మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
‘‘ఆర్థిక స్వావలంబన సాధించిన కుటుంబాల్లో, సమాజంలో మహిళల స్థితి బలోపేతం అవుతోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలని నేను దేశ ప్రజలను కోరుతున్నా’’ అని ద్రౌపది ముర్ము పిలుపు ఇచ్చారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, President of India
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజలకు ఆమె స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
భారత దేశంలో మహిళల ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
‘‘ఆర్థిక స్వావలంబన సాధించిన కుటుంబాల్లో, సమాజంలో మహిళల స్థితి బలోపేతం అవుతోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలని నేను దేశప్రజలను కోరుతున్నా. మన చెల్లెళ్లు, కూతుళ్లు అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కోవాలి, జీవితంలో మరింత ముందుకెళ్లాలి’’ అని ద్రౌపది పిలుపు ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యాలను, మానవతా సహకారాన్ని ప్రోత్సహించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్న రాష్ట్రపతి, ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాయని ప్రస్తావించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడలేకపోయిందన్నారు.
భారత్ కొత్త తీర్మానాలతో అమృత కాలంలోకి ప్రవేశించదని ద్రౌపది చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
లఖీంపుర్ ఖీరీ: దళిత మైనర్ అక్కాచెల్లెళ్లను రేప్, హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాలో నిరుడు ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.
సాక్ష్యాలను ధ్వంసం చేసిన మరో ఇద్దరు నిందితులను దోషులుగా గుర్తించి వారికి ఆరేళ్ల చొప్పున జైలు శిక్ష వేసింది.
ఈ తీర్పుపై వారు హైకోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.
నిరుడు సెప్టెంబర్‌లో ఇద్దరు దళిత మైనర్ బాలికల మృతదేహాలు లఖీంపుర్ ఖీరీ జిల్లాలో ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
ఈ క్రూరమైన నేరంపై అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వీరిలో నలుగురిని శుక్రవారం దోషులుగా గుర్తించింది. ఇద్దరు మైనర్లకు సంబంధించిన తీర్పు పెండింగ్‌లో ఉంది.
పోక్సో కేసులను విచారించే ఒక ప్రత్యేక కోర్టు శుక్రవారం ఈ కేసులోని నలుగురు నిందితుల్లో ఇద్దరిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్, బాలికల హత్య అభియోగాల్లో దోషులుగా నిర్ధరించింది.
సోమవారం ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభివర్ణించిన న్యాయమూర్తి రాహుల్ సింగ్, దోషులిద్దరు తుది శ్వాస వరకు ఈ జీవిత ఖైదు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వారిద్దరికీ రూ. 41 వేల చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు.
లఖ్‌నవూకు 200 కి.మీ దూరంలోని టమోలీ పూర్వ గ్రామంలో నిరుడు సెప్టెంబర్ 14వ తేదీన ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారిలో ఒకరి వయస్సు 15 ఏళ్లు కాగా, మరొకరి వయస్సు 17 ఏళ్లు.
నేరం జరిగిన 24 గంటల్లోగా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
బాలికలిద్దరూ నిందితుల్లో కొందరితో స్నేహంగా ఉండేవారని, నిందితుల బైక్‌లపై వారు ఇష్టపూర్వకంగానే బయటకు వెళ్లారని పోలీసులు చెప్పారు.
ఆ తర్వాత పెళ్లి గురించి బాలికలు ఒత్తిడి చేయడంతో వారిని రేప్ చేసి, చంపేసి తర్వాత ఇతర నిందితుల సహాయంతో వారిని చెట్టుకు ఉరి తీశారని పోలీసులు వెల్లడించారు. కానీ, పోలీసుల దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తిన బాలికల కుటుంబ సభ్యులు, తమ ఇంటి బయట నుంచే వారిద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు ఆరోపించారు.
