You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: జ్వరం మాత్రలు కావాలా... అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాల్సిందే – ప్రెస్ రివ్యూ
తెలంగాణలో ఇక నుంచి జ్వరం మాత్రలు కొనేవారు వారి ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్ కచ్చితంగా మెడికల్ షాపు వారికి ఇవ్వాల్సి ఉంటుందంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.
ఇప్పటి దాకా జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలొస్తే.. వైద్యుడి దగ్గరకు వెళ్లకుండానే దగ్గర్లోని మెడికల్ షాపుల్లో పారాసిటమాల్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఇకపై వివరాలు ఇవ్వనిదే ఆ మాత్రలను విక్రయించరు. ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్లర్లకు మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇవే ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని మెడికల్ దుకాణాలకూ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఫీవర్ సర్వైలెన్స్‌ను నిర్వహిస్తూ.. ప్రతి గ్రామంలో జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని భావించిన సర్కారు.. మెడికల్ దుకాణాల నుంచే జ్వరపీడితుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది.
చాలా మందిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉంటున్నా.. వారు పరీక్షలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారు మెడికల్ దుకాణాల్లో జ్వరానికి పారాసిటమాల్, గొంతునొప్పికి అజిత్రోమైసిన్ లాంటి మెడిసిన్‌ను సొంతంగా తీసుకొని, వాడుతున్నారు.
కొందరు కరోనా బారినపడ్డా.. పరీక్షలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. అందుకే మెడికల్ షాపులవద్దకు వచ్చి.. ఈ మందులు అడిగే ప్రతివారి వివరాలను తెలపాలని ఆదేశించింది.
ఉద్యోగులను తొలగించొద్దు: కేటీఆర్
కరోనావైరస్ సవాలును అందరం కలిసి ఎదుర్కోవాలని, ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించొద్దని వివిధ పరిశ్రమలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చాప్టర్ సభ్యులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ సంభాషించారు. పారిశ్రామిక వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేస్తూ లేఖ కూడా రాశారు.
లే ఆఫ్‌లు లేకుండా ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అవసరమైతే కంపెనీలు ఇతర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. నమ్మకం, భరోసా ద్వారానే లాక్‌డౌన్ తర్వాత కూడా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్ సీఐఐ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సంక్షోభంలో పారిశ్రామిక రంగానికి అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో హెల్త్‌కేర్, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఐఐ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి సహకారం అందించాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు.
చల్లటి మనసుకు ఏపీ పోలీసుల సెల్యూట్
మండుటెండలో విధుల నిర్వర్తిస్తున్న పోలీసుల కోసం కూల్ డ్రింక్స్ కొనితెచ్చిన ఓ మహిళ ఔదార్యానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ నవాంగ్ ‘సెల్యూట్’ చేసినట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
లోకమణి అనే మహిళ విశాఖ జిల్లా శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఆయాగా పనిచేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం మండుటెండలో లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను చూసి చలించిపోయిన ఆమె, రెండు లీటర్ల కూల్‌డ్రింక్ సీసాలు రెండు కొని వారికి ఇవ్వబోయారు. పోలీసులు ఆమె వివరాలు తెలుసుకుని.. ఆమె చూపిన ప్రేమాభిమానాలను మెచ్చుకుంటూనే.. సున్నితంగా తిరస్కరించారు.
ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఈ వీడియో చూసి కదిలిపోయారు. ఆమె ఔదార్యానికి సెల్యూట్ చేశారు.
శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా తుని పోలీసుల సమక్షంలో లోకమణితో డీజీపీ స్వయంగా మాట్లాడారు.
‘‘నమస్కారం లోకమణి అమ్మా.. మీ వీడియో క్లిప్పింగు చూసి చలించిపోయా. మీ అమ్మతనం ఎంతగానో కదిలించింది. పోలీసు సిబ్బందికి కూల్‌డ్రింకు బాటిళ్లు ఇవ్వడం చూసి మీకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆరోజే అనుకున్నా. రాత్రీపగలూ మీ రక్షణ కోసమే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మీరు చూపిన ప్రేమకు సెల్యూట్ చేస్తున్నా’’ అంటూ ముగించారు.
ఇవి కూడా చదవండి.
- కోవిడ్-19 నుంచి కోలుకునేందుకు ఎన్నాళ్లు పడుతుంది
- కరోనావైరస్ సోకిన ఇండియన్ నేవీ సిబ్బంది ఎక్కడున్నారు.. వారికి ఎలా సోకింది
- హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
- సంతానోత్పత్తి కేంద్రాల మూసివేత.. తల్లులు కాలేమేమోనని భయపడుతున్న మహిళలు
- కరోనావైరస్కు ఆఫ్రికా తదుపరి కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించిన WHO
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)