిందని ఆ వార్తలో రాసారు.గతంలో కూడా శ్రీవారి దర్శనానికి వచ్చిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు... ఏకంగా అలిపిరికి వెళ్లి మరీ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే... ఎంత పెద్ద పీఠాధిపతి అయినా, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతిలాంటి ప్రముఖలకైనా తిరుమలలోనే అధికారులు స్వాగతం పలుకుతారు. అదే ఆచారం, సంప్రదాయం! కానీ... స్వరూపానందకు టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పలువురు జిల్లా అధికారులు అలిపిరి వద్దే స్వాగతం పలికారు.

మఠాధిపతులు, పీఠాధిపతులను గౌరవించడం మన సంప్రదాయం. అంతేకానీ... సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించడం ఆపచారం. అధికారులు భక్తులకు సేవకుల్లా ఉండేలా తప్పా రాజకీయ పార్టీ నాయకుల్లా వ్యహరించడం బాధ్యతా రాహిత్యమనే విమర్శలు వెల్లువెత్తాయని ఈ కథనంలో పేర్కొన్నారు.

ధన్‌తేరస్‌ కు ఊపందుకున్న బంగారం అమ్మకాలు

హైదరాబాద్‌లో ధన్‌తేరస్‌కు జువెల్లరీ షాపులు తళుక్కుమన్నాయి. ఎనిమిది నెలల తర్వాత ఒక్కసారిగా కస్టమర్లతో దుకాణాలు కిటకిటలాడాయంటూ సాక్షి ఒక కథనంలో తెలిపింది.

కోవిడ్‌-19 కారణంగా తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న బంగారు, వెండి ఆభరణాల మార్కెట్‌ కోలుకుంటుందా అన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో విక్రేతలు కాస్త ఉపశమనం పొందారు. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 30-50% నమోదైనట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. గతం కంటే అమ్మకాలు తగ్గినప్పటికీ, కోవిడ్‌ ప్రభావం నుంచి కాస్త కోలుకోవడం శుభపరిణామం అని విక్రేతలు అంటున్నారు. ఈసారి ధన త్రయోదశికి పుత్తడి కంటే వెండివైపే కస్టమర్లు మొగ్గు చూపారు. మొత్తం అమ్మకాల్లో పసిడి వాటా 30 శాతమేనని విక్రేతలు అంటున్నారని ఈ కథనంలో తెలిపారు.

హైదరాబాద్‌ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.52,600 పలికింది. సోమవారం ఈ ధర రూ.53,900 దాకా వెళ్లింది. ధర కాస్త తగ్గడం కస్టమర్లకు కలిసి వచ్చిందని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)