ఈ కేసులో ఇద్దరు మైనర్లకు సంబంధించిన తీర్పు తర్వాత వస్తుందని మీడియాతో ప్రాసిక్యూషన్ లాయర్ బ్రజేశ్ కుమార్ పాండే చెప్పారు.
ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా భయమేస్తోందా? అయితే అది ఇదే..
ఎలా పడుకుంటే మంచిది? ఛాతీలో మంట, మెడ నొప్పి, నడుం నొప్పి తగ్గాలంటే ఏ భంగిమలో పడుకోవాలి?
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాను ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’ అని ఎందుకు అంటారు?
అదానీ-హిండెన్‌బర్గ్ స్కామ్: రిపోర్టు సమర్పణకు మరో 15 రోజులు గడువు కోరిన సెబీ

ఫొటో సోర్స్, Getty Images
అదాని హిండెన్‌బర్గ్ స్కామ్ విచారణ రిపోర్టును అందించడానికి తనకు మరో 15 రోజుల సమయం కావాలని సెబీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.
ఆగస్టు 14 లోగా రిపోర్టు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందు సెబీని ఆదేశించింది.
అయితే, విచారణ ప్రక్రియ ముగిసిందని, రిపోర్టును రూపొందించడానికి కొంత సమయం పడుతుందని ఆ సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది.
సెబీ తరఫున దాని లాయర్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా, వాటి కాపీలను బీబీసీ పరిశీలించి ధృవీకరించుకుంది.
ఈ స్కామ్‌కు సంబంధించి 24 అంశాలలో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 17 అంశాలలో విచారణను పూర్తి చేశామని, వీటిని తమ విచారణ ప్రొసీజర్‌లో భాగంగా సంబంధిత సంస్థలను సంప్రదించి నిర్ధరించుకున్నామని సెబీ కోర్టుకు తెలిపింది.
ఆగస్టు 29న ఈ పిటిషన్ పై తదుపరి విచారణను కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్: షిమ్లాలో కొండచరియలు విరిగి ఆలయంపై పడటంతో 9మంది మృతి

ఫొటో సోర్స్, ANI
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాజధాని షిమ్లాలో కొండచరియలు విరిగిపడి ఆలయంపై పడటంతో అందులో ఉన్న భక్తులు 9మంది మరణించారు. ఇంకా అనేకమంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఆందోళన చెందుతున్నారు.
సోమవారంనాడు సావన్ పండుగ ఉండటంతో స్థానిక శివాలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
శిథిలాల కింద రెండు డజన్లమంది వరకు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు కూడా పాతికమంది వరకు ఈ శిథిలాలలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు సోలన్‌లోని కందఘాట్ రెండు ఇళ్లపై కొండ చరియలు పడటంతో ఆ ఇళ్లు కూలిపోగా అందులో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఐదు మృతదేహాలను వెలికి తీశారు.
“సోలన్ జిల్లాలోని జాడోన్ గ్రామంలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా 7గురు మరణించిన ఘటన నన్ను కలచి వేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ఆదేశించాం’’ అని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ట్వీట్ చేశారు.
భారీ వర్షాల కారణంగా ఈ రోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయంటూ భారత వాతావరణ శాఖ ఇంతకు ముందే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ 20 సిరీస్‌ను భారత జట్టు 2-3 తేడాతో కోల్పోయింది.
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ వెస్టిండీస్ జట్టు 3-2తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేరుకుంది.
వెస్టిండీస్ జట్టులో 85 పరుగులతో బ్రెండన్ కింగ్ అజేయంగా నిలవగా, నికోలాస్ పూరన్ 47 పరుగులతో విజయానికి తన వంతు సహకారం అందించాడు.
భారత ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ 61 పరుగులు, తిలక్ వర్మ 27 పరుగులు చేశారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌పై క్లిక్ చేయండి.
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మహాత్మాగాంధీ ఎక్కడ ఉన్నారు... ఏం చేస్తున్నారు?
