You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాక్‌డౌన్ గురించి ఏం చెప్పింది? - ప్రెస్ రివ్యూ
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానిని అభ్యర్థిస్తూ ప్రస్తావించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలో ఉన్న విషయాల గురించి ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ ఎప్పుడు ప్రకటించారు? ఆయా దేశాల్లో రోజుకు ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి? యాక్టివ్ కేసులు ఎన్ని? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. వీటన్నింటి ఆధారంగా ఆయా దేశాల్లో కేసుల సంఖ్య పతాక స్థాయికి ఎప్పుడు చేరుకుంటాయి? లాక్‌డౌన్ నిబంధనలు ఏ తేదీ నుంచి ఎత్తేయొచ్చు? అన్న అంశాలపై అంచనాలను సిద్ధం చేసింది.
గత నెల 25 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు రోజురోజుకూ మారిపోతున్న నేపథ్యంలో తమ నివేదికను వైద్యం, భద్రతలకు సంబంధించిన సలహా సూచనలుగా పరిగణించరాదని, ప్రత్యామ్నాయాలుగానూ చూడరాదని తెలిపింది.
భారత్‌లో కరోనా కేసులు జూన్ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేసింది. నివేదికలో సూచించిన గ్రాఫ్ ప్రకారం జూన్ మూడో వారం నాటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతాయి.
చైనాలో మాదిరిగా కరోనా కారణంగా పదో మరణం సంభవించిన రోజున భారత్ లాక్‌డౌన్ ప్రకటించిందని, చైనాతో పాటు, బెల్జియం, పోలండ్ వంటి దేశాలు సైతం దాదాపు ఇదే స్థితిలో లాక్‌డౌన్ ప్రకటించాయని తెలిపింది.
లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ.. ఇందుకోసం తాము చైనాలోని హుబే, వూహాన్ ప్రాంతాల్లో ఏ సమయంలో లాక్‌డౌన్ ఎత్తి వేశారన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. దీంతో పాటు వైరస్ బారినపడ్డ వారిని సమర్థంగా ఐసోలేషన్‌లో ఉంచగల సామర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్‌లో జూన్ ఆఖరు నుంచి సెప్టెంబర్ రెండో వారం మధ్యలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా వేసింది. భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుంటే లాక్‌డౌన్‌ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది.
సీఎం కేసీఆర్ ఈ నివేదిక ఆధారంగానే విలేకరుల సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపునకు తన మద్దతు ప్రకటించారు.
దాపరికాలు ఎందుకు?: ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రశ్న
రోజువారీ విడుదల చేసే కరోనా బులెటిన్‌లో పరీక్షల వివరాలను పూర్తిస్థాయిలో ఎందుకు బహిర్గతం చేయడంలేదని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.
‘‘వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 222% పెరుగుదల నమోదైతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1,021%గా ఉంది. ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాస్తవాలను కప్పిపుచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజూ ఎన్ని కరోనా పరీక్షలు చేస్తున్నారు? ఎంతమందికి వైరస్ సోకిందో చెప్పాలి’’ అని డిమాండు చేశారు.
‘‘ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి జీతాలు చెల్లించాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ వారి జీతాల్లో 50% కోత పెట్టారు. కాంట్రాక్టర్లకేమో రూ.6వేల కోట్లు చెల్లించారు. దీన్నెలా సమర్థించుకుంటారు’’ అని నిలదీశారు.
‘‘కర్నూలులో దిల్లీకి వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి చనిపోయారు. ముందు పరీక్షించినప్పుడు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అంటే కేసులు సక్రమంగా నమోదు కానట్టే కదా? మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తి విందు ఇస్తే.. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని 26 వేల మందిని క్వారంటైన్‌లో పెట్టారు. అలాంటి జాగ్రత్తలు ఇక్కడా తీసుకోవాలి’’ అని సూచించారు.
‘‘మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోదీ మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం మాత్రం ఎవరితో మాట్లాడటం లేదు. ప్రభుత్వం కుటుంబానికి రూ.వెయ్యి ఇస్తుంటే.. వైకాపా నేతలు పోయి ఆ డబ్బు పంపిణీ చేయడమేమిటి? ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉన్నప్పుడు గుంపులుగా పోవడం, ప్రారంభోత్సవాలు చేయడం, పింఛన్లు పంచడం లాంటివి చేస్తున్నారు’’ అని ఆక్షేపించారు.
మతం కారణంగా కరోనా పెరిగిందనే భావనతో కొందరిని సమాజానికి దూరం చేయకూడదని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని దూరంగా పెట్టి, అంటరానివారిగా, అమానుషంగా ప్రవర్తించడం సరికాదని, వారు మన కుటుంబసభ్యులు, బంధువులూ కావచ్చని పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తికి మతం రంగు రుద్దొద్దు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని, దీనికి కొందరు మతం రంగు రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.
విపత్కర సమయంలో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని ఉత్తమ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు వెంటనే బియ్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల పేద కుటుంబాలు ఉంటే కేవలం 22 లక్షల మందికే బియ్యం అందాయని తెలిపారు. పేదలకు ఇస్తామన్న రూ.1500 అందలేదని, వలస కార్మికులకు ఇస్తానన్న బియ్యం, రూ.500 సాయం కూడా అందలేదని పేర్కొన్నారు.
ప్రజలతో ఉంటూ వారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవాలని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న బియ్యం ఇంకా తెలంగాణకు రాలేదని, ఉజ్వలతోపాటు దీపం పథకం కింద ఉన్న లబ్ధిదారులకూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కోరారు. కాగా.. కరోనా బాధితుల సహాయార్థం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ను ఉత్తమ్ పరిశీలించారు.
ఇవి కూడా చదవండి.
- అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్
- లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్... ఈ భూమి మీద ఒక ఆదిమ జాతిని సమూలంగా నాశనం చేస్తుందా?
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)